Telugu Global
Cinema & Entertainment

పివిఆర్- ఐనాక్స్ షేర్లు ‘ఆదిపురుష్’ తో మరింత ఆవిరి!

పివిఆర్- ఐనాక్స్ షేర్లు ‘ఆదిపురుష్’ తో మరింత ఆవిరి!
X

పివిఆర్- ఐనాక్స్ షేర్లు ‘ఆదిపురుష్’ తో మరింత ఆవిరి!

పానిండియా స్టార్ ప్రభాస్ నటించిన 600 కోట్ల భారీ చలన చిత్రరాజం ‘ఆదిపురుష్’ విడుదలవుతోందనగా ప్రేక్షకులు, విమర్శకులు, ట్రేడ్ విశ్లేషకులు, పంపిణీదారులు, నిర్మాతలు, దర్శకులూ, అలాగే మల్టీప్లెక్స్ ఆపరేటర్లు సహా ఈక్విటీ పెట్టుబడిదారులందరూ అత్యంత ఉత్కంఠతో ఎదురు చూశారు. భారీ ప్రమోషన్ల ఫలితంగా రికార్డ్ అడ్వాన్సు బుకింగ్స్ ని అందించి మరీ వార్తల్లో నిలిచింది ‘ఆదిపురుష్’. తొలి వారాంతపు షోల కోసం 6 లక్షలకు పైగా టిక్కెట్లు కూడా అమ్ముడయ్యాయి.

దీంతో పివిఆర్- ఐనాక్స్ మల్టీప్లెక్స్ గ్రూపు కొనసాగుతున్న త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్ కాలం) మెరుగైన పనితీరుని ప్రదర్శిస్తుందని ట్రేడ్ వర్గాలు విశ్వసించాయి. ఇలా ‘ఆదిపురుష్’ పివిఆర్‌ - ఐనాక్స్‌ షేర్‌లకు పెద్ద ఊపునిస్తుందన్న అంచనాలకు భిన్నంగా, సినిమా విడుదలైన తొలిరోజే వీక్షించిన ప్రేక్షకుల నుంచి వచ్చిన నెగిటివ్‌ మౌత్ టాక్ తో, 3 శాతానికి పైగా షేర్లు పతనమయ్యాయి. ఇది చాలనట్టు సోమవారం మరింత పతనమై 5 శాతానికి చేరాయి.

ఏ సినిమా ఫ్లాపైనా నిర్మాతలు, బయ్యర్లు నష్టపోవడం మామూలే. కానీ సినిమా ప్రదర్శించిన థియేటర్ షేర్లు కూడా పడిపోవడం ఇప్పుడు కొత్త దృశ్యం. ‘ఆదిపురుష్’ విడుదలైన జూన్ 16 వ తేదీ శుక్రవారం నాడే పివిఆర్ -ఐనాక్స్ షేర్లు 3.40 శాతం నష్టపోయి, షేరు ధర రూ.1,448 కి పడిపోయింది. ప్రేక్షకుల నెగెటివ్ మౌత్ టాక్ తో బాటు, మీడియాలో ప్రతికూల సమీక్షలు షేర్లపై ప్రభావం చూపాయి. ముందు రోజు షేరు ధర రూ. 1500.05 వుంది. ‘ఆదిపురుష్’ టీజర్, ట్రైలర్ విడుదలైనప్పటి నుంచే వివాదాల్లో వుంది. అయితే ‘ఆదిపురుష్’ పై పివిఆర్ -ఐనాక్స్ భారీ ఆశలు పెట్టుకుంది.

ట్రేడ్ పండితుల ప్రకారం హిందీ, తెలుగు వెర్షన్ల టికెట్లు దాదాపు 6 లక్షలు ఆదివారం వరకు పివిఆర్- ఐనాక్స్ ఔట్లెట్లలో అమ్ముడయ్యాయి. సౌత్ లో వచ్చిన ఆదాయం సంతృప్తికరంగా అన్పింఛాయి. ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం టిక్కెట్ ధరల్ని పెంచుకోవడానికి అనుమతించడం, పివిఆర్ -ఐనాక్స్ కి చెందిన 31 శాతం స్క్రీన్‌లు సౌత్ లో అధిక ఆక్యుపెన్సీతో వుండడం కలిసి వచ్చాయి. దేశీయ మార్కెట్ లో ‘ఆదిపురుష్’ 6,200 స్క్రీన్లలో విడుదలైంది. ఇందులో హిందీ వెర్షన్ స్క్రీన్లు 4,000. ‘ఆదిపురుష్’ తన బలమైన బాక్సాఫీసు వసూళ్ళు అలాగే కొనసాగించి వుంటే జూన్ తో ముగిసే చివరి త్రైమాసికంలో పివిఆర్- ఐనాక్స్ గడిచిన త్రైమాసికపు నష్టాల్ని పూరించుకునే అవకాశముందేది. దీనికి అవకాశం లేకుండా సోమవారం నాటికి షేర్లు మరింత పతనమై 5 శాతానికి చేరాయి.

