Telugu Global
Cinema & Entertainment

సాలార్, యానిమల్ సెన్సార్ కాని వెర్షన్లకు నో?

ఇక రెండు పెద్ద సినిమాలు స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్నాయి. ఇవి సాలార్, యానిమల్. 'యానిమల్' చుట్టూ వున్న సందడి నెట్‌ఫ్లిక్స్‌పై కేంద్రీకృతమై వుంది. దీని సెన్సార్ చేయని వెర్షన్‌ ని ప్రసారం చేయడానికి నిర్ణయించినట్టు వార్తలు వెలువడుతున్నాయి.

సాలార్, యానిమల్ సెన్సార్ కాని వెర్షన్లకు నో?
X

ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల ఆగమనంతో వినోద పరిశ్రమకి సంబంధించి ప్రేక్షకుల్లో భిన్నమైన క్రేజ్ తలెత్తింది. ఓటీటీల్లో అన్ని రకాల కంటెంట్‌ ని చూపించే పూర్తి స్వేచ్ఛ వుంది. కానీ ఇప్పుడు సెన్సార్ బోర్డు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల కంటెంట్‌పై విరుచుకుపడడం ప్రారంభించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిమ్ సర్టిఫికేషన్ (CBFC) సినిమాలపై అన్యాయమైన సెన్సార్‌షిప్‌ విధించడంపై తీవ్ర చర్చ మొదలైంది. ఈ సెన్సార్ షిప్ పై నెటిజన్లు కూడా సంతోషంగా లేరు. వెబ్ సిరీస్ కి ఏ సెన్సారూ లేనప్పుడు సినిమాలకి ఎందుకుండాలన్నది ప్రశ్న. సెన్సార్ బోర్డు కఠిన నిబంధనలతో సినిమాల సెన్సార్‌షిప్ ని నియంత్రించడంపై చర్చలు తీవ్రమవుతున్న తరుణంలో, ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ కూడా దిగి వచ్చి ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమాల సెన్సార్ చేయని వెర్షన్‌ల ప్రసారాన్ని పూర్తిగా నిలిపివేయడం సినిమా నిర్మాతలకూ మింగుడు పడడం లేదు.

ఈ సంవత్సరం విడుదలైన అనేక భారతీయ సినిమాల్ని సమీక్షించిన తర్వాత ఈ వేటు వేసింది నెట్ ఫ్లిక్స్. సినిమాల్లో ప్రస్తుత ప్రభుత్వానికి అనుకూలంగా లేదని భావించే రాజకీయ కంటెంట్‌ ని నిరోధించే ఉద్దేశంతోనే సెన్సార్ బోర్డు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలని సెన్సార్ నిబంధనల పరిధి లోకి తెచ్చింది. నెట్ ఫ్లిక్స్ ఈ నిబంధనల్ని అంగీకరించడంతో బాటు, ఇటీవల ధూమపానం, మద్యపానం సన్నివేశాల్లో థియేట్రికల్ వెర్షన్ లలో లాగా చట్టబద్ధమైన హెచ్చరికల్ని వేయడం ప్రారంభించింది.

నెట్ ఫ్లిక్స్ ప్రసారాలు నిలిపివేసిన సినిమాల్లో అనుభవ్ సిన్హా దర్శకత్వంలో ‘భీడ్’ (హిందీ), లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘లియో’ (తమిళం), కార్తీ నటించిన ‘జపాన్’ (తమిళం), అమిత్ రాయ్ దర్శకత్వంలో ‘ఓ మై గాడ్ 2’ (హిందీ) వున్నాయి. రాజకీయ, మతపర, లేదా శృంగార పరమైన కంటెంట్ తో కూడిన భారతీయ సినిమాల సెన్సార్ కాని వెర్షన్లు ఇకపై నెట్ ఫ్లిక్స్ లో కనిపించవు. ఇతర స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు కొంతకాలంగా సెన్సార్ బోర్డు ఆదేశాల్ని అనుసరిస్తున్నప్పటికీ, నిర్దిష్ట సినిమాలకు కొన్ని మినహాయింపులతో నెట్‌ఫ్లిక్స్ ఈ విధానాన్ని పాటించకపోవడంతో, ప్రేక్షకులకి థియేటర్లో ఒక వెర్షన్, నెట్ ఫ్లిక్స్ లో ఇంకో వెర్షన్ చూసేందుకు అందుబాటులో వుండేవి. ఇకపై ఈ అవకాశం లేదు.

