Telugu Global
Cinema & Entertainment

సమూహాల సెన్సారింగ్ కంటే సెల్ఫ్ సెన్సారింగే మేలు!

ఇప్పటికే రాజకీయ లేదా మతపరమైన కంటెంట్ పట్ల ఆచి తూచి వ్యవహరిస్తున్న ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు ఇప్పుడు సెన్సార్ బోర్డు అనుమతి పరిధిలో కొచ్చిన తర్వాత పెద్ద సంకటంలో పడ్డాయి.

సమూహాల సెన్సారింగ్ కంటే సెల్ఫ్ సెన్సారింగే మేలు!
X

ఇప్పటికే రాజకీయ లేదా మతపరమైన కంటెంట్ పట్ల ఆచి తూచి వ్యవహరిస్తున్న ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు ఇప్పుడు సెన్సార్ బోర్డు అనుమతి పరిధిలో కొచ్చిన తర్వాత పెద్ద సంకటంలో పడ్డాయి. ఇప్పటి వరకు ప్రధాన స్రవంతి థియేట్రికల్ సినిమాలు సురక్షితమైన వస్తువు అని భావిస్తూ వచ్చారు. అలా సెన్సార్ సర్టిఫికేట్ పొందిన ఇవి ఇప్పటికే ఎక్కువ మంది ప్రేక్షకులకి ఓటీటీల ద్వారా అందుబాటులో కొచ్చాయి. అయితే మత సమూహాల నుంచి ఎదురుదెబ్బ తగిలిన తర్వాత నెట్‌ఫ్లిక్స్ లో విడుదలైన ఇటీవలి తమిళ సినిమా ‘అన్నపూరానీ - ది గాడెస్ ఆఫ్ ఫుడ్‌’ ని స్ట్రీమింగ్ నుంచి తీసే వేసిన విషయం తెలిసిందే. ఈ తొలగింపు ఓటీటీలకి తీవ్ర హెచ్చరికలా వెళ్ళింది. ‘అన్నపూరానీ’ ఉదంతంతో కంటెంట్ సృష్టికర్తలు, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు ఇప్పుడు ఓటీటీ కంటెంట్ కోసం ప్రత్యేక ధృవీకరణతో కూడిన సెన్సార్‌షిప్ ప్రక్రియ గురించి భయపడుతున్నాయి, వీటి సంకేతాలు ముసాయిదా బిల్లులోని భాగాలలో ఇప్పటికే వున్నాయి.

నయనతార నటించిన ‘అన్నపూరానీ’ సెన్సార్ బోర్డు అనుమతి పొంది డిసెంబర్‌లో విడుదలైంది. ఇందులో చూపించిన బ్రాహ్మణ స్త్రీ చుట్టూ కేంద్రీకృతమైన కంటెంట్ పట్ల మత సంఘాల సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో, దీన్ని నిర్మించిన జీ స్టూడియోస్ అభ్యర్థన మేరకు నెట్ ఫ్లిక్స్ నుంచి తొలగించారు.

మాంసం వండుకోవడం, తినడం సదరు స్త్రీ పాత్ర మత విశ్వాసాలకి వ్యతిరేకంగా వున్నాయని, పైగా బిర్యానీ చేయడానికి ముందు నటుడు నమాజ్ చేస్తున్న దృశ్యం సహా కొన్ని సన్నివేశాలు మతపరమైన మనోభావాల్ని దెబ్బతీసేలా వున్నాయనీ ఆరోపణలు వచ్చాయి.

స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు రాజకీయాలు లేదా మతాలకి సంబంధించిన కంటెంట్ తో ప్రయోగాలు చేయడం ఇదివరకే మానేశాయి. ఇలాంటి సంఘటనలు చాలా సంవత్సరాలుగా టెలివిజన్‌ రంగంలో వున్నాయి. ఇవి సహజంగానే ఓటీటీలకూ ప్రాకాయి. ఇంకా పూర్వం సినిమా రంగానికీ ప్రాకాయి. హిందీలో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ‘పద్మావత్’ విషయంలో నైతే సెట్స్ పైనే దాడి చేసి తగులబెట్టారు.

అయితే ఇప్పుడు ఓటీటీ లది చాలా గమ్మత్తయిన పరిస్థితి. ఎందుకంటే సెన్సార్ సర్టిఫికేట్ ఒక రక్షక కవచంలా పనిచేస్తుంది కాబట్టి, అవి థియేటర్లలలో కూడా ఆడతాయి కాబట్టి, సెన్సారైన సినిమాల్ని ఓటీటీలు నిర్భయంగా స్ట్రీమింగ్ కి తీసుకుంటాయి. తీసుకున్నాక రాజకీయ సమూహాలు, లేదా మత సమూహాలు దాడికి దిగితే తమ తప్పు లేకపోయినా సినిమాని ఎత్తేయక తప్పడం లేదు. ఈ రగడలో సెన్సార్ బోర్డూ సైలెంట్ గా వుంటుంది, నిర్మాతా కోర్టు కెళ్ళడు.

