Telugu Global
Cinema & Entertainment

Ramayan TV Serial | మరోసారి టీవీలో ‘రామాయణ్’ సీరియల్!

Ramayan TV Serial | ఓ 40 ఏళ్ళ నాటి ప్రసిద్ధ క్లాసిక్ టీవీ సీరియల్ ‘రామాయణ్’ తిరిగి ప్రేక్షకుల్ని భక్తి సాగరంలో ముంచెత్తడానికి విచ్చేస్తోంది...’ఆదిపురుష్’ తో భక్తి లేక, రక్తి కూడా లేక, శుష్క ప్రదర్శనతో అసంతృప్తి పాలైన ప్రజానీకానికి అసలు సిసలు రామాయణంతో తనివిదీర్చే బృహత్ కార్యక్రమం జులై 3 నుంచి తిరిగి ప్రారంభం కాబోతోంది.

Ramayan TV Serial | మరోసారి టీవీలో ‘రామాయణ్’ సీరియల్!
X

Ramayan TV Serial | మరోసారి టీవీలో ‘రామాయణ్’ సీరియల్!

Ramayan TV Serial | ఓ 40 ఏళ్ళ నాటి ప్రసిద్ధ క్లాసిక్ టీవీ సీరియల్ ‘రామాయణ్’ తిరిగి ప్రేక్షకుల్ని భక్తి సాగరంలో ముంచెత్తడానికి విచ్చేస్తోంది...’ఆదిపురుష్’ తో భక్తి లేక, రక్తి కూడా లేక, శుష్క ప్రదర్శనతో అసంతృప్తి పాలైన ప్రజానీకానికి అసలు సిసలు రామాయణంతో తనివిదీర్చే బృహత్ కార్యక్రమం జులై 3 నుంచి తిరిగి ప్రారంభం కాబోతోంది. ‘ఆదిపురుష్’ విడుదలైన నాటినుంచీ ‘రామాయణ్’ సీరియల్ కూడా వార్తల్లో వుంటోంది. ‘ఆదిపురుష్’ ని ‘రామాయణ్’ తో పోల్చి విమర్శించని వ్యక్తులంటూ ఎవరూ లేరు. మరొకటేమిటంటే, 2020 లాక్ డౌన్ సమయంలో దూరదర్శన్ ‘రామాయణ్’ ని పునః ప్రసారం చేసి పుణ్యం కట్టుకున్న జ్ఞాపకాలు ఇంకా తాజాగా వున్నాయి. ఈ తాజా స్మృతులే ‘ఆదిపురుష్’ ని మరింత ఆత్మ రక్షణలోకి నెట్టేశాయి. చిట్టచివరికి ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని దృష్టిలో పెట్టుకుని షెమారూ టీవీ ‘రామాయణ్’ సీరియల్ ని తిరిగి ప్రసారం చేయడానికి పూనుకుంది. ఈ రోజు ఇంస్టా గ్రామ్ లో ఈ విశేషాన్ని షేర్ చేసింది.

2020 లాక్ డౌన్ సమయంలో ‘రామాయణ్’ ప్రసారమవుతున్నప్పుడు, కపిల్ శర్మ కామెడీ షోలో ‘రామాయణ్’ నటీనటులతో, దర్శకుడు రామానంద్ సాగర్ కుమారుడు ప్రేమ్ సాగర్ తో జరిగిన కార్యక్రమంలో - ప్రేమ్ సాగర్ రామాయణ్ సీరియల్ పుట్టుక గురించి చెప్పారు- 1975 లో ధర్మేంద్ర- హేమామాలినీలతో ‘చరస్’ సినిమా షూటింగ్ స్విట్జర్లాండ్ లోజరుగుతున్నప్పుడు, టీం లో వున్న విదేశీ టెక్నీషియన్ ఒక బాక్సు తీసుకొచ్చి మీట నొక్కితే అందులో సినిమా ప్లే అవసాగింది. రామానంద్ సాగర్ చాలా ఆశ్చర్యపోయి- ఇక నేను సినిమాలు తీయను, భవిష్యత్తు టీవీదే, టీవీ షోలు తీస్తాను- అని కుమారుడితో చెప్పేశారు.

అలా కొన్నేళ్ళు కష్టపడి ‘విక్రమ్ ఔర్ బేతాళ్’ జానపద హిట్ టీవీ సీరియల్ సృష్టించారు. ఆ తర్వాత మరింత కృషి చేసి 1987 లో ‘రామాయణ్’ సీరియల్ ని అద్భుతంగా అందించారు. షెమరూ ఎంటర్టయిన్మెంట్ లిమిటెడ్ కంటెంట్ సృష్టితో బాటు కంటెంట్ ని పంపిణీ చేసే కంపెనీ. 1962 లో గ్రంథాలయంగా ఇది ప్రారంభమైంది. 1979 లో వీడియో రెంటల్ వ్యాపారాన్ని ప్రారంభించి, 1987 లో సినిమా రంగంలోకి ప్రవేశించి వీడియో కేసెట్స్ పంపిణీ చేపట్టింది. ప్రస్తుతం ఈ బ్రాండ్ వివిధ భాషల్లో 3700 సినిమా టైటిల్స్ ని కలిగి వుండడంతో బాటు, అమెరికా, బ్రిటన్, సింగపూర్, గల్ఫ్ మొదలైన 30 కి పైగా దేశాల్లో వినియోగదారులకు సేవలందిస్తోంది.