2022 మార్చిలో పివిఆర్ - ఐనాక్స్ లీజర్ సంస్థలు 1500 కంటే ఎక్కువ స్క్రీన్‌ల నెట్వర్క్ తో దేశంలోనే అతిపెద్ద మల్టీప్లెక్స్ చైన్‌ ని రూపొందించడానికి విలీనాన్ని ప్రకటించాయి. ఓవర్-ది-టాప్ (ఓటీటీ ) ప్లాట్‌ఫామ్స్ పెరుగుదల, కోవిడ్ మహమ్మారి ఆగమనం రెండూ కలిసి ఈ మల్టీప్లెక్స్ చెయిన్‌ల విలీనానికి దారితీయించాయి. ఇలావుండగా ‘ఆదిపురుష్’ నిన్న శుక్రవారం రెండో వారంలోకి ప్రవేశించింది. అయితే ఇప్పుడు బాక్సాఫీసుతో జీవన్మరణ పోరాటం చేస్తోంది. నిన్న శుక్రవారం కేవలం రూ 3.25 కోట్లు వసూలు చేసింది. సినిమాలో డైలాగులు మార్చినప్పటికీ ఫలితం లేదు. శుక్రవారం హిందీ ఆక్యుపెన్సీ 11.20 శాతానికి మించలేదు. రోజురోజుకూ కలెక్షన్లు పతనమవుతున్నాయి.

అయినా ఇంకా వదలకుండా రోజువారీ దూషణలు కొనసాగుతూనే వున్నాయి. ఈ దూషణలు చేస్తోంది ఎవరా అని చూస్తే టీవీ సీరియల్స్ నటులే కనిపిస్తారు. రామాయణ్, శక్తిమాన్, మహాభారత్ టీవీ సీరియల్స్ తో నటించిన నటులే రోజువారీ శాపాలు పెడుతున్నారు. ఇవే వైరల్ అవుతున్నాయి. నిన్న శక్తి మాన్ హీరో ముఖేష్ ఖన్నా ‘ఆదిపురుష్ ‘ టీం మొత్తాన్నీ 50 డిగ్రీల మంటల్లో వేయాలని విరుచుకు పడ్డాక, ఇప్పుడు ‘మహాభారత్’ నటుడు, యుధిష్ఠిరుడి పాత్రధారి గజేంద్ర చౌహాన్ తన వంతు దూషణతో ముందుకొచ్చాడు. యువతరాన్ని నాశనం చేయడానికే ఈ సినిమా తీశారని ఆరోపించాడు.

టిక్కెట్టు కొన్నానని, అయితే సినిమా చూసేందుకు మనస్సాక్షి ఒప్పుకోకపోవడంతో చూడలేదన్నాడు. వైరల్ అవుతున్న ట్రైలర్, క్లిప్స్ చూసిన తర్వాత మాత్రమే సినిమా చూడదగింది కాదని తనకి అర్థమైందనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ తన నమ్మకాలపై రాజీ పడకూడదనుకుంటున్నాననీ చెప్పుకొచ్చాడు. ఇక్కడితో ఆగిపోకుండా, టీ-సిరీస్‌ కి ఇలాటి సినిమాలు తీయకూడదని సలహాలు కూడా ఇచ్చాడు. వీటన్నింటి వెనుక కుట్ర వుందని నమ్ముతున్నానంటూ, ఈ వ్యక్తులు రాబోయే తరాల్ని నాశనం చేయాలనుకుంటున్నారనీ ఆరోపించాడు.

కాగా, ఇప్పుడు సినిమాలో డైలాగులు మార్చి ప్రయోజనం లేదనీ, జరగాల్సిన నష్టం ఎప్పుడో జరిగిపోయిందనీ, ఇప్పటికే సినిమా నిర్మాతలు చేసిన తప్పుకి జనాలు శిక్షించారనీ చెప్పాడు. వసూళ్ళు భారీగా తగ్గాయనీ, ఈ వ్యక్తులు శిక్షకి అర్హులనీ చెబుతూ రచయిత మనోజ్ ముంతసిర్ శుక్లాపై కూడా విరుచుకుపడ్డాడు. లిరిక్స్ రైటర్ ని డైలాగులు రాయమని అడగకూడదని చెప్పాడు. ‘లంకా మే ఆగ్ లగా దూంగా’ (లంకకు నిప్పంటించేస్తా) లాంటి డైలాగులు కూడా కుమార్ విశ్వాస్ వీడియో నుంచి కాపీ చేశాడనీ, ఇవి సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయనీ చెప్పుకొచ్చాడు గజేంద్ర చౌహాన్.

అన్నట్టు గజేంద్ర చౌహాన్ ‘మహాభారత్’ సీరియల్లో నటించిన తర్వాత బి గ్రేడ్ సినిమాల్లో నటిస్తూ పోయాడు. 2015లో కాషాయ కండువా వేసుకుని అరకొర అర్హతలతో పుణె ఫిలిమ్ ఇనిస్టిట్యూట్ ఛైర్మన్‌గా పదవినలంకరించాడు. ఇది అక్కడి విద్యార్ధుల్లో వ్యతిరేకతని రేకెత్తించి, తీవ్ర ఆందోళనకి దారి తీసింది. దీంతో 2017లో రాజీనామా చేసి బయటపడ్డాడు.

First Published:  24 Jun 2023 7:06 AM GMT
Next Story