కోవిడ్ లాక్ డౌన్ కాలంలో స్ట్రీమింగ్ అయిన ‘భీడ్’ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వాయిసోవర్ తో పాటు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వాయిసోవర్ తోనూ వుంది. సినిమాలో అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ కామెంట్లపై తీవ్ర అభ్యంతరం చెప్పిన సెన్సార్ బోర్డు, వాటిని తొలగించాలని నెట్ ఫ్లిక్స్ ని ఆదేశించింది. ఆ తొలగింపులతో నెట్ ఫ్లిక్స్ సినిమాని స్ట్రీమింగ్ చేసింది. అంటే ఇకపై ప్రేక్షకులు ‘ఏ’ సర్టిఫికేట్, ‘యూఏ’ సర్టికెట్ పొందిన ఇండియన్ సినిమాల సెన్సార్ కట్స్ లేని వెర్షన్లని నెట్ ఫ్లిక్స్ లో చూడలేరన్న మాట. ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ ఒక్కటే భారత సినిమాల సెన్సార్ చేయని వెర్షన్‌లని క్రమం తప్పకుండా ప్రసారం చేస్తూ వచ్చింది. దీనికి ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్టింది. కార్తీ నటించిన ‘జపాన్’ లో అంబానీ –అదానీ లని ప్రస్తావించే సన్నివేశం వుంది. దీనికి సినిమాలో సెన్సార్ కట్ పడింది. నెట్ ఫ్లిక్స్ లో కట్ లేని వెర్షన్ ప్రసారమైంది. దీనికిప్పుడు కత్తెర వేసింది.

ఫేస్ బుక్, ఎక్స్ (ట్విట్టర్) మొదలైన సోషల్ మీడియా వేదికల్ని కేంద్రం ఎప్పుడో తన గుప్పెట్లోకి తెచ్చుకుని నియంత్రిస్తోంది. ఇది సరిపోదన్నట్టు కొత్త చట్టం ద్వారా యూట్యూబ్ పై కూడా దృష్టి సారించింది. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ కూడా తలవంచడంతో సృజనాత్మక స్వేచ్ఛని పరిమితం చేసే క్రతువు సినిమాల పరంగా ఓటీటీలో పూర్తయినట్టే.

నెట్ ఫ్లిక్స్ నిర్ణయం దిగ్భ్రాంతికి గురి చేసిందనే చెప్పాలి. చాలా మంది నిర్మాతలు తమ సినిమాలకు హైప్ సృష్టించడానికి ఈ అన్ కట్ వెర్షన్‌లని ప్లాన్ చేస్తారు. అడల్ట్ కంటెంట్‌పై ఆధారపడే సినిమాల విషయంలో మళ్ళీ తిరిగి చూసే యువత (రిపీట్ ఆడియెన్స్) లో నిర్మాతలు పునాదిని విస్తరించుకునే సామర్థ్యం ఇప్పుడు దెబ్బతింటుంది. నెట్‌ఫ్లిక్స్ తెలుగు, తమిళం, హిందీ సినిమాలని విరివిగా కొనుగోలు చేస్తోంది. మధ్య తరగతి ప్రేక్షకుల్లో దాని ప్రజాదరణ పెరుగుతున్న నేపథ్యంలో, తప్పనిసరై సెన్సారైన సినిమాలని స్ట్రీమింగ్ చేయాలన్న నిర్ణయించుకుంది. కనుక ఇకపై రాబోయే సినిమాల్లో శృంగార దృశ్యాలు, ఘోరమైన హింస మొదలైన సినిమాల అన్‌కట్ వెర్షన్‌లు స్ట్రీమింగ్ కావు.

‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రిక ప్రకారం, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలు హిందువులని కించపర్చే విధంగా కంటెంట్ రూపొందించ కూడదని వొత్తిడిని ఎదుర్కొన్నాయి. హిందూ హక్కుల సంఘాల వొత్తిడితో, భారతదేశంలోని నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ఓటీటీలు రాజకీయ, సామాజిక అంశాలని స్పృశించే కంటెంట్ ని వదిలి వేశాయి. 'తాండవ్' (హిందీ) వెబ్ సిరీస్ విషయంలో ఎదుర్కొన్న దాడి ఫలితంగా అమెజాన్ ఎగ్జిక్యూటివ్ అజ్ఞాతంలోకి వెళ్ళాల్సి వచ్చింది. అరెస్టు ప్రమాదాన్ని కూడా ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో నెట్ ఫ్లిక్స్ తాజా నిర్ణయం స్ట్రీమింగ్ దిగ్గజాలు పాటించే స్వయం సెన్సార్ షిప్ ని ఎంత సీరియస్ గా తీసుకుంటున్నాయో తెలియజేస్తోంది.

మరి సాలార్, యానిమల్ ల సంగతి?

ఇక రెండు పెద్ద సినిమాలు స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్నాయి. ఇవి సాలార్, యానిమల్. 'యానిమల్' చుట్టూ వున్న సందడి నెట్‌ఫ్లిక్స్‌పై కేంద్రీకృతమై వుంది. దీని సెన్సార్ చేయని వెర్షన్‌ ని ప్రసారం చేయడానికి నిర్ణయించినట్టు వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఇది నిజం కాదని, నెట్ ఫ్లిక్స్ ఆ విధంగా అనుమతించే ప్రశ్నే లేదని మరికొన్ని వార్తలు వెలువడుతున్నాయి. దీని థియేట్రికల్ విడుదల, సెన్సార్ చేయని వెర్షన్ ల మధ్య వ్యత్యాసం సమస్య తెచ్చి పెడుతోంది. థియేట్రికల్ వెర్షన్, 3 గంటల, 23 నిమిషాల 21 సెకన్ల పాటు వుంటే,సెన్సార్ చేయని వెర్షన్ 3 గంటల 51 నిమిషాల వ్యవధితో వుంది. ప్రేక్షకులు ఈ సుదీర్ఘమైన, అన్‌కట్ ఎడిషన్ కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ నుంచి ఎదురు దెబ్బ తగిలితే ఆ ప్రభావం వ్యూస్ పై పడే అవకాశం వుంది.

నెట్ ఫ్లిక్స్ లో ఇకపై సెన్సారైన కట్స్ తో కలుపుకుని డైరెక్టర్స్ కట్ అనే వెర్షన్లు ప్రసారం కాకపోవడం దర్శకుల్ని కూడా నిరాశపరుస్తోంది. ‘యానిమల్’ఒకటే కాదు, ‘ఏ’ సర్టిఫికేట్ పొందిన ‘సాలార్’ కూడా హింస విషయంలో ఏ మాత్రం తీసిపోలేదు. సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఈ పెద్దలకు మాత్రమే సినిమాకి పిల్లలకు కూడా షరా మామూలుగా ద్వారాలు బార్లా తెరిచిపెడుతున్నా- హైదారాబాద్ లోని మల్టీప్లెక్సుల్లో పిల్లలతో వచ్చే పెద్దల్ని అనుమతించడం లేదు. దీంతో గొడవలు జరుగుతున్నాయి. అయితే ‘యానిమల్’ కి వర్తింపజేస్తున్న నిభంధనల్నే నెట్ ఫ్లిక్స్ ‘సాలార్’ కీ పాటించ వచ్చు.అంటే డైరెక్టర్స్ కట్ వుండక పోవచ్చు.

First Published:  27 Dec 2023 8:14 AM GMT
Next Story