Telugu Global
Cinema & Entertainment

టాలీవుడ్ లో షూటింగ్స్ బంద్?

టాలీవుడ్ లో మరో సంక్షోభం తలెత్తనుందా? త్వరలోనే షూటింగ్స్ అన్నీ నిలిచిపోతాయా? ప్రస్తుతం అలాంటి ఛాయలే కనిపిస్తున్నాయి.

టాలీవుడ్ లో షూటింగ్స్ బంద్?
X

చిత్ర పరిశ్రమ మరో సంక్షోభం దిశగా కూరుకుపోతోంది. ప్రస్తుతం వినిపిస్తున్న కథనాల ప్రకారం చూసుకుంటే.. ఆగస్ట్ 1 నుంచి టాలీవుడ్ లో మరోసారి షూటింగ్స్ కు బ్రేక్ పడబోతోంది. ఈ మేరకు నిర్మాతలంతా ఓ ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఏకాభిప్రాయం కుదిరితే, ఆగస్ట్ 1 నుంచి అన్ని రకాల షూటింగ్స్ నిలిపేయాలని ప్రొడ్యూసర్లంతా దాదాపు ఓ నిర్ణయానికి వచ్చేశారు.

కరోనా తర్వాత థియేట్రికల్ సిస్టమ్ పూర్తిగా మారిపోయింది. ప్రేక్షకులు థియేటర్లకు రావడం మానేశారు. పెద్ద సినిమాల రాకతో, సమ్మర్ సీజన్ లో ఆక్యుపెన్సీ పెరిగింది. దీంతో టాలీవుడ్ థియేట్రికల్ మార్కెట్ సెట్ అయిందని అంతా సంబర పడ్డారు. ఎప్పుడైతే పెద్ద సినిమాల సందడి తగ్గిందో, ఆ వెంటనే థియేట్రికల్ బిజినెస్ పడిపోయింది. ప్రస్తుతం ఓ మోస్తరు కంటెంట్ తో వస్తున్న సినిమాలు కూడా చూసేందుకు ఆడియన్స్ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. మొన్న రిలీజైన అంటే సుందరానికి, తాజాగా వచ్చిన వారియర్ సినిమాకు మంచి రివ్యూస్ వచ్చినప్పటికీ, ఆక్యుపెన్సీ లేకపోవడానికి ఇదే కారణం.

ఈ పరిస్థితులన్నింటిపై నిర్మాతలు చర్చిస్తున్నారు. వీటితో పాటు కరోనా తర్వాత పెరిగిన ప్రొడక్షన్ కాస్ట్ పై కూడా సీరియస్ గా ఉన్నారు నిర్మాతలు. మూలిగే నక్కపై తాటిపండు పడినట్టు.. హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు తమ పారితోషికాలు పెంచేశారు. దీంతో నిర్మాతకు బడ్జెట్ వ్యయం 40శాతం పెరిగిపోయింది. ఓవైపు థియేటర్లకు జనాలు రాని పరిస్థితిలో, ఇంకో వైపు ఆర్టిస్టులు రేట్లు పెంచేయడాన్ని నిర్మాతలు జీర్ణించుకోలేకపోతున్నారు.

దీంతో షూటింగ్స్ ఆపేయడమే దీనికి ఏకైక మార్గమని నిర్మాతలు భావిస్తున్నారు. ఎప్పుడైతే షూటింగ్స్ ఆగిపోతాయో, అప్పుడు పెద్ద హీరోలు చర్చలకు వస్తారని, రెమ్యూనరేషన్లు తగ్గిస్తారని ప్రొడ్యూసర్లు భావిస్తున్నారు. మరోవైపు ఓటీటీపై కూడా నిర్మాతలకు పలు అభ్యంతరాలున్నాయి. థియేటర్లలో రిలీజైన ఓ పెద్ద సినిమాను 50 రోజుల తర్వాతే ఓటీటీకి ఇవ్వాలనే నిబంధనను ఈమధ్య పెట్టుకున్నారు. ఇప్పుడీ క్యాపింగ్ ను 10 వారాలకు పొడిగించాలని నిర్మాతలు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు ఫిలిం ఫెడరేషన్ డిమాండ్లు ఉండనే ఉన్నాయి. సినీ కార్మికులు తమ జీతాలు పెంచమంటున్నారు. దానిపై ఓ కమిటీ కూడా ఏర్పాటైంది. ఇప్పుడు నిర్మాతలు సమ్మెకు దిగితే ఆ ప్రాసెస్ కూడా మధ్యలోనే ఆగిపోవడం ఖాయం.

షూటింగ్స్ ఆగితే ఆ సినిమాల పరిస్థితేంటి?

మహేష్ తన కొత్త సినిమాకు రెడీ అవుతున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో అతడు నటించాల్సి ఉంది. చిరంజీవి నటిస్తున్న 2 సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. పవన్ కల్యాణ్ నటిస్తున్న ఓ సినిమా సెట్స్ పై ఉంది. మరో సినిమా సెట్స్ పైకి రావాల్సి ఉంది. ప్రభాస్ అయితే ఏకంగా 2 సినిమాలు సెట్స్ పై ఉంచాడు. వీళ్లతోపాటు మీడియం రేంజ్ హీరోల సినిమాలన్నీ షూటింగ్ స్టేజ్ లో ఉన్నాయి. నిర్మాతలు షూటింగ్స్ ఆపేస్తే, ఈ సినిమాలన్నీ అర్థాంతరంగా ఆగిపోవడం ఖాయం. అలా ఆగిపోతే నష్టపోయేది నిర్మాతే. అయినప్పటికీ టాలీవుడ్ మార్కెట్ ను గాడిలో పెట్టాలంటే, ప్రాధమికంగా ఈ నష్టాన్ని భరించాల్సిందే.

ఈ సమయంలో నిర్మాతలంతా కలిసికట్టుగా ఉండకపోతే, నష్టపోయేది వాళ్లు మాత్రమే కాదు.. భవిష్యత్తులో ఆ ప్రభావం టాలీవుడ్ మార్కెట్ పై కూడా గట్టిగా పడుతుంది. ప్రేక్షక దేవుళ్లు అనే పదాన్ని నామ్ కే వాస్తే వాడితే సరిపోదు. ప్రేక్షకుడ్ని నిజంగా దేవుడిగా భావించి, ఇండస్ట్రీ అంత ఏకతాటిపైకి వచ్చినప్పుడు మాత్రమే థియేట్రికల్ వ్యవస్థ గాడిన పడుతుంది. లేదంటే రాబోయే రోజుల్లో థియేటర్లను శుక్రవారం తెరిచి, ఆదివారం రాత్రికి మూసేసే పరిస్థితి వస్తుంది. అదే పరిస్థితి తలెత్తితే, అప్పుడు టాలీవుడ్ ను బాగుచేయడం ఎవ్వరి తరం కాదు.

Next Story