Telugu Global
Cinema & Entertainment

ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్.. అధికారిక ప్రకటన

RRR సినిమా ఆస్కార్ బరిలో నిలిచింది. ఈ మేరకు యూనిట్ అధికారిక ప్రకటన చేసింది

ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్.. అధికారిక ప్రకటన
X

ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ బరిలో నిలిచిందా లేదా.. ఈ సినిమాను ఆస్కార్ ఎంట్రీకి పంపిస్తున్నారా లేదా.. కొంతమంది ఆస్కార్ బరిలో సినిమా ఉందని అంటున్నారు, మరికొందరు మాత్రం మౌనం వహిస్తున్నారు. ఇప్పుడీ డౌట్స్ పై పూర్తి క్లారిటీ వచ్చింది. స్వయంగా ఆర్ఆర్ఆర్ యూనిట్ ఈ విషయంపై స్పందించింది.


"ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులను ఏకం చేస్తూ, ప్రపంచ వేదికపై భారతీయ సినిమాకు ప్రాతినిధ్యం వహిస్తూ, ఆర్ఆర్ఆర్ సినిమా అఖండ విజయం సాధించినందుకు మేం గర్విస్తున్నాం. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడంతో పాటు, భాషా-సాంస్కృతిక అడ్డంకుల్ని కూడా అధిగమించింది. గత కొన్ని నెలలుగా మా సినిమాను ఇష్టపడి, మమ్మల్ని ఉత్సాహపరిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మేము జనరల్ కేటగిరీలో ఆస్కార్‌ అవార్డుల పరిశీలన కోసం ఆర్ఆర్ఆర్ ను అకాడమీకి పంపించాం."


ఇలా ఆర్ఆర్ఆర్ సినిమాను ఆస్కార్ కోసం పంపించిన విషయాన్ని యూనిట్ నిర్థారించింది. మొత్తం 15 విభాగాల్లో ఈ సినిమాను జనరల్ కేటగిరీలో పోటీకి నిలిపారు. వీటిలో బెస్ట్ మోషన్ పిక్చర్ విభాగంతో పాటు.. బెస్ట్ యాక్టర్, బెస్ట్ డైరక్టర్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగాలున్నాయి.


ఆర్ఆర్ఆర్ సినిమాకు ఇండియా నుంచి అధికారిక ఎంట్రీ దక్కని సంగతి తెలిసిందే. ఈ సినిమాను కాదని, గుజరాత్ కు చెందిన ఛెల్లా షోను ఆస్కార్ కు ఎంపిక చేసింది ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఛెల్లా షోకు పోటీనిస్తూనే, అంతర్జాతీయ స్థాయిలో ఇతర చిత్రాలకు పోటీగా.. ఆస్కార్ బరిలో నిలిచింది ఆర్ఆర్ఆర్.

First Published:  6 Oct 2022 11:38 AM GMT
Next Story