Telugu Global
Cinema & Entertainment

సౌత్ లో తగ్గింపు ధరలకి పీవీఆర్ సినిమా కూపన్లు ప్రారంభం!

ఈ సేవలో భాగంగా, సినిమా ప్రేక్షకులు రూ. 349 ధరతో 4 సినిమా కూపన్లు పొందుతారు. దీనిని నెలలోపు సోమ, మంగళ, బుధ, గురువారాల్లో మాత్రం వినియోగించుకోవచ్చు.

సౌత్ లో తగ్గింపు ధరలకి పీవీఆర్ సినిమా కూపన్లు ప్రారంభం!
X

మల్టీప్లెక్స్ చైన్ పీవీఆర్- ఐనాక్స్ లిమిటెడ్ సినిమా సబ్‌స్క్రిప్షన్ సర్వీసు రెండవ ఎడిషన్ సోమవారం ప్రారంభించింది. ఈ సర్వీసులో 50 శాతం డిమాండ్ దక్షిణ ప్రేక్షకుల నుంచి వచ్చే అవకాశముందన్న వార్త ఆసక్తి రేపుతోంది. పీవీఆర్ పాస్‌పోర్ట్ సర్వీసుని కొన్నినెలల క్రితం ప్రయోగాత్మకంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీని ద్వారా వచ్చిన ఫీడ్ బ్యాక్ ని పురస్కరించుకుని సర్వీసులో మార్పు చేర్పులు చేసి, ఇప్పుడు పీవీఆర్ పాస్ పోర్టు 2.0 ని ఆచరణాత్మకంగా అమల్లోకి తెచ్చింది. దీని డిమాండ్‌లో 50 శాతం సౌత్ నుంచి వస్తుందని కంపెనీ అంచనా వేస్తోంది. మిగిలిన 50 శాతం దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వుంటుందని భావిస్తోంది.

ఈ సేవలో భాగంగా, సినిమా ప్రేక్షకులు రూ. 349 ధరతో 4 సినిమా కూపన్లు పొందుతారు. దీనిని నెలలోపు సోమ, మంగళ, బుధ, గురువారాల్లో మాత్రం వినియోగించుకోవచ్చు. సాధారణంగా పీవీఆర్ మల్టీప్లెక్సుల్లో టికెట్టు ధర రూ. 200 వుంటుంది. ఈ రీత్యా నాలుగు కూపన్ల ధర రూ. 800 పలుకుతుంది. కానీ ఈ సర్వీసులో సగానికి పైగా తగ్గుతుంది. అయితే రెగ్యులర్ గా వుండే టికెట్టు ధర రూ.200, పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు రూ. 300 గా మారుతుంది. మరి కొత్తగా విడుదలయ్యే పెద్ద సినిమాలకు ఈ కూపన్లు వర్తిస్తాయా లేదా స్పష్టత కంపెనీ ఇవ్వాల్సి వుంది.

పీవీఆర్ పాస్‌పోర్టు 2.0 డిమాండ్‌ కి సౌత్ 50 శాతం కంటే ఎక్కువ సహకారం అందిస్తున్నప్పటికీ, ఈ సదుపాయాన్ని ఐమాక్స్, డైరెక్టర్స్ కట్ వంటి ప్రీమియం ఫార్మాట్‌లకి పొందలేరు. దక్షిణాదిలో కాకుండా ఇతర మార్కెట్‌లలో రూ. 150 అదనపు రుసుము చెల్లిస్తే, ఇమాక్స్, పీ(ఎక్స్ ఎల్), ఐసీఈ, స్క్రీన్ ఎక్స్, ఎంఎక్స్ 4 డీ, 4 డీఎక్స్ వంటి ప్రీమియం ఫార్మాట్‌లకు యాక్సెస్ పొందవచ్చు.

సౌత్ మార్కెట్ లో ఎక్కువ ఐమాక్స్ థియేటర్లు, ఇతర ఉన్నత ఫార్మాట్ థియేటర్‌లు లేవు. కాబట్టి ఐమాక్స్, 4 డీఎక్స్,డైరెక్టర్స్ కట్ వంటి ప్రీమియం ఫార్మాట్‌ల లభ్యత దక్షిణ ఫ్రేక్షకులకు కష్టతరమవుతుంది. హైదరాబాదులో, తమిళనాడులో సినిమా టిక్కెట్‌లపై ధర పరిమితులు ఐమాక్స్ తో బాటు ఇతర ప్రీమియం ఫార్మాట్‌లలో తక్కువ థియేటర్లకి కారణమవుతోందని తెలుస్తోంది.

పీవీఆర్ పాస్‌పోర్టు 2.0 ప్రోగ్రాము ఎల్లకాలం వుండదు. 2 వారాల పాటు మాత్రమే అందుబాటులో వుంటుంది. పీవీఆర్ పాస్ పోర్టు తొలి ఎడిషన్ లో దాదాపు 20,000 సబ్‌స్క్రిప్షన్‌లు నమోదయ్యాయి. 2.0 వచ్చేసి 50,000 సబ్‌స్క్రిప్షన్‌ల పరిమితితో పరిసమాప్తమవుతుంది.

ఇంతకి ముందు ప్రేక్షకులు రూ. 699 ధర కలిగిన పీవీఆర్ పాస్ పోర్టుని ఉపయోగించి 10 సినిమాలని వీక్షించేవారు. ఈ సర్వీసులో వినియోగదారుల అభిప్రాయాల్ని దృష్టిలో వుంచుకుని రూ. 349 లకు 4 సినిమాలుగా మార్చారు. అయితే సబ్‌స్క్రైబర్‌లు రూ. 1,047 ముందస్తుగా చెల్లించి, 3 నెలల సబ్‌స్క్రిప్షన్‌ని కొనుగోలు చేసే అవకాశం కూడా ఇప్పుడుంది. ఈ ఆఫర్ లో రూ. 350 విలువైన ఆహార పానీయాల వోచర్‌లు పొందవచ్చు. ఇంకెందుకు ఆలస్యం బయల్దేరండి!



First Published:  19 March 2024 6:36 AM GMT
Next Story