Telugu Global
MOVIE REVIEWS

రామారావు ఆన్ డ్యూటీ మూవీ రివ్యూ

రవితేజ హీరోగా నటించిన సినిమా రామారావు ఆన్ డ్యూటీ. ఈరోజు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

రామారావు ఆన్ డ్యూటీ మూవీ రివ్యూ
X

చిత్రం: రామారావు ఆన్‌ డ్యూటీ

నటీనటులు: రవితేజ, దివ్యాంశా కౌశిక్, రాజీష విజయన్, వేణు, నాసర్, నరేష్, పవిత్ర లోకేష్, రాహుల్‌ రామకృష్ణ, తదితరులు..

కెమెరా: సత్యన్‌ సూర్యన్‌ ఐఎస్‌సీ

మ్యూజిక్‌: సామ్‌ సీఎస్‌

నిర్మాణం: ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ, ఆర్‌టీ టీమ్‌వర్క్స్‌

నిర్మాత: సుధాకర్‌ చెరుకూరి

రచన -దర్శకత్వం: శరత్‌ మండవ

నిడివి: 150 నిమిషాలు

రేటింగ్: 2/5

"ఒరేయ్ బాబులూ.. ప్రేక్షకుడి అభిరుచి మారిపోయింది.. రొట్ట సినిమాలు ఆపండ్రా బాబూ.." అని గొంతెత్తి అరవాలనిపించింది. ఇంకా సినిమా ఉందని తెలిసిన తర్వాత ఎవరైనా నిద్రమాత్ర ఇవ్వండిరా బాబూ అని వేడుకోవాలనిపించింది. రామారావు ఆన్ డ్యూటీ సినిమా చూస్తున్నంతసేపు కలిగిన రెండు ఫీలింగ్స్ ఇవి. అదేంటో, ఆది నుంచి ఈ సినిమా ప్రచారం డల్ గానే సాగింది. ఇందులో హీరో కూడా డల్ గానే కనిపించాడు. చివరికి రిజల్ట్ కూడా అంతే డల్ గా ముగిసింది.

కథ గురించి మూడు ముక్కల్లో చెప్పుకుందాం. ఒక ప్రభుత్వ ఉద్యోగి తనకు ఏ మాత్రం సంబంధం లేకపోయినా తన మాజీ ప్రేయసి కోసం ఆమె భర్త మిస్సింగ్ కేసుపై ప్రత్యేకంగా దృష్టిపెడతాడు. వ్యక్తిగత స్థాయిలో ఎంక్వయిరీ చేసి పోలీసులకు రిపోర్ట్ అందిస్తాడు. వారి నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో తనే రంగంలో దిగి కేసుని పర్సనల్ గా హ్యాండిల్ చేస్తాడు. క్లయిమాక్స్ లో మిస్టరీ ఛేదించి విలన్ కి చెక్ పెడతాడు. ఇదే 'రామారావు ఆన్ డ్యూటీ' కథ.

ఒక ప్రభుత్వ ఉద్యోగి అన్న ఎలిమెంట్ దగ్గరే ఈ సినిమా సగం ఫ్లాప్ అయింది. హీరో చేతులు కట్టేసినట్టయింది. అవును.. ఇదొక ఫక్తు పోలీస్ స్టోరీ. ఖాకీ చొక్కా హ్యాండిల్ చేయాల్సిన కహానీ ఇది. కానీ రెగ్యులర్ పోలీస్ అంటే ప్రేక్షకులు ఫీల్ అవుతారని దర్శకుడు ఫీల్ అయినట్టున్నాడు. లేకపోతే రవితేజ రిజెక్ట్ చేస్తాడని భయపడినట్టున్నాడు. అందుకే పోలీస్ పాత్రను పీకేసి, ఆ స్థానంలో ఎమ్మార్వో పాత్రను పెట్టాడు. ఇక్కడే సినిమా సగం చచ్చిపోయింది.

ఎమ్మార్వోకు పాటలు, ఫైట్లు పెట్టకూడదా? పోలీసులే ఫైట్లు చేయాలా, ఎమ్మార్వో చేయకూడదా? ఇలాంటి ఆత్మావలోకనాన్ని దర్శకుడు బాగానే చేసుకున్నట్టున్నాడు. అందుకే ఎమ్మార్వో గారికి పాటలు, ఫైటులు గట్రా పెట్టేశాడు. కానీ అదే ఆత్మావలోకనంలో ఎనర్జీ గురించి ఆలోచించినట్టులేడు దర్శకుడు. రవితేజ అంటేనే ఎనర్జీ. ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి కాస్త అఫీషియల్ గా ఉండాలనే ఉద్దేశంతో, రవితేజలోని ఎనర్జీని మూటగట్టి కారవాన్ లో పడేశాడు దర్శకుడు. అతడ్ని ఎంత డల్ గా చూపించాలో అంత డల్ గా చూపించాడు.

