Telugu Global
Cinema & Entertainment

సమస్యలన్నీ చుట్టుముట్టడంతో కుంగిపోయా.. సమంత ఆవేదన

విడాకులు తీసుకున్న తర్వాత తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలపై తాజాగా సమంత స్పందించింది. ఓ ఇంగ్లిష్ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె త‌న ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

సమస్యలన్నీ చుట్టుముట్టడంతో కుంగిపోయా.. సమంత ఆవేదన
X

``ఏ మాయ చేశావే`` సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ సమంత. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఆమెకు అగ్రహీరోల సరసన న‌టించేందుకు వ‌రుస‌ అవకాశాలు ల‌భించాయి. చూస్తుండగానే ఆమె తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. హీరోయిన్ గా సినిమాలు చేస్తున్న సమయంలోనే హీరో నాగ చైతన్యతో ప్రేమలో పడింది సమంత. ఆ తర్వాత వారిద్దరూ పెద్దల ఆశీర్వాదంతో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కొన్నేళ్లు సమంత వైవాహిక జీవితం బాగానే సాగినా ఆ తర్వాత చైతూతో విభేదాలు తలెత్తాయి. ఆ తర్వాత పరస్పర అంగీకారంతో సమంత, చైతన్య విడాకులు తీసుకున్నారు.

చైతూతో విడాకులు తీసుకున్న కొద్దిరోజులకే సమంత అనారోగ్య బారిన‌ప‌డింది. ఆమె నటించిన సినిమాలు కూడా వరుసగా ఫెయిల్ అయ్యాయి. కాగా, విడాకులు తీసుకున్న తర్వాత తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలపై తాజాగా సమంత స్పందించింది. ఓ ఇంగ్లిష్ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తన విడాకులు, వరుస ప్లాపులు, ఆరోగ్య సమస్యలు అన్నీ ఒకేసారి చుట్టుముట్టడంతో తానెంతో కుంగిపోయినట్లు వెల్లడించింది.

'ఒకవైపు నా ఆరోగ్యం దెబ్బతింటున్న సమయంలోనే చైతన్యతో నా వివాహ బంధం ముగిసింది. అదే సమయంలోనే నేను నటించిన పలు సినిమాలు ప్లాప్ అయ్యాయి. దీంతో ఎంతో వేదనకు గురయ్యా. వరుసగా ఎదురైన సమస్యలతో రెండేళ్లుగా నేనెంతో కుంగుబాటుకు గురయ్యా. నాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ.. ట్రోలింగ్ కు గురైన నటీనటుల గురించి చదివా. వారు తమ ఆరోగ్య సమస్యలను ఎలా ఎదుర్కొన్నారు?.. ట్రోలింగ్ నుంచి ఎలా తట్టుకొని బ‌య‌ట‌ప‌డ్డారో తెలుసుకున్నా.

వారి గురించి తెలుసుకోవడం నాకెంతో ఉపయోగపడింది. వారు సమస్యలు ఎదుర్కొన్నట్లు నేను కూడా ఎదుర్కోగలనన్న ధైర్యం వచ్చింది. అదే నాకు బలాన్ని ఇచ్చింది. సినీ నటుల జీవితాలు అంటే ఎప్పుడు సినిమాల ఫలితాలు, అవార్డులు, వాళ్ళ దుస్తులు మాత్రమే కాదు. వాళ్లకు కూడా కష్టాలు, బాధలు ఉంటాయి. నేను ఎదుర్కొంటున్న కష్టాల గురించి అందరికీ తెలిసిందని నేనేమీ బాధపడటం లేదు' అని సమంత వివ‌రించింది.

First Published:  9 Nov 2023 9:52 AM GMT
Next Story