Telugu Global
Cinema & Entertainment

Chandra Mohan: చిరంజీవి అర్జునుడు అయితే అల్లు అరవింద్ శ్రీకృష్ణుడు.. సీనియర్ నటుడు చంద్రమోహన్ కామెంట్స్

అల్లు అరవింద్ లేనిదే..చిరంజీవి లేడని చంద్రమోహన్ సంచలన కామెంట్స్ చేశారు. అప్పట్లో తనకు కూడా అల్లు అరవింద్ వంటి సలహాలు ఇచ్చే వ్యక్తి తన వెంట ఉండి ఉంటే తన కెరీర్ మరో స్థాయిలో ఉండేదని చంద్రమోహన్ పేర్కొన్నారు.

Chandra Mohan
X

చంద్రమోహన్

టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి అర్జునుడు అయితే నిర్మాత అల్లు అరవింద్ శ్రీకృష్ణుడు అని కామెంట్స్ చేశారు. చంద్రమోహన్ రంగులరాట్నం అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్‌లో వెయ్యికి పైగా సినిమాల్లో నటించారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. వృద్ధాప్యం కారణంగా కొంతకాలంగా ఆయన సినిమాల్లో నటించడం లేదు. నాలుగేళ్ల కిందట గోపీచంద్ హీరోగా తెరకెక్కిన ఆక్సిజన్ సినిమా తర్వాత మరో సినిమాలో చంద్రమోహన్ నటించలేదు.

కాగా ఇటీవల ఒక మీడియా సంస్థతో చంద్రమోహన్ మాట్లాడారు. ఈ సందర్భంగా తన సినిమాల గురించి, కెరీర్లో చిరంజీవి ఎదిగిన తీరు గురించి వివరించారు. చిరంజీవి నటుడిగా పరిచయమైన ప్రాణం ఖరీదు నుంచి ఆయనతో కలిసి నటిస్తున్నట్లు చంద్రమోహన్ చెప్పారు. నటుడిగా ఎదగాలనే కసి అప్పట్లోనే తాను చిరంజీవిలో గమనించినట్లు చంద్రమోహన్ తెలిపారు. అప్పట్లో తాను నటించే సినిమాల్లో డ్యాన్స్ బాగా వేసే వాడినని..అయితే చిరంజీవి మాత్రం డ్యాన్స్ కు తన స్టైల్ జోడించి చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారని చెప్పారు.

ఈ సందర్భంగా చంద్రమోహన్ చిరంజీవిని అర్జునుడితో పోల్చారు. అలాగే అల్లు అరవింద్‌ని శ్రీకృష్ణుడితో పోల్చారు. శ్రీకృష్ణుడు లేనిదే అర్జునుడు లేడని.. అలాగే అల్లు అరవింద్ లేనిదే..చిరంజీవి లేడని చంద్రమోహన్ సంచలన కామెంట్స్ చేశారు. అప్పట్లో తనకు కూడా అల్లు అరవింద్ వంటి సలహాలు ఇచ్చే వ్యక్తి తన వెంట ఉండి ఉంటే తన కెరీర్ మరో స్థాయిలో ఉండేదని చంద్రమోహన్ పేర్కొన్నారు. కాగా కొంతకాలంగా మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీకి మధ్య కొంత విభేదాలు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిని పలుమార్లు అల్లు అరవింద్ ఖండించారు. ఈ నేపథ్యంలో చంద్రమోహన్ చిరంజీవి, అల్లు అరవింద్ గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

First Published:  5 Dec 2022 8:56 AM GMT
Next Story