Telugu Global
Cinema & Entertainment

MAD Movie | తక్కువ నవ్వితే డబ్బులు వెనక్కి

MAD Movie - సితార బ్యానర్ పై వచ్చింది మ్యాడ్ మూవీ. ఈ సినిమా నవ్వించకపోతే డబ్బులు వెనక్కి ఇచ్చేస్తానంటున్నాడు నిర్మాత.

MAD Movie | తక్కువ నవ్వితే డబ్బులు వెనక్కి
X

వైవిధ్యభరిత చిత్రాలతో తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటిగా ఎదిగిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ.. ఈమధ్య క్రేజీ అండ్ యూత్ ఫుల్ సినిమాలపై కన్నేసింది. ఇందులో భాగంగా 'మ్యాడ్' అనే క్రేజీ సినిమా తీసింది. ఇందులో అక్కడక్కడ అడల్ట్ కంటెంట్ కూడా ఉందనే విషయం తాజాగా రిలీజైన టీజర్ తో తేలిపోయింది.

అక్టోబర్ 6న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమాలో రామ్ నితిన్, సంగీత్ శోభన్, నార్నే నితిన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాతో నాగవంశీ సోదరి హారిక నిర్మాతగా పరిచయం అవుతున్నారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పై సాయి సౌజన్య సహ-నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమాకి నూతన దర్శకుడు కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించాడు. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ లో వేగం పెంచింది. మ్యాడ్ గ్యాంగ్ ని పరిచయం చేస్తూ తాజాగా ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఘనంగా జరిగిన ఈ వేడుకలో నిర్మాత నాగవంశీ చాలా కాన్ఫిడెంట్ గా కనిపించాడు. సినిమా ఏమాత్రం నవ్వించకపోయినా, ప్రేక్షకుడికి టికెట్ డబ్బులు వెనక్కు ఇచ్చేస్తామంటున్నాడు.

"జాతిరత్నాలు కంటే ఒక్కసారైనా తక్కువ నవ్వానని ఎవరైనా చెప్తే.. టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాం. సినిమా పట్ల అంత నమ్మకం ఉంది. ఇది యూత్ ఫుల్ సినిమా అయినప్పటికీ, కుటుంబమంతా కలిసి చూసేలా ఉంటుంది. ఇంజనీరింగ్ కాలేజ్ లైఫ్ ని గుర్తు చేయడానికి తీసిన సినిమా ఇది. లాజిక్ లు, ట్విస్ట్ లు ఏముండవు. సినిమా మొదలైనప్పటి నుండి చివరివరకు నవ్వుతూనే ఉంటారు. ఎవరైనా నవ్వు రాలేదని ట్వీట్ చేసినా డబ్బులిచ్చేస్తా."

ఇలా సినిమాపై పూర్తి విశ్వాసం ప్రకటించాడు నాగవంశీ. ఇదే బ్యానర్ నుంచి టిల్లూ స్క్వేర్ కూడా రెడీ అవుతోంది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కుతున్న ఆ సినిమా కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్ అవుతుంది.

First Published:  27 Sep 2023 5:07 PM GMT
Next Story