Telugu Global
Cinema & Entertainment

Adipurush: వివాదాల మధ్య రూ. 150 లకే టికెట్!

Adipurush Movie: ఇప్పుడు త్రీడీలో ‘ఆదిపురుష్’ చూడాలంటే రూ.150 మాత్రమే టికెట్టు ధర అని ప్రత్యేకంగా పోస్టరు విడుదల చేశారు. ఈ భారీ ఆఫర్ జూన్ 22, 23 తేదీల్లో మాత్రమే అందుబాటులో వుంటుంది.

ఆదిపురుష్
X

ఆదిపురుష్

‘ఆదిపురుష్’ పై అభియోగాల పర్వం డైలీ సీరియల్ లాగా కొనసాగుతూనే వుంది. ఈ డైలీ సీరియల్ తాజా ఎపిసోడ్ లో ‘శక్తిమాన్’ సీరియల్ హీరో ముఖేష్ ఖన్నా పాలుపంచుకున్నాడు. ముఖేష్ ఖన్నా సొంతంగా ‘ది ముఖేష్ ఖన్నా షో’ అనే పాపులర్ యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్నాడు. కొత్త వీడియోలో ‘ఆదిపురుష్’ టీం పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ‘ఆదిపురుష్’ టీం మొత్తాన్నీ 50 డిగ్రీల మంటల్లో వేయాలని విరుచుకు పడ్డాడు. ‘రావణుడు భయానకంగా వుండవచ్చు, కానీ చంద్రకాంత సీరియల్లోని శివదత్ – విశ్వపురుష్ లాగా ఎలా కనిపిస్తాడు? అతను పండిట్. ఎవరైనా రావణ్‌ని ఈ విధంగా ఎలా ఊహించి డిజైన్ చేస్తారు? సినిమా అనౌన్స్ చేసినప్పుడు సైఫ్ ఆ పాత్రని హాస్యభరితంగా చేస్తానని చెప్పినట్లు నాకు గుర్తుంది. నేను అప్పుడు కూడా చెప్పాను - 'ఇది మా ఇతిహాసం. మీ మతంతో ఇలా చేసి చూపించండి. పాత్రని మార్చడానికి మీరెవరు? సర్ కట్నే లగేంగే (తలకాయలు తెగి పడగలవ్)' అని చెప్పుకొచ్చాడు.

‘ఓం రౌత్ కి సైఫ్ అలీ ఖాన్ కంటే మెరుగైన నటుడు దొరకలేదా? ఇతను రావణ్ లా కంటే చావకబారు స్మగ్లర్‌లా కనిపిస్తున్నాడు’ అని హేళన చేశాడు. ‘ఆదిపురుష్’ ని చుట్టుముట్టిన వివాదాలు తగ్గుముఖం పట్టేలా లేవు. అభ్యంతరకర డైలాగులు, సన్నివేశాలు, అనుచిత పాత్ర చిత్రణలు చూసి ఎవరూ సంతృప్తి చెందినట్టు కనిపించడం లేదు. నేపాల్లోని ఖాట్మండు, పోఖారా మెట్రోపాలిటన్ సిటీ తర్వాత ముంబాయిలోనూ అనేక చోట్ల సినిమా ప్రదర్శనని నిషేధించారు. మధ్యప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సోకాల్డ్ రచయిత, అభినవ వాల్మీకి మనోజ్ ముంతసిర్ శుక్లా అలవాటుగా నోరు పారేసుకోవడంతో, క్షత్రియ కర్ణి సేన నుంచి మరణదండన బెదిరింపులు వచ్చాయి.

ఈ కోలాహలం మధ్య, దేవుళ్ళని అపహాస్యం చేసే సినిమాకి ఎలాంటి అభ్యంతరం లేకుండా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సిబి ఎఫ్ సి) నుంచి క్లియరెన్స్ ఎలా వచ్చిందనేది పెద్ద ప్రశ్న. దీనిపై సెన్సార్ బోర్డు మాజీ ఛైర్మన్ పహ్లాజ్ నిహలానీ స్పందించారు. కమిటీలో విద్యావంతులు లేరనీ, పార్టీ కార్యకర్తలతో, తోచిన అధికారులతో కమిటీని నింపేశారనీ, వీళ్ళు ఎలాటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా క్లియరెన్స్ ఇచ్చేస్తారనీ అన్నారు. సరైన సిస్టమ్ లేకుంటే ‘ఆదిపురుష్’ లాంటి సినిమా సర్టిఫికేట్ పొందడం ఖాయమని అన్నారు.

సమస్య కేవలం ఆ ఐదు లైన్‌ల డైలాగుతో మాత్రమే కాదనీ, కాస్ట్యూమ్స్ గురించి ఏం చేస్తారని ముఖేష్ ఖన్నా ప్రశ్న. లేదా మహమ్మద్ ఖిల్జీగా చూపించిన రావణుడి విషయంలో, కార్టూన్ లా చూపించిన హనుమంతుడి విషయంలో ఏం చేస్తారని, సెన్సార్ బోర్డుకైనా మన మతం గురించి జ్ఞానం లేదా అని ఖన్నా దాడి.

