Telugu Global
Cinema & Entertainment

‘జెఎన్‌యూ’ విడుదల వాయిదా, ‘ఎమర్జెన్సీ’ షూటింగ్ రద్దు!

ఏప్రిల్ 5 న థియేటర్లలోకి రావాల్సిన ‘జెఎన్‌యూ’ సినిమా విడుదల వాయిదా పడింది.

‘జెఎన్‌యూ’ విడుదల వాయిదా, ‘ఎమర్జెన్సీ’ షూటింగ్ రద్దు!
X

ఏప్రిల్ 5 న థియేటర్లలోకి రావాల్సిన ‘జెఎన్‌యూ’ సినిమా విడుదల వాయిదా పడింది. వినయ్ శర్మ దర్శకత్వం వహించి, ప్రతిమా దత్తా నిర్మించిన ఈ రైట్ వింగ్ ప్రచార సినిమాలో సిద్ధార్థ్ బోడ్కే, ఊర్వశీ రౌటేలా, పీయూష్ మిశ్రా, రవి కిషన్, విజయ్ రాజ్, రష్మీ దేశాయ్ తదితరులు నటించారు. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ లో లెఫ్ట్ వింగ్ - రైట్ వింగ్ విద్యార్థి రాజకీయాలపై జెఎన్‌యూ పేరుని ‘జహంగీర్ నేషనల్ యూనివర్సిటీ’ గా దానవీకరణ చేస్తూ నిర్మించిన ఈ రైట్ వింగ్ ప్రచార సినిమా విడుదల వాయిదా పడడం ఆశ్చర్యపర్చడం లేదు. ఎన్నికల్లో పోలరైజ్ చేయడానికే అన్ని ఏర్పాట్లూ చేసుకుని ఏప్రిల్ 5న విడుదలవుతుందని ఖచ్చితంగా ప్రకటించారు. అయితే అప్పటికే ఈ సినిమాని విడుదల చేసేందుకు పంపిణీ దారులెవరూ ముందుకు రాలేదు. దీంతో విడుదల ఆగింది. దీనికి ఆకస్మికంగా తలెత్తిన సాంకేతిక కారణాలతో విడుదల వాయిదా వేశామని ప్రకటించారు. సాంకేతిక కారాణాలే నిజమైతే కొత్త తేదీని సస్పెన్సులో వుంచనవసరం లేదు.

మార్చి చివరి వారంలో జెఎన్‌యూ విద్యార్థి సంఘం ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో లెఫ్ట్ వింగ్ విద్యార్ధులు ఘన విజయం సాధించారు. ఈ పరిణామం ముందు ‘జెఎన్‌యూ’ సినిమా విడుదలైతే అది వెలవెలబోతూ వుంటుందనేది నిజం. సినిమాలో దేశాన్ని ముక్కలు చేస్తున్నారన్న ఆరోపణలతో లెఫ్ట్ వింగ్ విద్యార్ధుల్ని రైట్ వింగ్ విద్యార్దులు చితకదన్నే కథ వుంది. మరి మార్చిలో జరిగిన ఎన్నికల్లో చూస్తే చిత్తుగా ఓడిపోయారు. ఈ ఇబ్బందికర సన్నివేశంలో సినిమా విడుదల ఆగినట్టుందని కూడా భావించ వచ్చు.

2016 లో అఫ్జల్ గురు ఉరిశిక్షకి నిరసనగా యూనివర్సిటీలో లెఫ్ట్ విద్యార్ధులు ‘భారత్ తుమ్హారే తుక్డే హోంగే’ (భారతదేశమా నువ్వు ముక్కలవుతావ్) వంటి నినాదాలు చేస్తే, రైట్ విద్యార్థులు ‘భారతీయ కోర్టులూ జిందాబాద్’ అని ప్రతినినాదాలు చేస్తున్న వీడియో ఈ కేసుకాధారం. అయితే లెఫ్ట్ విద్యార్థుల నినాదాల్ని మార్ఫింగ్ చేసిన ఫేక్ వీడియో అనీ ఖండనలు వెలువడ్డాయి. ఈ దేశ ద్రోహం కేసులో ఇంత వరకూ చార్జి షీట్ దాఖలు కాలేదు. సినిమాని మాత్రం స్వకపోల కల్పితాలతో తీసి వుంటారని ఇట్టే వూహించ వచ్చు.