దీనికితోడు రవితేజ రాయలసీమ యాస ట్రై చేశాడు. ఎర్రచందనం నేపథ్యంలో సినిమాను ఎంచుకోవడం, హీరో పాత్ర చిత్తూరు జిల్లా పరిసరాల్లో తిరగడంతో.. తప్పనిసరి పరిస్థితుల మధ్య రవితేజతో సీమ యాస్ ట్రై చేశారు. అయితే రవితేజ ఎప్పలానే నేరుగా సెట్స్ పైకి వచ్చేసినట్టుంది. ఎలాంటి హోం వర్క్ చేసినట్టు కనిపించలేదు. దీంతో అతడి రాయలసీమ యాస కృతకంగా ఉంది. రామారావు ఆన్ డ్యూటీలో రవితేజ సీమ యాస చూసిన తర్వాత, పుష్పలో నటించిన అల్లు అర్జున్ పై గౌరవం పెరుగుతుంది.

ఇవన్నీ పక్కనపెడితే, ఇదొక సీరియస్ క్రైమ్ డ్రామా. ఈకాలం ఈ కథను అంతే సీరియస్ గా చెప్పాలి. ప్రేక్షకుడు అదే కోరుకుంటున్నాడు కూడా. కానీ దర్శకుడు శరత్ మండవ మాత్రం ఇంకా మారలేదు. పాత కాలం పద్ధతులో ఫాలో అయ్యాడు. 2 పాటలు పెట్టాడు, మాంఛి మసాలా సాంగ్ ఇరికించాడు. ఫైట్స్ గట్రా దట్టించాడు. ఇక్కడే రామారావు రిజల్ట్ రివర్స్ అయింది. చెప్పాల్సిన కథలో ఫ్లో మిస్ అయింది. స్క్రీన్ ప్లే తేలిపోయింది. పాటలు, ఫైట్లు లాంటి జోలికి పోకుండా.. ఓ 2 గంటల్లో సీరియస్ గా ఈ కథను చెబితే ఫలితం మరోలా ఉండేది. ఓ సెక్షన్ ఆడియన్స్ కైనా నచ్చేది.

ఇక పీరియాడిక్ మూవీ అని చెప్పడం కోసం అక్కడక్కడ పెట్టిన ముఠామేస్త్రి, పెళ్లిసందడి పాటలు వింటుంటే నవ్వొస్తుంది. ఓవైపు ఇలా 90ల బ్యాక్ డ్రాప్ లో సినిమా చెప్పిన దర్శకుడు, అదే సినిమాలో పాటల కోసం స్పెయిన్ వెళ్లడాన్ని ఏమనాలో దర్శకుడికే తెలియాలి. ఓ టైమ్ లో కథను చెబుతున్నప్పుడు, ఆ టైమ్ ను చూపించేందుకు అప్పటి పాటలు పెడితే సరిపోదు. దుస్తులు, ఆర్ట్ వర్క్, లొకేషన్స్ విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం అనే విషయం దర్శకుడు తెలుసుకోవాలి.

ఉన్నంతలో ఈ సినిమాను రవితేజ ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఎమ్మార్వో పాత్ర ఇచ్చి, క్యారెక్టర్ ను డల్ గా మార్చేసి, మాస్ రాజా చేతులు కూడా కట్టేశారు. రజీషా విజయన్, దివ్యాంశ కౌశిక్ పాత్రలకు ఎలాంటి న్యాయం జరగలేదు. పవిత్రా లోకేష్ నరేష్ కనిపించినప్పుడు మాత్రం థియేటర్లలో ఈలలు గోలలు వినిపించాయి. అయితే ఈ అల్లరికి సినిమాకు సంబంధం లేదు. అది వాళ్ల వ్యక్తిగత విషయానికి సంబంధించిన అంశం.

టెక్నికల్ గా కూడా సినిమా గొప్పగా అనిపించలేదు. దీనికి కారణం ఒకదానికొకటి సింక్ లేకపోవడమే. కెమెరా వర్క్ బాగున్నప్పటికీ ఎడిటింగ్ బాగాలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నప్పటికీ పాటలు బాగాలేవు. రవితేజ యాక్టింగ్ బాగున్నప్పటికీ ఎడిటింగ్ కుదరలేదు. ఇలా ఒకదానికొకటి పొంతన లేకపోవడంతో రామారావు అటకెక్కేశాడు. ఈ మొత్తం వ్యవహారంలో నిందించాల్సిన ఏకైక వ్యక్తి దర్శకుడు శరత్ మండవ. రవితేజ ఇచ్చిన మంచి అవకాశాన్ని ఈ దర్శకుడు సద్వినియోగం చేసుకోలేకపోయాడు.

ఓవరాల్ గా, ఓ మోస్తరు అంచనాలతో ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాను చూసినవాళ్లు వీలైనంత త్వరగా మరిచిపోయే ప్రయత్నం చేస్తారు. ఇంకా చూడని వాళ్లు అంత సాహసం చేసే ప్రయత్నం చేయరనిపిస్తోంది.

Next Story