Telugu Global
Cinema & Entertainment

SatyaDev | కొత్త కథలన్నీ నాకే వస్తున్నాయి

SatyaDev - తన దగ్గరకు చాలా కొత్త కథలు వస్తున్నాయని, అందులోంచి తన మనసుకు నచ్చిన కథలు ఎంచుకుంటున్నానని అంటున్నాడు హీరో సత్యదేవ్.

SatyaDev | కొత్త కథలన్నీ నాకే వస్తున్నాయి
X

వెర్స‌టైల్ హీరో స‌త్య‌దేవ్ హీరోగా న‌టించిన చిత్రం ‘కృష్ణ‌మ్మ‌’. వి.వి.గోపాలకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి ఈ మూవీని నిర్మించారు.

ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ సినిమాను మే 10న భారీ ఎత్తున‌ విడుదల చేస్తున్నాయి. ఈ సందర్బంగా హీరో సత్యదేవ్ మీడియాతో మాట్లాడాడు. తన వద్దరు ప్రతి రోజూ కొత్త కథలు చాలా వస్తున్నాయన్నాడు.

"నేను మొదట్నుంచి కొత్త కొత్త కథలే తీసుకుంటున్నాను కాబట్టే ఇక్కడ ఉన్నాను. నా దగరికి చాలా కథలు వస్తున్నాయి. అన్నీ చేయలేకపోయినా నా వరకు కొత్తగా ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. ఇందులో ఒక చిన్న క్రిమినల్ పాత్ర, తర్వాత ఒక క్రైం కామెడీ, ఆ తర్వాత బ్యాంక్ మేనేజర్ గా, ఇంకో సినిమాలో ఆటో డ్రైవర్ గా చేస్తున్నా.. ఇలా ప్రతి సినిమాకి వేరియేషన్ చూస్తాను."

హీరోగా నటిస్తూనే, ప్రత్యేక పాత్రలు చేస్తానంటున్నాడు సత్యదేవ్. అయితే క్యారెక్టర్ బాగుంటేనే ప్రత్యేక పాత్రలు చేస్తానని క్లారిటీ ఇచ్చాడు.

"గాడ్ ఫాదర్ లో చిరంజీవి గారికి ఆపోజిట్ గా చేశాను. రామసేతులో అక్షయ్ కుమార్ గారి పక్కన చేశాను. మళ్ళీ ఆ రేంజ్ పాత్రలు రాలేదు. అలాంటివి చాలా క్యారెక్టర్స్ అడిగారు కానీ ఆ పాత్రలకు కనీసం సమానంగా ఉండే పాత్రలు రాలేదు అందుకనే చేయట్లేదు. మంచి పాత్రలు వస్తే చేస్తాను. రామసేతు తర్వాత హిందీలో కూడా ఛాన్సులు వస్తున్నాయి కానీ మంచి పాత్ర కోసం చూస్తున్నాను. తమిళ్ లో కూడా అవకాశాలు వస్తున్నాయి. త్వరలో చేస్తానేమో."

సినిమాల్లో హీరో పాత్రలు, స్టార్ హీరోల సినిమాల్లో ప్రత్యేక పాత్రలతో పాటు.. మంచి కథలు దొరికితే వెబ్ సిరీసులు కూడా చేస్తానంటున్నాడు సత్యదేవ్. ఇప్పటికే గాడ్, లాక్డ్, వెబ్ సిరీసు లు చేసిన ఈ నటుడు.. మంచి పాత్రలు దొరికితే ఓటీటీలో నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నాడు.

First Published:  8 May 2024 5:30 PM GMT
Next Story