రామానంద్ సాగర్ నిర్మించిన ప్రఖ్యాత ‘రామాయణ్’ టీవీ సీరియల్లో రాముడి పాత్రని అద్వితీయంగా పోషించిన అరుణ్ గోవిల్ కూడా విమర్శల్ని ఎక్కుపెట్టాడు.

‘ఆదిపురుష్’ నిర్మాతలు టీజర్ కి, ట్రైలర్‌ కి భారీ ఎదురుదెబ్బలు తగిలిన తర్వాత సినిమా బ్యాక్‌ఫైర్ అవుతుందని గ్రహించి వుంటారని, అందుకే ప్రజల దృష్టిని ఆకర్షించడానికి బిజెపి రాష్ట్రాలకి చెందిన ముఖ్యమంత్రుల్ని కలవడం, ‘ఆదిపురుష్’ ప్రతి ప్రదర్శనలో హనుమంతుడికి ఒక సీటు రిజర్వ్ చేయడం వంటి ప్రయోగాలు చేశారనీ, మేకర్స్ పెద్దగా కాన్ఫిడెంట్ గా లేరనీ, ఏదో తప్పు జరగబోతోందని వారికి తెలుసనీ విమర్శించాడు.

ఐతే ఇంత యాక్షన్ జరుగుతున్నా రెబల్ స్టార్ ప్రభాస్ మిస్ అవడం ఎవరి దృష్టికీ రావడం లేదు. వారం రోజులుగా ఇన్ని వివాదాల మధ్య హీరో ప్రభాస్ ని ఎవరూ గుర్తు చేసుకోవడం లేదు. నిన్నటి వరకూ సెన్సార్ బోర్డు కూడా గుర్తుకు రాలేదు. ఏ మీడియా మైకులు పట్టుకుని ప్రభాస్ దగ్గరికి పరుగెత్తలేదు. ప్రభాస్ ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో వార్తలు కూడా లేవు. ‘ఆదిపురుష్’ సోలో హీరోగా/విలన్ గా మహర్షి మనోజ్ ముంతసిర్ శుక్లా మాత్రమే వివాదాలు గెలుక్కుంటూ మీడియా స్టార్ అయ్యాడు.

ఇలా వుండగా, ఇక నిర్మాతలు కొత్త పథకంతో ముందుకు వచ్చారు. టికెట్ ధరని తగ్గించారు. ఇప్పటి వరకు టిక్కెట్టు ధర కనీసం రూ.250 వుంది. లగ్జరీ థియేటర్లలో, రిక్లైనర్ సీట్లలో రూ. 1000 కి మించి కూడా వసూలు చేశారు. ఇప్పుడు త్రీడీలో ‘ఆదిపురుష్’ చూడాలంటే రూ.150 మాత్రమే టికెట్టు ధర అని ప్రత్యేకంగా పోస్టరు విడుదల చేశారు. ఈ భారీ ఆఫర్ జూన్ 22, 23 తేదీల్లో మాత్రమే అందుబాటులో వుంటుంది.


అయితే ఈ టికెట్ రేట్ల త‌గ్గింపు తెలుగు రాష్ట్రాల్లో, కేర‌ళ‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల్లో వుండదని ప్రకటించారు. నెటిజన్లు మాత్రం టికెట్ ధర త‌గ్గింపుపై తీవ్రంగా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈ సినిమాకి రూ. 15 కూడా ఖ‌ర్చు చేయ‌డం దండగ అంటూ, రూ. 150 కాదు క‌దా ఉచితంగా చూడ‌మ‌న్నా ఈ సినిమాని ఎవరూ చూడ‌రంటూ కామెంట్లు చేస్తున్నారు. ఓటీటీలో వచ్చినా కూడా చూడవద్దని విజ్ఞప్తి చేశారు.

ఆ మధ్య తెలుగు సినిమా తీసిన ఒక దర్శకుడు, ఈ సినిమా మొదటిసారి చూస్తే అర్ధం గాదనీ, రెండోసారి చూడాలీ అని అనడంలో అర్ధముందని ఇప్పుడన్పిస్తోంది. ఎందుకంటే రోజువారీ ఇంత అల్లరై కలెక్షన్లు పతనమైన ‘ఆదిపురుష్’ మీద ఇంకా ఆశలు పెట్టుకుని, టికెట్టు ధర తగ్గిస్తే ప్రేక్షకులు కనుకరిస్తారని అనుకోవడంలో, ఏ మాత్రం అర్ధం కన్పించడం లేదు!

ఇప్పుడు అందరు భారతీయులు చూస్తారు, కుటుంబాలకు ఆహ్వానం- అని పోస్టర్ మీద పిలుపునిచ్చారు.

First Published:  22 Jun 2023 7:22 AM GMT
Next Story