Telugu Global
Cinema & Entertainment

ఆర్ఆర్ఆర్ తమిళ చిత్రమన్న ప్రియాంక చోప్రా.. ఏకిపారేస్తున్న నెటిజన్లు

ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. హాలీవుడ్ లోనూ సత్తా చాటింది.

ఆర్ఆర్ఆర్ తమిళ చిత్రమన్న ప్రియాంక చోప్రా.. ఏకిపారేస్తున్న నెటిజన్లు
X

ఆర్ఆర్ఆర్ బాలీవుడ్ సినిమా కాదు తమిళ సినిమా అన్న బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రాను తెలుగు ప్రజలు సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు. ప్రియాంక చోప్రా తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా హోస్ట్ ఆర్ఆర్ఆర్ సినిమాను బాలీవుడ్ సినిమాగా వ్యాఖ్యానించగా.. దాన్ని సరిచేయబోయిన ప్రియాంక అది బాలీవుడ్ మూవీ కాదని.. ఒక తమిళ చిత్రమని చెప్పింది. దీంతో నెటిజన్లు ప్రియాంకపై ఫైర్ అవుతున్నారు. `ఆర్ఆర్ఆర్ తెలుగు సినిమా అన్న సంగతి కూడా నీకు తెలియదా?` అని మండిపడుతున్నారు.

ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. హాలీవుడ్ లోనూ సత్తా చాటింది. ప్రతిష్టాత్మక క్రిటిక్స్ ఛాయిస్, గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ అవార్డులు అందుకుంది. అయితే ఈ సినిమా ఎంత విజయం అందుకున్నా.. ఇండియా నుంచి వచ్చిన సినిమా కావడంతో ఈ మూవీని చాలామంది బాలీవుడ్ సినిమాగానే అనుకున్నారు. రాజమౌళి బృందం ఎక్కడికి వెళ్లినా.. ఇది బాలీవుడ్ సినిమా కాదు.. తెలుగు సినిమా అని చెప్పేవారు.

చివరికి ఆస్కార్ వేదికపై కూడా హోస్ట్ జిమ్మీ కిమ్మెల్ కూడా ఆర్ఆర్ఆర్ ను బాలీవుడ్ మూవీగా అభివర్ణించాడు. కాగా, తాజాగా బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా అమెరికన్ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా బాలీవుడ్, హాలీవుడ్ పోలికలపై మాట్లాడుకుంటున్న సమయంలో హోస్ట్ ఆర్ఆర్ఆర్ మూవీని బాలీవుడ్ సినిమాగా పేర్కొంది. హోస్ట్ తప్పును ప్రియాంక సరిదిద్దడానికి ప్రయత్నించింది. ఆర్ఆర్ఆర్ బిగ్, మెగా బ్లాక్ బస్టర్ తమిళ చిత్రమని.. అవెంజర్స్ లాగా ఉంటుందని చెప్పారు.

`హోస్ట్ కు టాలీవుడ్ గురించి తెలియక బాలీవుడ్ అని ఉంటుందని.. నీకు కూడా ఆర్ఆర్ఆర్ తెలుగు సినిమా అన్న సంగతి తెలియదా?`.. అని నెటిజన్లు ప్రియాంకను ట్రోల్స్ చేస్తున్నారు. ఆమెను ట్యాగ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ కోసం ప్రియాంక హాలీవుడ్ లో ప్రమోషన్స్ కూడా చేసింది. చరణ్ బృందానికి పార్టీ కూడా ఇచ్చింది. ఇంత చేసి ఈ సినిమా ఒక తెలుగు సినిమా అన్న సంగతి ప్రియాంకకు తెలియకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.

నిజానికి ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్ గా ఎంపికైన తర్వాత నటిగా ఆమెకు తొలి అవకాశం వచ్చింది తెలుగులోనే. ఆమె తొలి చిత్రం అపురూపం. అయితే ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు. ఈ సినిమా తర్వాతే ఆమెకు బాలీవుడ్ లో అవకాశాలు వచ్చాయి. రామ్‌చరణ్ హీరోగా రూపొందిన జంజీర్ సినిమాలో ప్రియాంక హీరోయిన్ గా నటించింది. టాలీవుడ్ గురించి ఇంత తెలిసిన ప్రియాంక ఆర్ఆర్ఆర్ మూవీని పట్టుకొని ఒక తమిళ సినిమా అని చెప్పడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

First Published:  30 March 2023 2:19 AM GMT
Next Story