Telugu Global
Cinema & Entertainment

పానిండియా - బాలీవుడ్ హోరాహోరీ మొదలు!

జులై 2023- జనవరి 2024 మధ్య 7 నెలల కాలంలో బాలీవుడ్ బిగ్ సినిమాలు- సౌత్ నుంచి పానిండియా భారీ సినిమాలూ హోరాహోరీ పోరు జరిపే పరిస్థితి కనబడుతోంది.

పానిండియా - బాలీవుడ్ హోరాహోరీ మొదలు!
X

పానిండియా - బాలీవుడ్ హోరాహోరీ మొదలు!

జులై 2023- జనవరి 2024 మధ్య 7 నెలల కాలంలో బాలీవుడ్ బిగ్ సినిమాలు- సౌత్ నుంచి పానిండియా భారీ సినిమాలూ హోరాహోరీ పోరు జరిపే పరిస్థితి కనబడుతోంది. రెండు రంగాల నుంచీ 19 బిగ్ స్టార్స్ సినిమాలు విడుదల కానున్నాయి. బాలీవుడ్ నుంచి జూన్ వరకూ ఆరునెలల కాలంలో విడుదలైన స్టార్ సినిమాలు నాలుగు కాగా, ఒకటే హిట్టయింది. షారూఖ్ ఖాన్ ‘పఠాన్’, అజయ్ దేవగణ్ ‘భోలా’, సల్మాన్ ఖాన్ ‘కిసీకా భాయి, కిసీకీ జాన్’, ప్రభాస్ ‘ఆదిపురుష్’ లలో ‘పఠాన్’ ఒక్కటే హిట్టయింది. ఇక రానున్న జనవరి వరకూ 7 నెలల కాలంలో బాలీవుడ్ బిగ్గీస్ 11 విడుదలవుతోంటే, సౌత్ పానిండియాలు కూడా 8 విడుదలకి సిద్ధమవుతున్నాయి. దీంతో ఇటీవలి ట్రాక్ రికార్డుని బట్టి బాలీవుడ్ కే ఇది పరీక్షా కాలంగా పరిణమించింది.

రణబీర్ కపూర్- ఆలియా భట్ ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ (జులై 28), అక్షయ్ కుమార్- యామీ గౌతమ్ ‘ఓ మైగాడ్ 2’(ఆగస్టు 11), జాన్ అబ్రహాం ‘తారిఖ్’ (ఆగస్టు 15), అక్షయ్ కుమార్ ‘సురారై పోట్రు’- తమిళ రీమేక్ ( సెప్టెంబర్ 1), షారూఖ్ ఖాన్- నయనతార ‘జవాన్’ (సెప్టెంబర్ 5), అమితాబ్ బచ్చన్ - టైగర్ ష్రాఫ్ ‘గణపత్’ (అక్టోబర్ 5), సల్మాన్ ఖాన్- కత్రినా కైఫ్ ‘టైగర్ 3’ ( నవంబర్ 10), రణబీర్ కపూర్- రశ్మికా మందన్న ‘యానిమల్’ (డిసెంబర్ 1), షారూఖ్ ఖాన్- తాప్సీ పన్నూ ‘డుంకీ’, (డిసెంబర్ 22), జాన్ అబ్రహాం ‘డిప్లొమాట్ (జనవరి 11), హృతిక్ రోషన్- అనిల్ కపూర్ ‘ఫైటర్’ (జనవరి 25)... 11 బాలీవుడ్ సినిమాలు 8 సౌత్ పానిండియాలతో తలపడనున్నాయి.

సౌత్ పానిండియాల వైపు చూస్తే రజనీ కాంత్, కమల హాసన్, ధనుష్, విజయ్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ 7 గురు స్టార్ సినిమాలు 8 విడుదలవుతున్నాయి. వీటి వివరాల్లోకెళ్తే...

1. ‘కెప్టెన్ మిల్లర్’ – ధనుష్ నటించిన ఈ చారిత్రక యాక్షన్ థ్రిల్లర్ అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో సత్యజ్యోతి ఫిలింస్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకుంది. ఇందులో శివరాజ్ కుమార్, సందీప్ కిషన్, ప్రియాంకా అరుళ్ మోహన్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. జులై 28 న విడుదల. బడ్జెట్ 250 కోట్లు.

2. ‘పుష్ప: ది రూల్ ‘ – అల్లు అర్జున్ నటించిన ఈ సీక్వెల్ సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ నిర్మాణం. రశ్మికా మందన్న, ఫాహద్ ఫాజిల్ నటించారు. త్వరలో విడుదల. బడ్జెట్ 400 కోట్లు.

3. ‘సాలార్’ - ప్రభాస్ నటించిన ఈ గ్యాంగ్ స్టర్ యాక్షన్ కి కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ దర్శకుడు. ఇందులో శృతీహాసన్, జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర తారాగణం. ఇది సెప్టెంబర్ 28 న విడుదలవుతోంది. దీని బడ్జెట్ 200 కోట్లు.

4. ‘జైలర్’ -సూపర్ స్టార్ రాజనీకాంత్ నటించిన ఈ యాక్షన్ కామెడీకి నెల్సన్ దర్శకుడు. తమన్నా,రమ్యకృష్ణ, జాకీష్రాఫ్, సునీల్, వసంత్ రవి ఈయతర తారాగణం. ఆగస్టు 10 న విడుదలకి ప్లాన్ చేస్తున్నారు. బడ్జెట్ 200 కోట్లు.

5. ‘ఇండియన్ 2’ - కమల హాసన్ నటించిన ‘భారతీయుడు’ సీక్వెల్ ఇది. ఎన్. శంకర్ దర్శకుడు. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్, ఏజ్ జె సూర్య, సముద్రకని తడిటర్లు తారాగణం. త్వరలో విడుదల. బడ్జెట్ 250 కోట్లు.

6. లియో – విజయ్ నటించిన ఈ మాస్ యాక్షన్ కి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం. ఇందులో త్రిష, సంజయ్ దత్, అర్జున్, గౌతమ్ మీనన్ ఇతర తారాగణం. విడుదల అక్టోబర్ 19. బడ్జెట్ 250 కోట్లు.

7. ‘ప్రాజెక్ట్ K’ – ప్రభాస్ నటిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ దర్శకుడు నాగ్ అశ్విన్. ఇందులో అమితాబ్ బచ్చన్, కమలా హాసన్, దీపికా పడుకొనే, దిశా పటానీ నటించారు. ఇది 2024 జనవరిలో విడుదలవుతుంది. దీని బడ్జెట్ 600 కోట్లు.

8. ‘గేమ్ ఛేంజర్’- రామ్ చరణ్ నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ కి ఎన్. శంకర్ దర్శకుడు. కీయారా అద్వానీ, అంజలి, నాజర్ తడిటర్లు ఇతర తారాగణం. త్వరలో విడుదల. బడ్జెట్ 170 కోట్లు.

ఈ 8 పానిండియా సినిమాల మొత్తం బడ్జెట్ రూ. 2,320 కోట్లు. వచ్చే 7 నెలల కాలంలో పానిండియా థియేటర్ ప్రేక్షకులు, ఓటీటీలు ఈ భారాన్ని మోయాల్సి వుంటుంది. ఇదిగాక 11 బాలీవుడ్ సినిమాల భారం అదనం. ఇలా పానిండియా- బాలీవుడ్ బాక్సాఫీసు దగ్గర తమ వాటా కోసం జరిపే పోరాటంలో ప్రేక్షకులే నిర్ణేతలు.

First Published:  5 July 2023 12:27 PM GMT
Next Story