Telugu Global
Cinema & Entertainment

Samantha: సమంత ఆరోగ్యంగానే ఉంది.. పుకార్లను నమ్మొద్దు.. మేనేజర్ క్లారిటీ

Samantha Health Condition: సమంత అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఆమె ఇంట్లోనే ఉందని, ఆరోగ్యంగా ఉందని చెప్పారు.

Samantha: సమంత ఆరోగ్యంగానే ఉంది.. పుకార్లను నమ్మొద్దు.. మేనేజర్ క్లారిటీ
X

స్టార్ హీరోయిన్ సమంత ఆరోగ్యం బాగోలేదని.. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతోందని ఇవాళ ఉదయం నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే ఆ వార్తల్లో నిజం లేదని.. సమంత ఆరోగ్యంగానే ఉందని ఆమె మేనేజర్ క్లారిటీ ఇచ్చారు. సమంత కొద్ది రోజులుగా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి కొద్ది రోజుల కిందట స్వయంగా ఆమె వెల్లడించారు.

ఈ వ్యాధి నయం కావడానికి సమంత ఇంటి వద్దే ఉంటూ చికిత్స పొందుతోంది. దీని కోసం ఆమె కొన్ని నెలలుగా షూటింగ్‌లకు దూరంగా ఉంటోంది. ఆమె నటించిన యశోద సినిమా ఇటీవల విడుదలై మంచి టాక్ అందుకొంది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే సమంత తాను మయోసైటిస్‌తో బాధపడుతున్నట్లు తెలిపారు. ఈ వ్యాధికి చికిత్స పొందుతూనే ఆ సినిమాకు సంబంధించి డబ్బింగ్‌ను సమంత పూర్తి చేసింది.

కాగా గురువారం ఉదయం ఉన్నట్టుండి సమంత అనారోగ్యానికి గురైందని .. దీంతో ఆమెను కుటుంబ స‌భ్యులు హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్లు ప్రచారం మొదలైంది. సమంత ఆస్పత్రిలో ఉందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పోస్టులు పెడుతున్నారు.

ఈ ప్రచారం నేపథ్యంలో తాజాగా సమంత మేనేజర్ స్పందించారు. సమంత అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఆమె ఇంట్లోనే ఉందని, ఆరోగ్యంగా ఉందని చెప్పారు. సమంత ఆరోగ్యంగానే ఉందని ఆమె మేనేజర్ ఇచ్చిన క్లారిటీతో సమంత ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. కాగా సమంత ప్రస్తుతం శాకుంతలం, ఖుషి సినిమాల్లో నటిస్తుండగా.. శాకుంతలం చిత్రీకరణ దాదాపు పూర్తయింది. ఖుషి షూటింగ్ మాత్రం సమంత అనారోగ్యం వల్ల ఆగిపోయింది.

Next Story