Telugu Global
Andhra Pradesh

కాస్ట్యూమ్స్ కృష్ణ మృతి.. ఇండస్ట్రీలో ఆయన్ను మోసం చేసింది ఎవరో తెలుసా..?

ఇండస్ట్రీలోకి కాస్ట్యూమ్ డిజైనర్ గానే ఆయన ఎంట్రీ ఇచ్చారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి, వాణిశ్రీ, జయసుధ, జయప్రద, శ్రీదేవి.. ఇలా హీరోహీరోయిన్లకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు.

కాస్ట్యూమ్స్ కృష్ణ మృతి.. ఇండస్ట్రీలో ఆయన్ను మోసం చేసింది ఎవరో తెలుసా..?
X

నటుడు, నిర్మాత, ఆనాటి తరం నటీనటులకు కాస్ట్యూమ్స్ డిజైనర్.. బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరున్న కాస్ట్యూమ్స్ కృష్ణ చెన్నైలోని ఆయన నివాసంలో మృతి చెందారు. గతకొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. విజయనగరం జిల్లా, లక్కవరపు కోటలో జన్మించిన కృష్ణ.. టాలీవుడ్ లో చాలా సినిమాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌ గా పనిచేశారు. సినిమాల నుంచి విరామం తీసుకున్న తర్వాత ఆయన చెన్నైలోని అపార్ట్ మెంట్ లో నివాసం ఉండేవారు. అక్కడే ఆయన తుదిశ్వాస విడిచారు.

కాస్ట్యూమ్ డిజైనర్ గా..

ఇండస్ట్రీలోకి కాస్ట్యూమ్ డిజైనర్ గానే ఆయన ఎంట్రీ ఇచ్చారు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో పూర్తిస్థాయి కాస్ట్యూమ్ డిజైనర్‌ గా పనిచేశారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి, వాణిశ్రీ, జయసుధ, జయప్రద, శ్రీదేవి.. ఇలా హీరోహీరోయిన్లకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు.

నిర్మాతగా..

సూపర్ స్టార్ కృష్ణ హీరోగా అశ్వద్ధామ చిత్రాన్ని నిర్మించారు కాస్ట్యూమ్స్ కృష్ణ. ఆ సినిమా సక్సెస్ తర్వాత పెళ్లాం చెప్తే వినాలి, మా ఊరు మారాజు, పుట్టింటికి రా చెల్లి, చివరిగా పెళ్లి పందిరి సినిమాలు నిర్మించారాయన. మొత్తం 8 సినిమాలు నిర్మించారు కాస్ట్యూమ్స్ కృష్ణ.

నటుడిగా..

నటుడిగా కాస్ట్యూమ్స్ కృష్ణ తొలి సినిమా భారత్‌ బంద్. దర్శకుడు కోడి రామకృష్ణ ఆయన్ను నటుడిగా వెండితెరకు పరిచయం చేశారు. ఆ తర్వాత కోడి రామకృష్ణ దర్శకత్వంలోనే కాస్ట్యూమ్స్ కృష్ణ చాలా సినిమాల్లో నటించారు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించారు. వెటకారంగా మాట్లాడే విలనిజంకి ఆయన పెట్టింది పేరు.

ఇండస్ట్రీలో మోసం..

జగపతిబాబు హీరోగా పెళ్లిపందిరి సినిమా నిర్మించారు కాస్ట్యూమ్స్ కృష్ణ. ఆ సినిమా ప్రచారానికి ఆయనకు బయ్యర్లు 2 లక్షలు అప్పు ఇచ్చారట. అయితే అప్పు తీసుకునే సందర్భంలో బాండ్ పేపర్లపై సినిమా నెగెటివ్ రైట్స్ కూడా వారు రాయించుకున్నారు. ఈ విషయం నిర్మాతకు తెలియదు. ఆయన్ను మోసం చేసి నెగెటివ్ రైట్స్ రాయించుకున్నారట. దీంతో ఆయన బాగా బాధపడ్డారని, ఆ తర్వాత సినిమాలపై విరక్తి చెంది ఇండస్ట్రీకి దూరమయ్యారని చెబుతారు. చివరి రోజుల్లో చెన్నైలోని అపార్ట్ మెంట్ లోనే ఉండేవారు. అనారోగ్యంతో కన్నుమూశారు.

First Published:  2 April 2023 5:05 AM GMT
Next Story