Telugu Global
Cinema & Entertainment

Prabhas | ఇక చాలు- బాలీవుడ్ కో నమస్కారం!

Prabhas | అసలే బాలీవుడ్ సినిమాలకి కలెక్షన్స్ పడిపోయి పీవీఆర్- ఐనాక్స్ మల్టీప్లెక్స్ గ్రూపు తలపట్టుకుంటోంటే, ఇప్పుడు పానిండియా స్టార్ ప్రభాస్ బాలీవుడ్ ఆఫర్స్ కి నో చెప్పేయడం బాలీవుడ్ పరిస్థితికి అద్దం పడుతోంది.

Prabhas | ఇక చాలు- బాలీవుడ్ కో నమస్కారం!
X

అసలే బాలీవుడ్ సినిమాలకి కలెక్షన్స్ పడిపోయి పీవీఆర్- ఐనాక్స్ మల్టీప్లెక్స్ గ్రూపు తలపట్టుకుంటోంటే, ఇప్పుడు పానిండియా స్టార్ ప్రభాస్ బాలీవుడ్ ఆఫర్స్ కి నో చెప్పేయడం బాలీవుడ్ పరిస్థితికి అద్దం పడుతోంది. బాలీవుడ్ నే నమ్ముకుంటే లాభం లేదని పీవీఆర్ -ఐనాక్స్ ఇక హాలీవుడ్ సినిమాల్ని, కొరియన్ సినిమాలనీ దిగుమతి చేసుకుంటోంటే, ప్రభాస్ బాలీవుడ్ కి బైబై చెప్పేసి, సౌత్ దర్శకులతోనే పని చేయాలని నిర్ణయించుకోవడం బాలీవుడ్ ని ప్రశ్నార్థకం చేస్తోంది.

‘బాహుబలి’ తో ప్రభాస్ తన కెరీర్‌లో ఓ మైలురాయిని నెలకొల్పాడు. పానిండియా స్టార్ గా స్థాయి పొంది, తనకూ ఇతర స్టార్స్ కీ మధ్య ఒక గీత గీశాడు. గీత గీసి ‘బాహుబలి’ రెండు భాగాల తర్వాత ‘సాహో’, ‘రాధేశ్యామ్’, ‘ఆదిపురుష్’ అనే మూడు పానిండియాలు నటించాడు. ఈ మూడూ ఫ్లాప్ అవడంతో గీసిన గీత కాస్తా చెరిగి పోసాగింది. పైగా రాముడి పాత్ర నటించిన ‘ఆదిపురుష్’ లాంటి వివాదాస్పద పానిండియాతో ప్రతిష్టని దిగజార్చే చేదు అనుభవం ఎదురు కావడంతో, వెంటనే కళ్ళు తెరిచాడు. తెరిచి ఇక బాలీవుడ్ కి ఛాన్సు లేదని తలుపులు మూసేశాడు. ప్రస్తుతానికి ప్రభాస్ బాలీవుడ్ కి బై చెప్పేస్తునట్టు వెలువద్ద వార్తలతో బాలీవుడ్ లో సంచలనం సృష్టించాడు.

మాటే కాదు చేత కూడా చూపించాడు. బాలీవుడ్ అగ్ర దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తో ప్లానింగ్ లో వున్న పానిండియా యాక్షన్ థ్రిల్లర్ కి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. బాలీవుడ్ నుంచి దర్శకులు, రచయితలూ ఎవరూ తనని సంప్రదించవద్దని చెప్పేశాడు. బాలీవుడ్ స్క్రిప్ట్ రైటర్స్ తో అన్ని రకాల కమ్యూనికేషన్స్ ని నిలిపి వేశాడు. ఏ కథలూ వినే మూడ్ లో కూడా లేడు. ఈ సమాచారమంతా చూసి ప్రభాస్ హిందీ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో మునిగి పోయారు.

