Telugu Global
Cinema & Entertainment

రూ. 699 చందా కడితే 10 సినిమాలు!

దేశంలోనే మొట్టమొదటి ఇన్-థియేటర్ మూవీ సబ్‌స్క్రిప్షన్ ఆఫర్ ని మల్టీప్లెక్స్ ఆపరేటర్ పీవీఆర్-ఐనాక్స్ ప్రకటించింది.

రూ. 699 చందా కడితే 10 సినిమాలు!
X

రూ. 699 చందా కడితే 10 సినిమాలు!

దేశంలోనే మొట్టమొదటి ఇన్-థియేటర్ మూవీ సబ్‌స్క్రిప్షన్ ఆఫర్ ని మల్టీప్లెక్స్ ఆపరేటర్ పీవీఆర్-ఐనాక్స్ ప్రకటించింది. నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌తో వయోజన వర్గాల్ని తిరిగి సినిమా హాళ్ళకి ఆకర్షించడంతో బాటు, ఓటీటీలు విసురుతున్న సవాళ్ళని ఎదుర్కొనే లక్ష్యంతో ఈ వ్యూహ రచన చేసింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్‌స్టార్ వంటి ఓవర్-ది-టాప్ (ఓటీటీ) ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాట్‌ఫారమ్‌లకు ఇది ప్రత్యక్ష సవాలు కాగలదని కంపెనీ భావిస్తోందని పీవీఆర్ - ఐనాక్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ బిజిలీ తెలిపారు.

అయితే ప్రస్తుతానికి ఈ ప్లాన్ ఉత్తరాది రాష్ట్రాలకే పరిమితం. ఇమాక్స్, ఇన్సిగ్నియా వంటి ప్రీమియం స్క్రీన్ ఫార్మాట్‌లకి ఈ ప్లాన్ వర్తించదు. ఈ ప్లానుకింద నెలకు రూ. 699 చెల్లించి 10 సినిమాలు చూడొచ్చు. వారాంతపు రోజులైన శని, ఆదివారాలు తప్ప మిగతా రోజులకి మాత్రమే ఈ ప్లాన్ వర్తిస్తుంది. మిగతా రోజుల్లో రోజుకి ఒక సినిమా మాత్రమే చూసే అవకాశ ముంటుంది. అంటే ఒక సినిమా 70 రూపాయలకే గిట్టుబాటు అవుతుందన్న మాట.

కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రేక్షక లోకంలో ప్రజాదరణ పొందిన ఓటీటీలకి వ్యతిరేకంగా రూ. 699 ప్లాన్ ధర నేరుగా కంపెనీకి లాభిస్తుంది. వివిధ కంపెనీల ఉద్యోగులకి ఫర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు ముగియడంతో, మహమ్మారి తర్వాత వారి సబ్ స్క్రిప్షన్లని కాపాడుకోవడానికి ఓటీటీలు చాలా కష్టపడుతున్నాయి. ఇది పీవీఆర్- ఐనాక్స్ కి కలిసివస్తున్న అంశం.

నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ టార్గెట్ ప్రేక్షకులుగా వయోజనులతో బాటు కొత్త తరాన్ని, గృహిణుల్నీ కూడా సినిమాల వైపు ఆకర్షించే లక్ష్యంతో అమల్లోకొస్తోంది. మహమ్మారి కారణంగా 31 ఏళ్ళు, అంతకంటే ఎక్కువ వయస్సు వున్న వీక్షకుల సంఖ్య తగ్గిపోయింది. మీడియా కన్సల్టింగ్ సంస్థ ఓర్మాక్స్ విశ్లేషణ ప్రకారం, సినిమా ప్రేక్షకుల మధ్యస్థ వయస్సు మహమ్మారికి ముందు 27.5 వుంటే, తర్వాత 24.1 కి పడిపోయింది. సినిమాలకొచ్చే 31-40 ఏళ్ళ వయసున్న వారి సంఖ్య 31 శాతం తగ్గగా, 41 ఏళ్ళు పైబడిన వారి సంఖ్య 39 శాతం తగ్గిందని నివేదిక పేర్కొంది. మహమ్మారి ప్రభావం నుంచి పీవీఆర్- ఐనాక్స్ ఇప్పటికీ కోలుకోలేదు. కొన్ని స్క్రీన్స్ పూర్తిగా మూతబడ్డాయి కూడా. మహమ్మారి ముందున్న స్థాయితో పోల్చితే ప్రేక్షకుల సంఖ్య 20 శాతం పడిపోయింది.