ముసాయిదా ప్రసార బిల్లు ద్వారా ప్రతిపాదించిన ప్రీ-సర్టిఫికేషన్ కమిటీ ఓటీటీలకు కళ్ళెం వేసే ఉద్దేశంతో వున్నా, అది సినిమాలకే కాకుండా ఇతర కంటెంట్- అంటే వెబ్ సిరీస్, ఓటీటీలు నిర్మించే సినిమాలు, షోలూ మొదలైన వాటి సృజనాత్మక వ్యక్తీకరణని కూడా అరికట్టే ప్రమాదముందని భయపడుతున్నారు. ఈ బిల్లు ఓటీటీలు సాంప్రదాయ ప్రసార నిబంధనలకి అనుగుణంగా వుండాలని నిర్దేశిస్తోంది. అయితే సాంప్రదాయ ప్రసార నిబంధనలకి అనుగుణంగానే సెన్సార్ బోర్డు సినిమాల్ని అనుమతిస్తున్నా, గుంపులు మా మీద ఎందుకు దాడి చేస్తున్నాయని కూడా ప్రశ్నిస్తున్నారు.

గతంలో తాండవ్, లీలా, ఆశ్రమం, సేక్రేడ్ గేమ్స్ వంటి ఓటీటీ ఒరిజినల్సుతో అయిన చేదు అనుభవాలని గుర్తు చేస్తున్నారు. ఓటీటీ కంటెంట్ పై సెన్సార్ విధిస్తే చందాదారులు అదృశ్యమైపోతారని హెచ్చరిస్తున్నారు. ‘అన్నపూరానీ’ సినిమా విషయంలో పుండు మీద కారం జల్లినట్టయ్యింది. అసలే తమిళనాడులో సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన విమర్శలతో అట్టుడికిన వర్గాలకి, తమిళం నుంచే ‘అన్నపూరానీ’ లాంటి వారి దృష్టిలో మతవ్యతిరేక సినిమా రావడం వివాదాన్ని మరింతగా రగిల్చింది. సినిమా మీద మరిన్ని కేసులు పడ్డాయి. ఇలాటివి వ్యాపారానికి క్షేమం కాదు గనుక ఇకపై ఓటీటీలు రాజకీయ, మత సంబంధ కంటెంట్ కి నో చెప్పేయాలని నిర్ణయం తీసుకున్నాయి.

అసలు ఈ సినిమా ఇతివృత్తాన్ని హిందూ-ముస్లిం ఐక్యతని ప్రోత్సహించడంతోపాటు, వంటా వార్పూ సాంప్రదాయాల్ని, మనస్తత్వాలనీ ప్రశ్నించే ప్రయత్నంగా చూడాలని మేధావులు విశ్లేషిస్తున్నారు. కథలో మాస్టర్ షెఫ్ పోటీ, దాంతో శాఖాహారియైన ఒక హిందూ స్త్రీ లోనైన గందరగోళమూ వున్నాయని, ఇష్టానికి వ్యతిరేకంగా ఆమె మాంసాహార వంటకం వండాల్సిన ఇబ్బందిలో పడిందని, ఒక ముస్లిం పాత్ర ఆమెని సాంప్రదాయం, మతం సంకెళ్ళు తెంచుకుని, శాఖాహారాన్ని విడిచిపెట్టమని ఒప్పిస్తాడనీ, ఫలితంగా ఆమె పోటీలో గెలుపొందుతుందనీ, శాఖాహారులకి ఈ కథాంశం అసహ్యంగా అనిపించవచ్చనీ, కానీ వ్యక్తిగత నీతి సినిమాలపై నా అభిరుచికి అడ్డు కారాదనీ శాఖాహారియైన ఒక సీనియర్ పాత్రికేయురాలు అభిప్రాయపడింది.

అయితే సమూహాల్ని గెలవడం మేధావుల తరంగాదు. రాజకీయ, మత, నైతిక పోలీసింగ్ పెరిగిపోయినప్పుడు వ్యాపారులు కూడా వెనక్కి తగ్గుతారు. వినియోగదారుల మనోభావాలకి పరీక్ష పెట్టలేరు. అంతిమ సెన్సారింగ్ సమూహాలు చేస్తున్నప్పుడు సృజనాత్మక స్వేచ్ఛ పేరుతో హక్కుల్ని కాపాడుకోలేరు. ఇప్పటికే ‘బోల్డ్’ కంటెంట్ పేరుతో విశృంఖల సెక్సు, హింస, అసభ్య పదజాలం వగైరాల్ని బిజినెస్ కి ఎరగా వేసిన ఓటీటీలు ఇకపై ఇండియాలోనే కాదు, విదేశాల్లోనూ ఇలాటి పోకడలతో కూడిన ఇండియన్ కంటెంట్ ని ప్రసారం చేసే పరిస్థితి లేదు.

First Published:  31 Jan 2024 9:27 AM GMT
Next Story