Telugu Global
Cinema & Entertainment

మల్టీప్లెక్సుల్లో అయోధ్య కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం!

ఈ ముఖ్యమైన వేడుకని 70 నగరాల్లోని 160 కి పైగా స్రీన్ లలో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వేడుక ప్రత్యక్ష ప్రసారం వుంటుంది.

మల్టీప్లెక్సుల్లో అయోధ్య కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం!
X

జనవరి 22న అయోధ్య టెంపుల్ ప్రారంభోత్సవ ముహూర్త సమయాన్ని, మరో వైపు పూర్తికాని మందిరంలో విగ్రహ ప్రాణప్రతిష్టని మతాధిపతులు నల్గురు శంకరాచార్యులు తీవ్రంగా వ్యతిరేకించి, బాయ్ కాట్ చేయడం దేశవ్యాప్తంగా వేడి పుట్టిస్తున్న సందర్భంలో, ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని పాలక పక్ష పార్టీ ప్రారంభోత్సవంతో ముందుకే వెళ్తూ ప్రారంభోత్సవ కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు చేసేసింది. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా వివిధ ఫార్మాట్లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ముఖ్యంగా మల్టీప్లెక్స్ దిగ్గజం పీవీఆర్ - ఇనాక్స్ జనవరి 22 న ప్రత్యక్ష ప్రసారాన్ని తీసుకువస్తున్నట్లు ప్రకటించింది.

ఈ ముఖ్యమైన వేడుకని 70 నగరాల్లోని 160 కి పైగా స్రీన్ లలో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వేడుక ప్రత్యక్ష ప్రసారం వుంటుంది. పీవీఆర్ -ఇనాక్స్ యాప్ లేదా వెబ్‌సైట్, లేదా బుక్ మై షో వంటి ఇతర ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా టిక్కెట్లు పొందవచ్చు. టికెట్టు ధర కేవలం 100 రూపాయలు. టికెట్టుపై ఒక పానీయం, పాప్ కార్న్ ఉచితం. పెద్ద స్క్రీన్‌లపై చారిత్రాత్మక ఘటనను చూసేందుకు ఆసక్తిగల ప్రేక్షకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.

ఆజ్ తక్ టీవీ చానెల్ తో కలిసి పీవీఆర్ - ఐనాక్స్ సంయుక్తంగా చేపట్టిన ఈ ప్రదర్శనకి టికెట్లు పెద్ద యెత్తున బుక్ అవుతున్నాయి. ‘ఇలాంటి గొప్ప చారిత్రక సందర్భాలని గొప్పగా అనుభవించాలి. సినిమా స్క్రీన్‌లు సామూహిక వేడుకల భావోద్వేగాలకి జీవం పోస్తాయి. దేశవ్యాప్తంగా ఈ వేడుకతో భక్తుల్ని నిజంగా ప్రత్యేకమైన రీతిలో కనెక్ట్ చేయడం మాకు ఒక అదృష్టం’ అని పీవీఆర్ -ఐనాక్స్ లిమిటెడ్ సహ-సీఈఓ గౌతమ్ దత్తా అన్నారు.

ఈ మహత్తర సందర్భం గురించి తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ‘దేశ సమకాలీన చరిత్రలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణానికి సంబంధించిన మ్యాజిక్‌ ని సజీవంగా తీసుకుని, ఆలయ సందడిని, మంగళకరమైన కీర్తనల్ని, ఉత్కంఠభరితమైన విజువల్స్ నీ వెండి తెరల మీద ప్రదర్శించగలమని మేము ఆశిస్తున్నాము. చిరస్మరణీయంగా ప్రేక్షకుల్ని సంలీనం చేసే ప్రదర్శనని అందించడానికి మా నిబద్ధత, అనుభవం వినోదానికి మించి విస్తరించి వున్నాయి. ఈ చారిత్రాత్మక క్షణాన్ని మా ప్రేక్షకులతో పంచుకోవడానికి మేము సంతోషంగా ఎదురు చూస్తున్నాము’ అన్నారు.

ఆజ్ తక్ ప్రతినిధి మాట్లాడుతూ, ‘చారిత్రాత్మక ఘట్టాలలో అగ్రగామిగా వుండాలనే నిబద్ధతతో మేమున్నాము. పీవీఆర్- ఇనాక్స్ సహకారం మా మిషన్‌ ని కొత్త శిఖరాలకి తీసుకువెళ్ళి, దేశంలోని మిలియన్ల మందిని కలిపే ముఖ్యమైన సందర్భానికి తావిచ్చింది. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట అయినా లేదా ఇతర కీలక క్షణాలు అయినా, విశ్వసనీయతతో కూడిన కవరేజీని కోరుకునే వారికి ఆజ్ తక్ మార్గంగా కొనసాగుతుంది’ అని పేర్కొన్నారు.

