Telugu Global
Cinema & Entertainment

పుంజులు 5 పండుగ ఒకటి!

సంక్రాంతి కోళ్ళ పందాలు ప్రారంభమయ్యాయి. సినిమా కోళ్ళ పందాలు. ఈ పందాల్లో ఐదు పుంజులు ఒకదానితో ఒకటి తలపడబోతున్నాయి. ఇది ఏ సంక్రాంతికీ లేని రికార్డు. ఇంత మంది హీరోలు సంక్రాంతికే పోటీ పడడం.

పుంజులు 5 పండుగ ఒకటి!
X

సంక్రాంతి కోళ్ళ పందాలు ప్రారంభమయ్యాయి. సినిమా కోళ్ళ పందాలు. ఈ పందాల్లో ఐదు పుంజులు ఒకదానితో ఒకటి తలపడబోతున్నాయి. ఇది ఏ సంక్రాంతికీ లేని రికార్డు. ఇంత మంది హీరోలు సంక్రాంతికే పోటీ పడడం. ఈ పోటీలో థియేటర్ల పంపకం పెద్ద పుంజులకే పరిమితమైంది. చిన్న పుంజు ఒకటి పానిండియా రిలీజ్ పెట్టుకుని అయోమయంలో పడింది. దీనికి హైదరాబాద్ లో రెండంటే రెండే థియేటరు దక్కి షాక్ తిన్నారు. జనవరి 22 న అయోధ్య టెంపుల్ ప్రారంభోత్సవ సంధార్భాన్ని అంది పుచ్చుకుని నార్త్ ఇండియాలో హిందీ వెర్షన్ విడుదల చేయాలన్న దీని నిర్మాత మొర ఆలకించే వారు లేరు. ఈ మూవీ పేరు ‘హను-మాన్’. ప్రశాంత్ వర్మ దర్శకుడు. తేజా సజ్జా హీరోగా ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానరుతో నిరంజన్ రెడ్డి కందగట్ల నిర్మాత. అంజనాద్రి అనే కాల్పనిక గ్రామం నేపథ్యంలో దీని సోషియో ఫాంటసీ కథ. ఇందులో అమృతా అయ్యర్, వరలక్ష్మీ శరత్ కుమార్, వినయ్ రాయ్ ఇతర నటీనటులు. సంగీతం : అనుదీప్ దేవ్, హరి గవర, కృష్ణ సౌరభ్, ఛాయాగ్రహణం : దాశరధి శివేంద్ర. హాలీవుడ్ లో సూపర్ మాన్ సినిమాల్లాగా ఇది కూడా అలాటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అవుతుంది పండక్కి.

మహేష్ బాబు ‘గుంటూరు కారం’ పడుతూ లేస్తూ మొత్తానికి 12 వ తేదీ డెడ్ లైన్ ని అందుకుంది. నిర్మాణంలో ఎన్నో చిక్కులు, ఆలస్యాలు మహేష్ బాబుకే విరక్తి పుట్టించాయి. సినిమా 12వ తేదీ విడుదలవుతున్నా, స్టోరీ ముందే విడుదలైపోయిందని సోషల్ మీడియాలో హాహాకారాలు చెలరేగుతున్నాయి. ఈ స్టోరీ రాజకీయాల బ్యాక్ డ్రాప్‌లో వుంటుందని, సూపర్ స్టార్ మహేష్ బాబు వెంకటరమణా రెడ్డి పాత్రలో కనిపించనున్నాడని పాత్ర పేరు కూడా లీక్ అయిపోయింది. ఇదెంతవరకు నిజమోగానీ, రాజకీయాలంటే ఇష్టం లేని వెంకటరమణా రెడ్డి తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని రాజకీయ శత్రువుల్ని ఎలా ఎదుర్కొన్నాడనేదే గుంటూరు కారం మూవీ కథ అని సోకాల్డ్ లీకు వైరల్ అవుతోంది. ఇందులో డాన్సింగ్ డాల్ శ్రీలీల, మీనాక్షీ చౌదరి, రమ్యకృష్ణ, జగపతి బాబు, సునీల్, ప్రకాష్ రాజ్ ఇతర తారాగణం. ఈ మూవీని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాతలు నాగవంశీ, రాధాకృష్ణ తెరకెక్కించారు. ఎస్‌. తమన్ సంగీతం, మనోజ్ పరమహంస ఛాయాగ్రహణం. దర్శకత్వం : త్రీవిక్రమ్ శ్రీనివాస్.

