Telugu Global
Cinema & Entertainment

హిందీ సినిమాల ఎఫెక్ట్ : 3 నెలల్లో 130 కోట్లు నష్టం!

టాప్ మల్టీప్లెక్స్ చైన్ పీవీఆర్- ఐనాక్స్ లిమిటెడ్ మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో రూ. 130 కోట్లు నష్టాన్ని నమోదు చేసినట్టు పేర్కొంది.

హిందీ సినిమాల ఎఫెక్ట్ : 3 నెలల్లో 130 కోట్లు నష్టం!
X

టాప్ మల్టీప్లెక్స్ చైన్ పీవీఆర్- ఐనాక్స్ లిమిటెడ్ మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో రూ. 130 కోట్లు నష్టాన్ని నమోదు చేసినట్టు పేర్కొంది. దీనికి మునుపటి త్రైమాసికంలో రూ. 333 కోట్ల నష్టంతో పోల్చుకుంటే ఇది తక్కువే. అయితే భారీ బడ్జెట్ బాలీవుడ్ సినిమాలు పరాజయం పాలవడంతో కంపెనీకి రెండు త్రైమాసికాల తర్వాత కూడా మళ్ళీ ఎర్ర జెండానే కనిపిస్తోంది. హిందీ సినిమాల సగటు కంటే తక్కువ పనితీరు కారణంగా మొదటి త్రైమాసికంలో రూ. 44.1 కోట్ల నికర నష్టాన్ని మాత్రం చవిచూసింది. ప్రేక్షకుల సంఖ్య నెమ్మదిగా పుంజుకోవడం, సినిమా ప్రకటనల ఆదాయం పెరగడం మొదటి త్రైమాసికంలో నష్టాల్ని తగ్గించింది.

2023 లో షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’, సన్నీ డియోల్ నటించిన ‘గదర్ 2’ వంటి సినిమాలతో ఈ మల్టీప్లెక్స్ చైన్ రెండో త్రైమాసికంలో బ్లాక్ బస్టర్స్ ని రిపోర్టు చేయడంతో ఆశాజనకంగా అంకెలు మారాయి. కానీ హృతిక్ రోషన్- దీపికా పడుకొనే నటించిన ‘ఫైటర్’ వంటి పెద్ద సినిమాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేక పోవడంతో తర్వాతి రెండు త్రైమాసికాలు నష్టాల్ని మిగిల్చాయి. కంపెనీ కార్యకలాపాల ద్వారా ఆర్జించిన మొత్తం ఆదాయం రూ. 1,256.4 కోట్లకు చేరుకుంది. అంతకి ముందు సంవత్సరంతో పోలిస్తే రూ. 1,143.2 కోట్లకు 10 శాతం పెరిగింది. మూడో త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా రూ.1,545.9 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.

ఈ నేపథ్యంలో కంపెనీ వ్యాపారం కోసం నాలుగు కీలక వ్యూహాత్మక ప్రాధాన్యతల్ని గుర్తించింది. ఇవి మధ్యస్థ, దీర్ఘకాలిక ప్రణాళికలుగా వృద్ధి వ్యూహానికి మార్గదర్శకంగా పని చేస్తాయి. సినిమా పాస్‌పోర్ట్, సినిమా లవర్స్ డే, ఫిల్మ్ ఫెస్టివల్స్, లైవ్ కన్సర్ట్ లు, కీ స్పోర్టింగ్, ఇంకా ఇతర ఈవెంట్‌లతో ప్రత్యామ్నాయ కంటెంట్‌ని ప్రదర్శించడం వంటి బాక్సాఫీసు కార్యక్రమాలని నడపడం ద్వారా, ఆదాయాన్ని పెంచడంగా ఈ ప్రణాళికలుంటాయి.

ఆపరేషనల్ సినిమాల అద్దెల గురించి మళ్ళీ చర్చలు జరపడం, పనితీరు కనబర్చని స్క్రీన్స్ ని మూసివేయడం, ఓవర్‌హెడ్ ఖర్చుల్ని తగ్గించడం వంటి చర్యలపై తదుపరి దృష్టి వుంటుంది. రాబోయే కొద్ది సంవత్సరాల్లో కంపెనీని నికర రుణ రహిత కంపెనీగా మార్చడం ఇంకో ప్రాధాన్యంగా వుంటుంది.

