Telugu Global
Cinema & Entertainment

జోరుగా శాండల్‌వుడ్ స్టార్లు వచ్చేస్తున్నారు!

2023 సెప్టెంబర్ 1 న ‘సప్త సాగర దాచే ఎల్లో’ (సప్త సముద్రాలు దాటి ) సూపర్ హిట్ తో కన్నడ సినిమా పరిశ్రమ డిసెంబర్ వరకూ ఈ నాలుగు నెలల కాలంలో మరిన్ని ఆసక్తికర సినిమాల శ్రేణితో ప్రేక్షకుల ముందుకు రానుంది.

జోరుగా శాండల్‌వుడ్ స్టార్లు వచ్చేస్తున్నారు!
X

2023 సెప్టెంబర్ 1 న ‘సప్త సాగర దాచే ఎల్లో’ (సప్త సముద్రాలు దాటి ) సూపర్ హిట్ తో కన్నడ సినిమా పరిశ్రమ డిసెంబర్ వరకూ ఈ నాలుగు నెలల కాలంలో మరిన్ని ఆసక్తికర సినిమాల శ్రేణితో ప్రేక్షకుల ముందుకు రానుంది. పానిండియా సినిమాలు అందించక పోయినా, జనవరి- సెప్టెంబర్ మధ్య హాస్టల్ హుడుగారు బేకగిద్దరే, గురుదేవ్ హొయసల, బొబి, కౌసల్యా సుప్రజా రామ, ఆచార్ అండ్ కో, సప్త సాగర దాచే ఎల్లో - వంటి 6 చిన్న బడ్జెట్ సినిమాలు మాత్రమే హిట్టయి- భారీ బడ్జెట్ తో తీసిన కబ్జా, క్రాంతి యాక్షన్ సినిమాలు అట్టర్ ఫ్లాపయ్యాయి.

దీంతో దృష్టి రాబోయే నెలల్లో విడుదల కానున్న స్టార్‌ సినిమాల మీద పడింది పెద్ద హిట్స్ కోసం. ఈ స్టార్స్ వరసలో ఉపేంద్ర, డా. శివరాజకుమార్, దర్శన్, ధృవ సర్జా, రక్షిత్ శెట్టి, డాలీ ధనంజయ, రాజ్ బి శెట్టి కొలువుదీరి వున్నారు. వీళ్ళందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విడుదలలతో మాస్‌ని ఆకర్షించడానికి సిద్ధమవుతున్నారు.

కన్నడ సూపర్‌ స్టార్లందరిలో కరుణాడ చక్రవర్తి డా. శివరాజకుమార్‌ ది ప్రథమ స్థానం. తన రాబోయే సినిమాల్లో డైనమిక్ డ్యాన్సింగ్ స్టార్ ప్రభుదేవా నటించిన ‘ఘోస్ట్’, ‘కరటక దమనక’ వున్నాయి. ఇటీవల తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో పాటు నటించిన ‘జైలర్’ ఎంత హిట్టయ్యిందో తెలిసిందే. అలాగే ధనుష్ తో ‘కెప్టెన్ మిల్లర్’ లో కూడా నటించాడు. ఇవిగాక, ‘నీ సిగోవరేగు’, ‘అశ్వత్థామ’, ఉపేంద్రతో ‘45’, ‘భైరతి రణగల్’ వంటి మరి కొన్ని సినిమాలు వచ్చే యేడాదికి రెడీ అవుతున్నాయి.

ఇక డిసెంబర్ లోగా విడుదలయ్యే సినిమాల్లో ఉపేంద్ర నటించిన ‘యూఐ’, ‘బుద్దివంత 2’, ‘త్రిశూలం’ వున్నాయి. ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ ‘రాజా వీర మధకరి నాయక’ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేయడానికి వస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ‘గరడి’ లో అతడి ప్రత్యేక పాత్ర కోసం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అగ్ర నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ నిర్మించిన ‘కాటెరా’ కూడా విడుదల కానుంది.

ఇక గోల్డెన్ స్టార్ గణేష్ నటించిన 'బాణ దరియల్లి', 'కృష్ణం ప్రణయ సఖి' సినిమాలు ఈ ఏడాది విడుదలయ్యే అవకాశం వుంది. రక్షిత్ శెట్టి ‘777 చార్లీ’ తో ఇప్పటికే దృష్టిని ఆకర్షించాడు. సెప్టెంబర్ లో ‘సప్త సాగరదాచే ఎల్లో’ అతడి హిట్టయిన మరో సినిమా. ప్రస్తుతం నిర్మాణంలో వున్న ‘రిచర్డ్ ఆంటోనీ’ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

డాలీ ధనుంజయ ,బహుళ భాషల్లో నటిస్తూ బిజీగా వున్నాడు. ఇతను కన్నడలో ‘తోతాపురి’2’, ఉత్తరకాండ’ సినిమాలతో వస్తున్నాడు. సూపర్ హిట్ హీరో ధృవ సర్జా నటించిన ‘మార్టిన్’ ట్రైలర్‌ సంచలనం సృష్టిస్తోంది. ఇది క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రేమ్ దర్శకత్వంలో ‘కేడీ’ కూడా రెడీ అవుతోంది. ఇందులో విలన్ సంజయ్ దత్.

‘ఒండు మొట్టేయ కథ’ తో పేరు తెచ్చుకున్న మల్టీ టాలెంటెడ్ రాజ్ బి. శెట్టి ‘టోబీ’ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నాడు. అంతే కాదు, అతిధి పాత్రలు పోషించిన ‘రమణ అవతార’, ‘స్వాతి ముత్తిన మలే హనియే’ కూడా విడుదల కాబోతున్నాయి.

ఇక మరోవైపు, ‘కెజిఎఫ్’ ఫేమ్ రాకింగ్ స్టార్ యష్, రిషబ్ శెట్టి ఇద్దరికీ వచ్చే ఐదు నెలల వరకు షెడ్యూల్ చేసిన లేవు. రిషబ్ శెట్టి ‘కాంతారా’ విజయం తర్వాత స్క్రిప్టు వర్క్ పూర్తి చేసే పనిలో వున్నాడు. యష్ అభిమానులు అతడి రాబోయే ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కన్నడ సినిమా రోరింగ్ స్టార్ శ్రీ మురళి ప్రస్తుతం నిర్మాణంలో వున్న 'భగీర', ‘భీమ' సినిమాలు రెండిటినీ పూర్తి చేసే పనిలో వున్నాడు.

కన్నడ ప్రేక్షకులు ఆశాజనకమైన వెంచర్‌ల విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూంటే, మరోవైపు శాండల్ వుడ్ భారీ హిట్స్ ని ఆశిస్తోంది. శక్తివంతమైన సినిమాలతో ఈ నాలుగు నెలల్లో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసి, శాండల్ వుడ్ మునుపెన్నడూ లే నంతగా పటిష్టంగా వుండేలా ఆర్ధిక విజయాలు పొందడం ఖాయమని భావిస్తోంది.

First Published:  27 Sep 2023 11:24 AM GMT
Next Story