అక్కినేని నాగార్జున నటించిన ‘నా సామిరంగా’ రోమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోంది. విజయ్ బిన్నీ దర్శకత్వం వహించాడు. ఇది మలయాళం హిట్ ‘పోరింజు మరియం జోస్’ కి రీమేక్. నాగార్జునతో బాటు రుక్సార్ థిల్లాన్, మర్నా మీనన్, ఆషికా రంగనాథ్, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ వంటి ఆకర్షణీయ తారాగణముంది. ఎం ఎం కీరవాణి సంగీతం, శివేంద్ర దాశరధి ఛాయాగ్రహణం. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మాత. ఇది జనవరి 14 న విడుదల. పండుగ నేపథ్యంలో సాగే ఈ కథ ఒక రౌడీ, ఒక భూస్వామి మధ్య వారి కామన్ ఫ్రెండ్ తో స్నేహం, ప్రేమ, పగా కలగలిసిన కథ.

దగ్గుబాటి వెంకటేష్ ‘సైంధవ్’ ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్. ఇందులో వెంకటేష్ ది సైకో అనే పాత్ర. సైకో కూతురికి అరుదైన వెన్నెముక కండరాల వ్యాధి వుంటుంది. దీని చికిత్సకి 17 కోట్ల రూపాయలు విలువజేసే ఇంజెక్షన్ అవసరం. ఈ ఇంజెక్షన్ కోసం సైకో ఏం నేరాలు చేశాడన్నది కథ. వెంకటేష్ తో బాటు ఆండ్రియా జెరెమియా, శ్రద్ధా శ్రీనాథ్, బేబీ సారా, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, రుహానీ శర్మ నటించారు. నిహారికా ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి నిర్మించారు. సంగీతం : సంతోష్ నారాయణ్, ఛాయాగ్రహణం : మణికందన్, దర్శకత్వం : శైలేష్ కొలను. జనవరి 13 న విడుదల.

రవితేజ నటించిన ‘ఈగిల్’ అనే యాక్షన్ మూవీ ఛాయాగ్రహకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వస్తోంది. ఇందులో అనుపమా పరమేశ్వరన్, కావ్యా థాపర్, అవసరాల శ్రీనివాస్, అజయ్ ఘోష్, నితిన్ మెహతా ఇతర తారాగణం. పూర్తి స్థాయి యాక్షన్ మూవీ ఇది. సంగీతం : దవ్జండ్, ఛాయాగ్రహణం : కార్తీక్ ఘట్టమనేని, కమిల్ ప్లోకీ, కర్మ్ చావ్లా. రెండు ఫ్లాపుల తర్వాత రవితేజ ఆశలు దీని మీదే వున్నాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానరుపై టి.జి. విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించారు. ఇది జనవరి 14 న విడుదలవుతోంది.

ఈ విధంగా జనవరి 12-14 మధ్య 4 రోజుల్లో 5 సంక్రాంతి సినిమాలు సంసిద్ధమయ్యాయి. వీటిలో నాలుగిటితో మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్, రవితేజల వంటి ఆకర్షణీయమైన నలుగురు స్టార్లు విభిన్న సినిమాలతో వినోదాన్ని పంచబోతున్నారు. ఐదవది చిన్న హీరోతో ‘హనుమాన్’ విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు. ఈ పోటాపోటీల్లో ఎవరెవరురు నెగ్గుతారనేది, పందాలాడి ఏఏ పుంజుల్ని గెలిపిస్తారనేది ప్రేక్షకుల చేతిలో వుండే ఆర్ధిక స్థోమత మీద ఆధారపడి వుంటుంది. ఐదు సంక్రాంతి సినిమాలకి నిధులు ఇప్పట్నుంచే సమకూర్చుకోవాలి. నాలుగు వారాలాగితే ఓటీటీల్లో వస్తాయిగా అనుకుంటే అంతకంటే సినిమా ద్రోహముండదు.

First Published:  4 Jan 2024 7:18 AM GMT
Next Story