ఇకపోతే గత ఆర్ధిక సంవత్సరంలో నష్టాల్లో వున్న 85 స్క్రీన్స్ ని మూసివేసిన తర్వాత ఈ తాజా ఆర్ధిక సంవత్సరంలో మరో 70 స్క్రీన్స్ ని మూసివేయడం జరుగుతుంది. ఇదే సమయంలో సౌత్ లో 120 కొత్త స్క్రీన్స్ ని ప్రారంభించడం ద్వారా దూకుడుగా విస్తరించడానికి కంపెనీ వ్యూహ రచన చేస్తోంది. ఇది దక్షిణ భారత మార్కెట్‌ని మెరుగుపరుస్తుంది.

కంపెనీ ప్రకారం, మార్చి 31తో ముగిసిన చివరి త్రైమాసికం సంవత్సరం మొత్తం మీద అత్యంత బలహీనమైనది. ప్రేక్షకుల సంఖ్య దాదాపు 32.6 మిలియన్లుగా వుంది. ‘బడే మియా చోటే మియా‘, ‘మైదాన్’ ల వంటి పెద్ద సినిమాలు అంచనాలని అందుకోలేకపోయాయి, ప్రస్తుతం జరుగుతున్న సాధారణ ఎన్నికలు కొత్త విడుదలలపై ప్రభావం చూపాయి. అయితే, జూన్ మధ్య నాటికి పరిస్థితి స్థిరంగా వుంటుందని కంపెనీ అంచనా వేస్తోంది.

ఫుడ్ బిజినెస్ వైపు చూపు!

కాగా, కంపెనీ ఎఫ్ అండ్ బి (ఫుడ్ అండ్ బేవరేజెస్) ని విస్తరించేందుకు దేవయాని ఇంటర్నేషనల్‌తో కలిసి 5-6 ఫుడ్ కోర్టుల్ని ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ మల్టీప్లెక్స్ ఆపరేటర్ కేవలం ఎగ్జిబిషన్ కంపెనీగా కాకుండా, ఎఫ్ అండ్ బి ప్లేయర్‌గా కూడా మారాలని యోచిస్తున్నట్టు తెలిపింది. మాల్స్ లో ఫుడ్ కోర్టుల్ని తెరవడం ద్వారా ఎఫ్ అండ్ బి వ్యాపారాన్ని విస్తరించబోతోంది.

అంటే కంపెనీ ప్రేక్షకులు సినిమా టిక్కెట్‌ని కొనుగోలు చేసే ముందే వారి పర్సుల్లో తన వాటాని పొందుతుంది. కంపెనీ మొత్తం ఆదాయానికి అతిపెద్ద సహకారి ఎఫ్ అండ్ బి సెగ్మెంట్ అయితే, ఎక్కువ ఆదాయం టికెట్ల అమ్మకాల తర్వాత ఎఫ్ అండ్ బి నుంచే వస్తోంది. ప్రీ-టిక్కెట్ సేల్స్ గా చేసిన ఎఫ్ అండ్ బి సెగ్మెంట్‌ని పెంచుకోవడానికి, క్విక్ సర్వీస్ రెస్టారెంట్ చైన్ దేవయాని ఇంటర్నేషనల్ తో జాయింట్ వెంచర్ కింద మొదటి సంవత్సరంలో ఐదు నుంచి ఆరు ఫుడ్ కోర్టుల్ని తెరుస్తుంది. ఫుడ్ కోర్టుల్ని తెరవడం అనేది ప్రీ-టిక్కెట్డ్ ఎఫ్ అండ్ బిని విస్తరించే మొత్తం పథకంలో కంపెనీ తీసుకుంటున్న కార్యక్రమాలలో ఒకటి. పోస్ట్ టికెటెడ్ ఎఫ్ అండ్ బి దాదాపు రూ. 2,000 కోట్లుగా వుంది. ముఖ్యంగా దేవయాని ఇంటర్నేషనల్ కెఎఫ్‌సి, పిజ్జా హట్, కోస్టా కాఫీ వంటి బ్రాండ్‌లని తీసుకురావడంతో వ్యాపారం బాగా పెరిగే అవకాశముంది.

First Published:  15 May 2024 11:31 AM GMT
Next Story