ప్రభాస్ బాలీవుడ్ నుంచి దృష్టి మరల్చి సౌత్ మీద ఫోకస్ చేయాలనుకోవడంతో ఇటు టాలీవుడ్ తో బాటు, అటు కోలీవుడ్ లోనూ సంతోషం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో వున్న పానిండియాలు సౌత్ దర్శకులవే. ఆఖరికి తెలుగులో మారుతి దర్శకత్వం వహిస్తున్న కామెడీలో సైతం నటిస్తున్నాడు. పూర్తిగా తెలుగు సినిమాల్లోనే నటించడానికి నిర్ణయించుకున్నట్టు కూడా తెలుస్తోంది. పానిండియా సినిమాల్ని బాలీవుడ్ నుంచి గాక టాలీవుడ్ నుంచి సంధించాలని కొత్త వ్యూహం రచిస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ‘సాలార్’, ‘రాజా డీలక్స్’, ‘కల్కి 2898 AD’, ‘స్పిరిట్’ నాలుగు తెలుగు సినిమాల్ని పూర్తి చేస్తూ బిజీగా వున్నాడు. ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ‘సాలార్’, మారుతితో ‘రాజాడీలక్స్’, నాగ్ అశ్విన్ తో ‘కల్కి 2898 AD’, ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ -ఈ నాల్గిటిలో ముందుగా సెప్టెంబర్ లో విడుదల కానున్న ‘సాలార్’ తో తిరిగి ‘బాహుబలి’ నాటి వైభవాన్ని పొందగలడా అన్న ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది.

‘ఆదిపురుష్’ విడుదలైన తర్వాత ప్రభాస్ వెకేషన్‌ కి వెళ్ళి నెలకి పైగా విదేశాల్లో గడిపాడు. తిరిగి రాగానే మారుతీ సినిమాకే ప్రాధాన్యమిచ్చాడు. ఈ మూవీ చాలా కాలంగా పెండింగులో వుంది. నిర్మాతలు ఇప్పటి వరకు ఒక్క అప్‌డేట్‌ కూడా ఇవ్వలేదు. ప్రభాస్, మారుతి ఏం చేస్తున్నారో చాలా మందికి ఎటువంటి క్లూ లేదు. అయితే ‘రాజా డీలక్స్’ యాక్షన్ మూవీ కాదని, కుటుంబం, స్నేహం అంశాలతో ఆరోగ్యకర వినోదంతో ఫ్రెష్‌గా వుంటుందనీ చెప్తున్నారు. ఇలాటి యాక్షన్, అడ్వెంచర్, భారీ గ్రాఫిక్స్ వంటి హంగులు లేని సాదా కామెడీలో ప్రభాస్‌ ని ప్రేక్షకులు చూసి చాలా కాలం అయ్యిందని అంటున్నారు. వర్షం, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి సినిమాల్లో కూడా ప్రభాస్‌ ని చూడాలని అభిమానులు తహతహ లాడుతున్నారని అంటున్నారు.

ఇలావుండగా, ప్రస్తుతం కోలీవుడ్ (తమిళం) లో స్టార్ డైరెక్టర్ గా వెలుగుతున్న లోకేష్ కనగ రాజ్, ఇప్పుడు ప్రభాస్ కోసం స్క్రిప్ట్ ని సిద్ధం చేస్తున్నాడని కొన్ని అప్డేట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం కనగ రాజ్ విజయ్ తో ‘లియో’ పూర్తి చేసే పనిలో వున్నాడు. ఈ ప్రభాస్ - లోకేష్‌ల పానిండియా ప్రాజెక్టుని ‘బాహుబలి’ నిర్మాత శోభు యార్లగడ్డ చేపడుతున్నట్టు తెలుస్తోంది. ఇందులో అనుష్క కీలక పాత్రలో, ఒక బాలీవుడ్ హీరోయిన్ మరో పాత్రలో నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఈ పరిణామాల్ని గమనిస్తూ ఆశాజీవులు తమ లెక్కలు తాము వేసుకుంటున్నారు. ప్రభాస్ బాలీవుడ్‌కి బై చెప్పినా, భవిష్యత్తులో పరిస్థితులు మారవచ్చని గమనించాలంటున్నారు బాలీవుడ్ ఆశాజీవులు. ప్రభాస్ మరోసారి బాలీవుడ్ దర్శకులతో పని చేస్తారని ఆశిస్తున్నట్టు, అతడి ప్రతిభని మరింత ఉచ్ఛస్థాయిలో చూసే అవకాశం అభిమానులకి కల్పిస్తారని భావిస్తున్నట్టూ ఆశాజీవులు అప్డేట్స్ ఇస్తున్నారు.

First Published:  7 Aug 2023 10:23 AM GMT
Next Story