‘ఎమర్జెన్సీ’ షూటింగు ఆగింది

జెఎన్‌యూని దానవీకరణ చేసే కార్యాక్రమంలో ఇప్పుడు తాజాగా వెబ్ సిరీస్ కూడా దూకింది. 1975 లో ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ ఆధారంగా, సుధీర్ మిశ్రా (ఈ సుధీర్ మిశ్రా వేరు- బాలీవుడ్ లెఫ్ట్ ఓరియెంటెడ్ దర్శకుడు సుధీర్ మిశ్రా వేరు) దర్శకత్వంలో 'ఎమర్జెన్సీ పీరియడ్ ఇన్ ఇండియా' అనే వెబ్ సిరీస్ షూటింగు యూనివర్సిటీలో నిన్న ప్రారంభమైంది. ఈ షూటింగుని వర్సిటీ విద్యార్థి సంఘం అడ్డుకుంది. అయితే షూటింగుకి అనుమతి మంజూరు చేసినట్టు పరిపాలనా విభాగం తెలిపింది.

అయితే అడ్మినిస్ట్రేషన్ బ్లాక్‌లో వెబ్ సిరీస్‌ని ను చిత్రీకరించడాన్ని విద్యార్థి సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది విశ్వవిద్యాలయ స్థలాన్నివ్యాపారీకరణ చేయడమేనని విమర్శించింది. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్‌లో విద్యార్థులు నిరసనలు చేయకుండా నిరోధించినప్పుడు, అక్కడ వెబ్ సిరీస్ చిత్రీకరించడానికి ఎందుకు అనుమతి ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేసింది.

ఈ షూటింగు ఏర్పాట్లు చేస్తూ దాదాపు 500 మంది ప్రొడక్షన్ సిబ్బంది గత రెండు రోజులుగా క్యాంపస్‌లో వున్నారు. ఈ షూటింగుని చట్టవిరుద్ధంగా అడ్డుకున్నారని, దర్శకుడ్ని బలవంతంగా బయటకి పంపడానికి కూడా ప్రయత్నించారని యూనివర్సిటీ అధికారి తెలిపారు.

‘మేము అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ దగ్గర ఒక సన్నివేశాన్ని చిత్రీకరిస్తూంటే పెద్ద సంఖ్యలో విద్యార్థులు గుమిగూడి అంతరాయం కలిగించడం ప్రారంభించారు. దర్శకుడు సుధీర్ మిశ్రాని కూడా నెట్టేసి, మా టీమ్‌పై అనుచిత పదజాలం విసిరారు. బలవంతంగా షూటింగ్‌ని ఆపేశారు’ అని వెబ్ సిరీస్ ప్రొడక్షన్ మేనేజర్ తెలిపాడు. దర్శకుడు విద్యార్థులతో సంభాషణలు నిర్వహించి, వెబ్ సిరీస్ వర్సిటీకి వ్యతిరేకం కాదని ఒప్పించటానికి ప్రయత్నించినా, విద్యార్థులు షూటింగుకి అంతరాయం కలిగిస్తూనే వున్నారని చెప్పాడు.

కొత్తగా ఎన్నికైన యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు ధనంజయ్ ఈ వాదనను ఖండించాడు. ‘మేము వెబ్ సిరీస్ కి లేదా దాని షూటింగు బృందానికి వ్యతిరేకం కాదు. కానీ క్యాంపస్‌లో ఎలాంటి వ్యాపారీకరణ జరగడానికి మేము అనుమతించం. షూటింగుని అనుమతించినందుకు ఎంత డబ్బు తీసుకున్నారో తెలపాలి’ అని డిమాండ్ చేశాడు.

ఈ వివాదం ఎలా పరిష్కారమవుతుందో వేచి చూడాలి. అసలే ‘జెఎన్‌యూ’ ప్రచార సినిమాతో దానవీకరణ పతాక స్థాయికి చేరుకుంటే, ఇప్పుడు వెబ్ సిరీస్ తో ఈ పోటీలో రికార్డులు నెలకొల్పాలని ఏకంగా రియల్ లొకేషన్ యూనివర్సిటీలోనే 500 మందితో కళా సేవకి దిగారు. గోదీ మీడియాలోని డిజైనర్ జర్నలిస్టులు ఎందుకో మౌనంగా వున్నారు. జెఎన్‌యూ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న మధ్యాహ్నం నుంచే తట్టా బుట్టా సర్దేశారు.

First Published:  8 April 2024 6:09 AM GMT
Next Story