Telugu Global
Cinema & Entertainment

తొలిసారి ఎమోషనల్ అయి తీశాడట

రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం అమ్మాయి. ఈ సినిమాను చాలా ఎమోషనల్ గా ఫీల్ అయి తీశాడంట ఆర్జీవీ.

తొలిసారి ఎమోషనల్ అయి తీశాడట
X

రిజల్ట్ తో సంబంధం లేకుండా సినిమాలు తీస్తుంటాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. పాయింట్ నచ్చితే చాలు, సెట్స్ పైకి వెళ్లిపోతాడు. అంతకుమించి సినిమాతో పెద్దగా ఎటాచ్ మెంట్ పెట్టుకోడు. అయితే అమ్మాయి అనే సినిమాను మాత్రం ఎమోషనల్ అయి తీశానని ప్రకటించుకున్నాడు వర్మ.

"ఇది నేను ఎమోషనల్ అయ్యి తీసిన సినిమా. ఎందుకంటే నా లైఫ్ లైన్ లో వెనక్కి తిరిగి చూసుకుంటే కొన్ని సంఘటనలు జరిగినప్పుడు వ్యక్తులు గుర్తుండిపోతారు. అలాంటి వారే బ్రూస్లీ. నాకు బ్రూస్లీ అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టమంటే నా చిన్నప్పుడు నేను నారాయణ గుడాలోని శ్రీనివాస్ థియేటర్ కు పంజాగుట్ట నుండి సైకిల్ పై 27 సార్లు వెళ్లి "ఎంటర్ ద డ్రాగన్ " సినిమా చూడడం జరిగింది. అలాగే నాకు బ్రూస్ లీ యాటిట్యూడ్, తన ఫిలాసఫీ నా మీద చాలా ఇంపాక్ట్ చూపించాయి. అలా బ్రూస్ లీ ఇన్ స్పిరేషన్ తో అమ్మాయి సినిమాను తీయడంతో ఎమోషనల్ అయ్యాను."

బ్రూస్ లీకి నివాళిగా అతడిపై ఈ సినిమా తీశానంటున్న వర్మ.. బ్రూస్లీ జన్మించిన చైనా గడ్డపై అమ్మాయి సినిమా షూటింగ్ చేయడం తన జీవితంలో ఓ మధురజ్ఞాపకం అంటున్నాడు. మార్షల్ ఆర్ట్స్ కాన్సెప్ట్ ను అమ్మాయితో తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతోనే ఈ సినిమా పుట్టిందని చెప్పుకొచ్చాడు.

"ఇండియా లో మార్షల్ ఆర్ట్స్ లేదు. కానీ జాకీ చాన్, జెట్లీ, టోనీజా సినిమాలు వచ్చినప్పుడు చాలా ఎగ్జయిట్ గా ఫీల్ అయ్యేవాన్ని. మార్షల్ ఆర్ట్స్ లో బ్రూస్లీ తనకంటే డబల్ సైజ్ ఉన్న పదిమందిని కొట్ట గలుగుతాడు అని తన సినిమాలతో ప్రేక్షకులను బిలీవ్ చేయించాడు "ఎంటర్ ద డ్రాగన్" సినిమాతో. అయితే నేను ఆ థాట్ ను ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లి అమ్మాయితో మార్షల్ ఆర్ట్స్ తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచతో పూజా భలేకర్ ని సెలెక్ట్ చేసుకొని నేను ఇష్టపడే బ్రూస్లీ కంట్రీ అయిన చైనాలో "లడ్కీ(అమ్మాయి)" ని షూట్ చేయడం, నాకది గొప్ప ఆచీవ్మెంట్ గా భావిస్తాను."

తన లైఫ్ ను ప్రభావితం చేసిన సినిమాలు మూడు మాత్రమే అంటున్నాడు వర్మ. వాటిలో గాడ్ ఫాదర్ సినిమా స్ఫూర్తితో సర్కార్, సౌండ్ ఆఫ్ మ్యూజిక్ స్ఫూర్తితో రంగీలా, ఇప్పుడు ఎంటర్ ది డ్రాగన్ స్ఫూర్తితో అమ్మాయి సినిమా తీశానంటున్నాడు.


First Published:  15 July 2022 1:30 PM GMT
Next Story