Telugu Global
Cinema & Entertainment

పాకిస్తానీ సినిమాల్లో నటిస్తా.. రణ్‌బీర్ కపూర్ కామెంట్స్ వైరల్

ఓ పాకిస్తానీ ఫిలిం మేకర్ అడిగిన ప్రశ్నకు జవాబుగా.. పాకిస్తానీ సినిమాల్లో నటించేందుకు తనకు ఎటువంటి అభ్యంతరం లేదని రణ్‌బీర్ కపూర్ వ్యాఖ్యానించారు.

పాకిస్తానీ సినిమాల్లో నటిస్తా.. రణ్‌బీర్ కపూర్ కామెంట్స్ వైరల్
X

కళలకు ఎటువంటి హద్దులు లేవు.. పాకిస్తానీ సినిమాలో నటించేందుకు నాకు ఎటువంటి అభ్యంతరం లేదంటూ .. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ కామెంట్స్ చేశారు. కొన్నేళ్ల క్రితం భారత, పాకిస్తానీ నటులు ఒకరి పరిశ్రమలో మరొకరు నటించకుండా నిషేధం విధించుకున్న సంగతి తెలిసిందే. ఈ నిషేధం ఉన్న నేపథ్యంలో రణ్‌బీర్ కపూర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తాజాగా జెడ్డాలో రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ అగ్ర హీరో రణ్‌బీర్ కపూర్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన కార్యక్రమానికి వచ్చిన ప్రేక్షకుల మధ్య జర్నలిస్టులు అడిగిన పలు విషయాల గురించి మాట్లాడాడు. ఈ సందర్భంగా రణ్‌బీర్ ఓ పాకిస్తానీ ఫిలిం మేకర్ అడిగిన ప్రశ్నకు జవాబుగా.. పాకిస్తానీ సినిమాల్లో నటించేందుకు తనకు ఎటువంటి అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు. `భారత్‌లో పాకిస్తాన్ నటులు, పాకిస్తాన్‌లో భారతీయ నటులు కలసి నటించడానికి అవకాశం లేకపోయినా సౌదీ అరేబియా వంటి సినీ పరిశ్రమ అందుబాటులో ఉంది. నేను మీతో కలిసి ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాను. సౌదీ అరేబియాలో మీ టెక్నీషియన్స్ తో పాటు మా టెక్నీషియన్స్ తో కలిసి పని చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?` అని ఆ ఫిల్మ్ మేకర్ రణ్‌బీర్ కపూర్‌ను ప్రశ్నించాడు.

దీనికి స్పందించిన రణ్‌బీర్ మాట్లాడుతూ.. ఇలాంటి అవకాశం వస్తే కచ్చితంగా సిద్ధంగా ఉంటానన్నారు. కళలకు ఎటువంటి హద్దులు ఉండవని నేను నమ్ముతానన్నారు. కొన్నేళ్ల కిందట మౌలాజాట్ వంటి అద్భుత మూవీ పాకిస్తానీ సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిందని అందుకు అభినందనలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఇందుకుగాను మీతో కలసి పని చేయడానికి తాను ఇష్టపడతానన్నారు.

కాగా రణ్‌బీర్ కపూర్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి. కొన్నేళ్లుగా భారత్-పాకిస్తాన్ మధ్య సత్సంబంధాలు లేవు. భారత్, పాకిస్తాన్ క్రికెట్ జట్లు కలసి ఆడటం లేదు. ద్వైపాక్షిక సీరిస్‌లు జరిగి ఎన్నో ఏళ్లవుతోంది. ఈ విషయమై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ బీసీసీఐ పాకిస్తాన్‌కు వెళ్లి ఆడేది లేదని, అలాగే పాకిస్తాన్ జట్టు ఇండియాకు వచ్చి ఆడే అవకాశం ఇవ్వమని ఖరాకండిగా చెబుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తానీ సినిమాలో నటించేందుకు తనకు అభ్యంతరం లేదని రణ్‌బీర్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.

First Published:  13 Dec 2022 12:41 PM GMT
Next Story