Telugu Global
Cinema & Entertainment

Rangasthalam Movie in Japan: జపాన్ లో రికార్డులు బద్దలు కొడుతున్న రంగస్థలం!

Rangasthalam Movie in Japan: మైత్రీ మూవీస్ నిర్మించిన తెలుగు బ్లాక్ బస్టర్ ‘రంగస్థలం’ జపాన్ లో చరిత్ర సృష్టిస్తోంది.

Rangasthalam Movie in Japan: జపాన్ లో రికార్డులు బద్దలు కొడుతున్న రంగస్థలం!
X

Rangasthalam Movie in Japan: జపాన్ లో రికార్డులు బద్దలు కొడుతున్న రంగస్థలం!

Rangasthalam Movie in Japan: మైత్రీ మూవీస్ నిర్మించిన తెలుగు బ్లాక్ బస్టర్ ‘రంగస్థలం’ జపాన్ లో చరిత్ర సృష్టిస్తోంది. ఇంతాలస్యంగా జపాన్ లో విడుదలైనా, రికార్డులన్నీ తిరగరాస్తూ దూసుకుపోతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- సమంతాలు నటించిన ఈ విలేజి యాక్షన్ డ్రామా సుకుమార్ దర్శకత్వంలో 2018 లో విడుదలై రూ. 216 కోట్లకి పైగా వసూలు చేసిన విషయం తెలిసిందే. నాన్ బాహుబలి కేటగిరీలో ఒక ప్రత్యేకతని నిలబెట్టుకున్న ఈ మూవీ అప్పటికి ఒడిదుడుకులుగా వున్న రామ్ చరణ్ నట జీవితాన్ని ఒక్క పెట్టున తారా స్థాయికి చేర్చింది. అసలు ‘మగధీర’ సినిమాతోనే రామ్ చరణ్ కి జపాన్ లో మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది, సూపర్ స్టార్ రజనీ కాంత్ కిలాగా!

జపాన్‌లో రజనీ కాంత్ అభిమాన సంఘాలు కూడా ఉన్నాయి. జపాన్‌లో రజనీకాంత్ సినిమాల రికార్డుల్ని ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ బద్దలు కొట్టింది. ఆ తర్వాత వరుసగా కొన్ని తెలుగు సినిమాలు రికార్డులు బద్దలు కొడుతున్నాయి. అయితే తాజాగా ‘ఆర్ ఆర్ ఆర్’ జపాన్ లో రజనీ రికార్డులన్నీ చెరిపేసింది. దీంతో రామ్ చరణ్ ఫాలోయింగ్ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ఐదేళ్ళు పాతదైనా సరే, నిర్మాతలు బయటికి తీసి ‘రంగస్థలం’ ని జపాన్ లో గత శుక్రవారం (జులై 14) విడుదల చేశారు. విడుదల రోజే కలెక్షన్స్ లో రికార్డులు బద్దలు కొట్టింది. ఇంకో విశేషమేమిటంటే, దీంతో బాటు పానిండియా బ్లాక్ బస్టర్ ‘కేజీఎఫ్’ కూడా ఇదేరోజు విడుదలయ్యాయి. కానీ జపనీయులకి ఇంకా పరిచయం లేని ‘కేజీఎఫ్’ స్టార్ యశ్ సినిమాకంటే ‘రంగస్థలం’ కలెక్షన్స్ లో బీట్ చేసింది. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే పాతిక లక్షల యెన్ లు (ఒక జపాన్ యెన్ అరవై పైసలు) ఆర్జించింది.