ఈ వేడుకని దూరదర్శన్‌ -డీడీ న్యూస్, డీడీ నేషనల్ ఛానెల్‌లు ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి. ఇతర వార్తా ఛానెల్‌లు యూట్యూబ్‌ సహా దూరదర్శన్ ఫీడ్‌ ని అందిస్తాయి. 4కె టెక్నాలజీలో ప్రత్యక్ష ప్రసారాన్ని అందించడానికి దూరదర్శన్ రామ మందిరం సముదాయం సహా అయోధ్యలోని వివిధ ప్రదేశాల్లో 40 కెమెరాలని ఏర్పాటు చేసింది. సరయు ఘాట్ సమీపంలోని జటాయు విగ్రహం నుంచి ప్రత్యక్ష విజువల్స్ కూడా ప్రసారమవుతాయి.

టీవీ ఛానెల్స్ తో పాటు పెద్ద, చిన్న పట్టణాలలో పెద్ద స్క్రీన్‌లపై వేడుకని ప్రదర్శించనున్నారు. వివిధ సంస్థలు ఇలాంటి ప్రదర్శనలు నిర్వహిస్తాయి. రైల్వే స్టేషన్‌లలో ఏర్పాటు చేసిన టీవీల్లో ఈవెంట్‌ ని రైల్వే శాఖ ప్రదర్శిస్తుంది. ఈ వేడుకని న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్‌ కూడలిలో అతి పెద్ద బిల్ బోర్డులపై కూడా ప్రదర్శిస్తారు. ఇంతేగాక ప్రపంచవ్యాప్తంగా వున్న భారత రాయబార కార్యాలయాల్లో కూడా ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. దీనిపై బాలీవుడ్ నుంచి కూడా ప్రతిస్పందనలు వస్తున్నాయి... ఈ వారం డ్రైగా వున్నందున టెంపుల్ వేడుకల ప్రత్యక్ష ప్రసారం థియేటర్లకి కలిసి వస్తుందని, వాస్తవానికి పీవీఆర్-ఐనాక్స్ ప్రాపర్టీలు ఈ వారం పాత క్లాసిక్స్ చూపుతున్నాయని, ఇదే సమయంలో టెంపుల్ వేడుకని ప్రత్యక్షంగా చూపించడం అనేది తెలివైన ఆలోచన అనీ బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.

జనవరి 22 ఉదయం సినిమాల్లో ఫుట్‌ఫాల్స్ చాలా తక్కువగా వుంటాయనీ, ఎందుకంటే దేశం మొత్తం ఇళ్ళలో వేడుక ప్రత్యక్ష ప్రసారం చూడడానికి టీవీలకి అతుక్కుపోతారనీ, ఇదే సమయంలో మల్టీప్లెక్సుల్లో స్క్రీనింగులు ప్రక్షకుల్ని భారీ స్థాయిలో ఆకర్షిస్తాయనీ విశ్లేషిస్తున్నారు.

పీవీఆర్- ఐనాక్స్ ప్రస్తుతం అగ్నిపథ్(2012), చక్ దే ఇండియా (2007), దిల్ తో పాగల్ హై (1997), దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే (1995) వంటి నోస్టాల్జియా ఫిల్మ్ ఫెస్టివల్‌లో భాగంగా ఎంపిక చేసిన స్క్రీన్లలో పాత క్లాసిక్స్ ని ప్రదర్శిస్తోంది. ఓం శాంతి ఓం (2007), సాథియా (2002), చల్తీ కా నామ్ గాడీ (1958), ధోబీ ఘాట్ (2011), జానే భీ దో యారో (1983), జోరమ్ (2023), లైఫ్ ఇన్ మెట్రో (2007), ముంబై మేరీ జాన్ (2008) వంటి ముంబై-కేంద్రీకృత కథా చిత్రాల్ని కూడా ప్రదర్శిస్తోంది. పనిలో పనిగా జనవరి 19- 21 మధ్య, జాతీయ పాప్‌కార్న్ దినోత్సవ వేడుకలు కూడా కాబట్టి, ప్రేక్షకులు అదనపు చెల్లింపు లేకుండా పాప్‌కార్న్ ని తిన్నంత తిని కడుపులు నింపుకోవచ్చు. మళ్ళీ జనవరి 22న టికెట్టుపై ఉచితంగా పాప్ కార్న్ తోబాటు డ్రింకు లాగించ వచ్చు.

First Published:  20 Jan 2024 7:00 AM GMT
Next Story