Telugu Global
Cinema & Entertainment

టాలీవుడ్ పెద్దలపై ఆర్జీవీ వివాదాస్పద వ్యాఖ్యలు

కృష్ణంరాజు మృతికి సంతాప సూచకంగా టాలీవుడ్ లో 2 రోజుల పాటు షూటింగ్స్ ఆపేయాలని డిమాండ్ చేశారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈ సందర్భంగా ఆయన తన ట్విట్టర్ పేజీలో కొన్ని వ్యాఖ్యలు చేశారు.

టాలీవుడ్ పెద్దలపై ఆర్జీవీ వివాదాస్పద వ్యాఖ్యలు
X

ప్రముఖ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి పట్ల టాలీవుడ్ తన ప్రగాఢ సంతాపం తెలియజేసింది. చిరంజీవి, మోహన్ బాబు, మహేష్ బాబు, ఎన్టీఆర్ లాంటి ఎంతోమంది ప్రముఖులు కృష్ణంరాజుకు నివాళులు అర్పించారు. ప్రభాస్ కు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

"భక్త కన్నప్ప, కటకటాల రుద్రయ్య, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు లాంటి అత్యంత గొప్ప చిత్రాలని అందించిన మహా నటుడు, గొప్ప నిర్మాత కోసం ఒక్క రోజు కూడా షూటింగ్ ఆపలేని అత్యంత స్వార్ధపూరిత తెలుగు సినిమా పరిశ్రమకి నా జోహార్లు. సిగ్గు! సిగ్గు!" అంటూ ట్వీట్ చేశాడు వర్మ.

మరణం అనేది ఎవరికైనా తప్పదని, రేపు ఇదే దుస్థితి టాలీవుడ్ ప్రముఖులకు కూడా వస్తుందని, ఓ మహోన్నత కళాకారుడికి మహోన్నత వీడ్కోలు ఇవ్వకపోవడమంటే, మనమీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిదని కామెంట్ చేశాడు వర్మ.

మనసు లేకపోయినా ఫర్వాలేదు కానీ, మన చావుకు విలువ ఉండాలంటే.. కృష్ణంరాజు లాంటి పెద్దలకు విలువ ఇవ్వాలని సూచించాడు రామ్ గోపాల్ వర్మ. కృష్ణంరాజు మృతికి సంతాప సూచకంగా కనీసం 2 రోజులు షూటింగ్స్ ఆపేయాలని విజ్ఞప్తి చేశారు. డబ్బు ఎక్కువ ఖర్చు అయిపోతోందని నెల రోజులు షూటింగ్ ఆపేసిన పరిశ్రమ మనదని ఎద్దేవా చేశారు.

టాలీవుడ్ లో షూటింగ్స్ ఆపాలని విజ్ఞప్తి చేస్తూ మహేష్, పవన్, ఎన్టీఆర్, చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, మోహన్ బాబు, రాజమౌళిని ట్యాగ్ చేశాడు వర్మ.

First Published:  12 Sep 2022 6:30 AM GMT
Next Story