Telugu Global
Cinema & Entertainment

Raviteja - బౌలర్ బయోపిక్ లో రవితేజ?

Raviteja - కెరీర్ లో తొలిసారి టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ చేస్తున్నాడు రవితేజ. మరోసారి అవకాశం వస్తే, బౌలర్ సిరాజ్ బయోపిక్ లో నటిస్తానంటున్నాడు.

Raviteja - బౌలర్ బయోపిక్ లో రవితేజ?
X

భారత్ లో క్రికెట్ వరల్డ్ కప్ ఊపందుకుంది. పైగా ఆస్ట్రేలియా లాంటి జట్టు బరిలోకి దిగడంతో, క్రికెట్ అభిమానులంతా ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఇప్పుడీ ఫీవర్ ను క్యాష్ చేసుకునే పనిలో పడింది టాలీవుడ్. తమ సినిమాల ప్రచారం కోసం క్రికెట్ ను కూడా వాడుకుంటోంది. ఇందులో మొదటి వ్యక్తి రవితేజ.

టైగర్ నాగేశ్వరరావు సినిమా ప్రచారం కోసం క్రికెట్ కామెంటరీ బాక్సులో ప్రత్యక్షమయ్యాడు రవితేజ. ఓవైపు లైట్ గా కామెంటరీ చెబుతూనే, మరోవైపు తన సినిమా గురించి కూడా చెప్పుకున్నాడు. ప్రమోషన్స్ లో భాగంగా డిస్నీ+ హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్ తెలుగులో కనిపించాడు రవితేజ. సడెన్ గా రవితేజను కామెంటరీ బాక్సులో చూసిన ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అయ్యారు. మ్యాచ్ సందర్భంగా తెలుగు వ్యాఖ్యాతలతో సంభాషించిన మాస్ రాజా.. క్రికెట్‌తో తనకున్న అనుబంధం గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.

రవితేజ క్రికెట్ పట్ల తనకున్న అభిరుచి, ప్రేమను బయటపెట్టాడు. అంతేకాదు, స్పోర్ట్స్ డ్రామా, ప్రత్యేకంగా బయోపిక్‌పై తన ఆసక్తిని వెల్లడించాడు. ప్రస్తుతం ప్రపంచకప్‌లో ఆడుతున్న భారత జట్టు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ గురించి బయోపిక్ తీయడానికి ఆసక్తిగా ఉన్నట్లు రవితేజ పేర్కొన్నాడు. క్రికెటర్‌గా సిరాజ్ సాధించిన విజయాలు చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయన్నాడు. పైగా హైదరాబాద్ మూలాలున్న వ్యక్తి కావడంతో, సిరాజ్ బయోపిక్ పై తనకు ప్రత్యేకమైన ఆసక్తి ఉందని వెల్లడించాడు.

ఇప్పటివరకు రవితేజ బయోపిక్స్ లో నటించలేదు. కెరీర్ లో తొలిసారి టైగర్ నాగేశ్వరరావు అనే బయోపిక్ చేశాడు. స్టువర్టుపురం ప్రాంతానికి చెందిన గజదొంగ నాగేశ్వరరావు జీవితానికి సంబంధించిన విశేషాలతో తెరకెక్కిన సినిమా ఇది. ఇలా తొలిసారి బయోపిక్స్ లోకి అడుగుపెట్టిన రవితేజ, కుదిరితే సిరాజ్ బయోపిక్ లో కూడా నటిస్తానని తన మనసులో మాట బయటపెట్టాడు.

వంశీ దర్శకత్వంలో తెరకెక్కింది టైగర్ నాగేశ్వరరావు సినిమా. దసరా కానుకగా అక్టోబర్ 20న ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది. రవితేజ కెరీర్ లోనే పాన్ ఇండియా లెవెల్లో విడుదలవుతున్న తొలి సినిమా ఇది. ఈ సినిమా ట్రయిలర్ ను ముంబయిలో లాంఛ్ చేశారు. హిందీ వెర్షన్ ప్రమోషన్స్ కోసం రవితేజ మరోసారి ముంబయి వెళ్లాడు. త్వరలోనే అతడు సౌత్ లోని కీలక నగరాల్లో పర్యటించబోతున్నాడు. ఇలా తన తొలి పాన్ ఇండియా సినిమా కోసం బాగానే కష్టపడుతున్నాడు మాస్ రాజా.

First Published:  9 Oct 2023 1:45 AM GMT
Next Story