ప్రపంచ రికార్డు సృష్టించింది...

రామానంద్ సాగర్ ప్రసిద్ధ హిందీ టీవీ షో ‘రామాయణ్’ లో రాముడిగా అరుణ్ గోవిల్, సీతగా దీపికా చిక్లియా, లక్ష్మణుడిగా సునీల్ లాహిరి, హనుమంతుడిగా దారాసింగ్, రావణుడిగా అరవింద్ త్రివేది నటించారు. సంగీతం ప్రసిద్ధ బాలీవుడ్ సంగీత దర్శకుడు రవీంద్ర జైన్ అందించారు. అజిత్ నాయక్ ఛాయాగ్రహణం నిర్వహించారు. దూరదర్శన్ లో ఈ సీరియల్ 1987 జనవరి 25 నుంచి 1988 జులై 31 వరకూ ప్రసారమైంది.

అప్పట్లో ప్రపంచంలో అత్యధికంగా వీక్షించిన టీవీ సీరియల్ గా రికార్డు నెలకొల్పింది. ప్రపంచ వీక్షకుల్లో 82 శాతం దీనికే వున్నారు. రిపీట్ టెలికాస్ట్ మొత్తం ఐదు ఖండాల్లోని 17 దేశాల్లో 20 వేర్వేరు ఛానెళ్ళలో వేర్వేరు సమయాల్లో ప్రసారం చేషారు. ఈ సీరియల్ విజయాన్ని అప్పటి మీడియా నమోదు కూడా చేసింది. బీబీసీ ప్రకారం, ఈ సీరియల్‌ ని 650 మిలియన్లకి పైగా ఫ్రేక్షకులు వీక్షించారు. రామ లక్ష్మణ సీత పాత్రధారులకి వచ్చే ఫ్యాన్ మెయిల్లో 20 నుంచి 30 శాతం పాకిస్తాన్ నుంచే వచ్చేది. ప్రతి ఎపిసోడ్ దూరదర్శన్ కి రూ. 40 లక్షలు సంపాదించి పెట్టింది.

‘రామాయణ్’ సీరియల్ ప్రధానంగా వాల్మీకి రామాయణంతో బాటు, తులసీదాస్ రాంచరిత్ మానస్ ఆధారంగా రూపొందించారు. ఇంకా తమిళ కంబ రామాయణం, మరాఠీ భావరత్ రామాయణం, బెంగాలీ కృతివాస్ రామాయణం, తెలుగు శ్రీరంగ నాథ రామాయణం, కన్నడ రామచంద్ర చరిత్ రామాయణం, మలయాళం ఆథ్యాత్మ రామాయణం, బ్రిజ్ నారాయణ్ చక్బస్త్ రచించిన ఉర్దూ రామాయణం మొదలైనవి రిఫరెన్సులుగా తోడ్పడ్డాయి. ప్రతి ఎపిసోడ్‌ కి 9 లక్షల బడ్జెట్‌తో ఆ సమయంలో నిర్మించిన అత్యంత ఖరీదైన టీవీ షో గా ‘రామాయణ్’ నిల్చింది.

ప్రతి ఆదివారం ఉదయం ఈ సీరియల్ ప్రసారమైనప్పుడు వీధులు నిర్మానుష్యంగా వుండేవి. దుకాణాలు మూసి వుండేవి. సీరియల్ ప్రారంభమయ్యే ముందు ప్రజలు స్నానం చేసి, టీవీలకి పూలమాలలు వేసేవాళ్ళు. ఇలాటి ప్రజల భక్తిని గౌరవించకుండా ‘ఆదిపురుష్’ మేకర్లు అభాసు చేశారు.

ఈ సీరియల్ 2020 కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో తిరిగి ప్రసారం చేసినప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా రికార్డులు బద్దలుకొట్టింది, 77 మిలియన్ల మంది వీక్షకులతో ప్రపంచంలో అత్యధికంగా వీక్షించిన టీవీ షోగా రికార్డు సృష్టించింది. ఈ షోని తెలుగు తమిళ కన్నడ మలయాళ మరాఠీ బెంగాలీ భాషల్లో డబ్ ఛేశారు. వరుసగా స్టార్ సువర్ణా, స్టార్ ప్రవా, స్టార్ జల్సా, స్టార్ మా, స్టార్ విజయ్ ఛానెళ్ళలో కూడా ప్రసారమైంది.

షెమరూ టీవీ ‘రామాయణ్’ నుంచి క్లిప్‌ ని షేర్ చేస్తూ, ప్రపంచ ప్రసిద్ధ పౌరాణిక సీరియల్ ‘రామాయణ్’ అభిమానులందరి కోసమూ తిరిగి వచ్చింది... జూలై 3, రాత్రి 7.30 గంటల నుంచి తప్పకి వీక్షించండి... అంటూ విజ్ఞప్తి చేసింది.



First Published:  28 Jun 2023 12:31 PM GMT
Next Story