ఈ నేపథ్యంలో నెలవారీ సభ్యత్వం వాస్తవానికి ఎలా పని చేస్తుందో చూడాల్సి వుంది. ఓటీటీలు అనేక రకాల కంటెంట్ ని అందిస్తున్నందున నెలకు 10 సినిమాల ప్లాను వీక్షకుల్ని ఆకర్షించకపోవచ్చు. అంతేకాకుండా, నిర్దిష్ట భాషలో నెలకు 10 సినిమాలు చూడాలంటే అన్ని సినిమాలు విడుదలయ్యే పరిస్థితి వుండదు. చందాదారుల్ని తన వైపు తిప్పుకోవడానికి ఫెస్టివల్సు, రెట్రోస్పెక్టివ్‌ల రూపంలో విస్తృత వీక్షణా ప్రత్యామ్నాయాల్ని అందించాల్సి వుంటుందని విశ్లేషకులు అంటున్నారు. అయితే ఏదైనా సినిమా కోసం వారమంతా థియేటర్లు నిండేలా చూడడం ఎల్లప్పుడూ సవాలుగా వుంటుందని, కనుక ఈ ప్లాను సోమవారం నుంచి గురువారం వరకు ఫుట్‌ఫాల్స్ ని సమీకరించడానికి సహాయపడ గలదనీ, కంపెనీ ఎండీ అజయ్ బిజిలీ ఆశాభావంతో వున్నారు.

ప్లాను బుకింగ్ సమయంలో చందాదారులు ప్రభుత్వ ఐడీని సమర్పించాల్సి వుంటుంది. పోతే, సబ్‌స్క్రిప్షన్ ఆధారిత సినిమా టిక్కెట్ సర్వీసు అమెరికాలో మహమ్మారికి ముందే కాదు, ఓటీటీల రాకకి పూర్వం 2018 నుంచే వుంది. అమెరికాలోని అతిపెద్ద మల్టీప్లెక్స్ చైన్ ఏఎంసీ థియేటర్స్ ‘మూవీపాస్’ అనే నెలవారీ చందా ప్లానుని ప్రారంభించింది. నెలకు 10 డాలర్లు చెల్లించి వారానికి మూడు సినిమాలు చూడొచ్చు. 30 లక్షల మంది చందాదారులు చేరారు. ప్రస్తుతం సవరించిన తాజా ప్లానులో మూడు తరగతులున్నాయి. 10 డాలర్ల ప్లానులో నెలకు 3 సినిమాలు, 20 డాలర్ల ప్లానులో 7 సినిమాలు, 30 డాలర్ల ప్లానులో 11 సినిమాలు చూడ వచ్చు. అయితే ఈ ప్లాన్లు స్టాండర్డ్ 2 డీ స్క్రీన్స్ కే పరిమితం. ఈ ప్లాన్లు దేశవ్యాప్తంగా 4 వేలకి పైగా గల ఏఎంసీ (అమెరికన్ మల్టీ సినిమా) థియేటర్స్ అన్నిటికీ వర్తిస్తుంది.

అమెరికాలో సినిమా ప్రేక్షకులు, పత్రికల పాఠకులు మన దేశంలో కంటే చాలా ఎక్కువ. ఏఎంసీ ‘మూవీ పాస్’ ప్లాన్స్ కి ప్రేక్షకులు 30 లక్షలకి మించిపోయారు. అటువంటిది మన దేశంలో పీవీఆర్- ఐనాక్స్ క్రమశిక్షణ లేని చందాదారుల్ని పోగేసుకోవడానికీ, వాళ్ళని నిలుపుకోవడానికీ చాలా సిగపట్లకే దిగాల్సి వుంటుంది.

First Published:  14 Oct 2023 6:33 AM GMT
Next Story