తొలి రోజు 70 స్క్రీన్‌లలో 2.5 మిలియన్ యెన్‌ లు వసూలు చేసిందని ‘రంగస్థలం’ ని జపాన్లో పంపిణీ చేసిన స్పేస్ బాక్స్ పంపిణీ సంస్థ తెలిపింది. రాబోయే వారాల్లో మరిన్ని థియేటర్ లలో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు సంస్థ సీఈఓ అన్బరసి దురైపాండియన్ ప్రకటించారు. జపాన్ ప్రజల గుండెల్లో రామ్ చరణ్‌కి ప్రత్యేక స్థానం వుందని, సినిమాపై వచ్చిన రియాక్షన్ ఇది నిరూపిస్తోందనీ, ‘రంగస్థలం’ లాంటి సినిమాని జపాన్ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం తమకి చాలా గర్వకారణమనీ, ఈ మూవీ నిజంగా ఒక సినిమాటిక్ మాస్టర్ పీస్ అనీ కొనియాడారాయన.


స్పేస్ బాక్స్ తెలుగు, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషలకి చెందిన 250 కి పైగా సినిమాల్ని జపాన్ లో పంపిణీ చేసింది. మన దేశంలో జపాన్ సినిమాలకి ప్రేక్షకుల్లేరు. జపాన్‌లో మూవీ మార్కెట్ మాత్రం హాలీవుడ్, చైనీస్, కొరియన్ సినిమాలకే కాదు, ఇండియన్ సినిమాలకి కూడా ప్రధాన కేంద్రంగా వుంది. జపనీస్ ప్రేక్షకుల హృదయాల్లో పాగా వేయడం బాలీవుడ్ సినిమాలకి మాత్రమే కాదు, దక్షిణాది ప్రాంతీయ భారీ సినిమాలకి కూడా సాధ్యమైంది.

ఇతర సాంప్రదాయేతర మార్కెట్‌ల లాగానే కంటెంట్‌ ని మానిటైజేషన్ చేయడానికి కొత్త ద్వారాల్ని తెరిచింది జపాన్. దీంతో రజనీకాంత్ సినిమాలకి జపనీస్ ప్రధాన స్రవంతి ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఎంతగానంటే, రజనీ సినిమా విడుదలైతే జపాన్ ఫ్యాన్స్ ఏకంగా చెన్నై వచ్చేసి సినిమా చూసి సంబరాలు చేసుకునేంతగా!

జపాన్‌లో ఏ కంటెంట్ పనిచేస్తోందని పరిశీలిస్తే, ఒక రకమైన సందేశంతో మానవ, భావోద్వేగ కథనాలతో కూడిన డాన్సులు, ఫైట్లు వుండే వినోదాత్మక పలాయనవాద కంటెంట్ పట్ల క్రేజ్ పెంచుకున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ డాన్స్ మూవ్ మెంట్స్ ని నేర్చుకునేందుకు డ్యాన్స్ క్లాసులు తీసుకుంటున్న జపాన్ మహిళల గురించి కూడా వార్తలొచ్చాయి. ఈ విధంగా జపానే గాక అనేక ఇతర సాంప్రదాయేతర మార్కెట్లయిన తైవాన్, టర్కీ, రష్యా, జర్మనీ వంటి దేశాలు కూడా భారతీయ సినిమాలకి భాషలతో నిమిత్తం లేకుండా ద్వారాలు తెరుస్తున్నాయి.

‘ఆర్ ఆర్ ఆర్’ తో రామ్ చరణ్ తో బాటు ఎన్టీఆర్ కూడా పాపులర్ అవడంతో ఎన్టీఆర్ సినిమాలు కూడా జపాన్ చేరుకోవచ్చు. ఇక తమిళ హీరోలు సూర్య, కార్తీలతో పాటు బాలీవు హీరో షారుఖ్ ఖాన్ కి కూడా జపాన్ లో మంచి డిమాండ్ వుంది. షారుఖ్ ‘పఠాన్’ ని అక్కడ కూడా విడుదల చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా ఇండియన్ సినిమాలు జపాన్ బాక్సాఫీసుని కొల్లగొడుతున్న నేపథ్యంలో , రాను రాను మన హీరోలకి భారీ మార్కెట్ వచ్చే అవకాశం వుంది. డైరెక్ట్ రిలీజ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

First Published:  16 July 2023 6:56 AM GMT
Next Story