Telugu Global
Cinema & Entertainment

టాలీవుడ్ లో ఓటీటీల ప్రకంపనలు!

Netflix Telugu Movies: ఈ రోజు తెలుగు ఓటీటీ సెగ్మెంట్ లో ఓ కొత్త పరిణామం చోటు చేసుకుంది. ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ ఆరు పాత తెలుగు సినిమాల్ని ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ చేస్తోంది.

Netflix Telugu Movies: టాలీవుడ్ లో ఓటీటీల ప్రకంపనలు!
X

Netflix Telugu Movies: ఈ రోజు తెలుగు ఓటీటీ సెగ్మెంట్ లో ఓ కొత్త పరిణామం చోటు చేసుకుంది. ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ ఆరు పాత తెలుగు సినిమాల్ని ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ చేస్తోంది. ఎందుకిలా? ఎందుకంటే తగ్గిపోతున్న తెలుగు ప్రేక్షకులని తన వైపు ఆకర్షింపజేయడానికి. తెలుగు ప్రేక్షకులు ఎందుకు ఆకర్షితులు కావడం లేదు? ఎందుకంటే మసాలా సినిమాలు చూడలేక. సారం లేని అవే రొటీన్ హీరోయిజాల సినిమాలంటే విసుగెత్తి. ఇందుకేం చేసింది నెట్ ఫ్లిక్స్? తెలుగు స్టార్ సినిమాల నాన్ థియేట్రికల్ రైట్స్ భారీ కోత విధించి నిర్మాతల్ని షాకులో పెట్టి, స్టార్స్ నటించిన పాత తెలుగు బ్లాక్ బస్టర్స్ వైపు దృష్టి మళ్ళించింది. ఫలితంగా, పవన్ కళ్యాణ్ ‘ఖుషీ’, బాలకృష్ణ ‘బంగారు బుల్లోడు’, ప్రభాస్ ‘బుజ్జిగాడు’, శర్వానంద్ ‘అమ్మ చెప్పింది’, చంద్రశేఖర్ యేలేటి ‘ఐతే’, మారుతి ‘ఈ రోజుల్లో’...ఈ ఆరింటిని ఈ రోజు నుంచి, అంటే నవంబర్ 30 నుంచి స్ట్రీమింగ్ చేయడం మొదలెట్టింది.

ఈ పరిణామం నెట్ ఫ్లిక్స్ కఠిన వైఖరిని స్పష్టం చేస్తోంది. రూ. 20, 30 కోట్లు ధారబోసి స్టార్ సినిమాల్ని స్ట్రీమింగ్ చేస్తూంటే వాటికి సరైన వ్యూస్ రావడం లేదు. మరొక ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ పరిస్థితి కూడా ఇదే. దీంతో కొంత కాలం క్రితం ఈ రెండు దిగ్గజాలు తెలుగు సినిమాల కొనుగోళ్ళకి వార్షిక బడ్జెట్ ని రూ. 200-300 లకి కుదించడంతో నిర్మాతలు ఆందోళన చెందారు. ఇప్పుడు ఈ కుదించిన వార్షిక బడ్జెట్ లో కూడా సినిమాలకి రూ. 20, 30 కోట్లు ఇచ్చే అవకాశం లేదని చెప్పడంతో టాలీవుడ్ లో ప్రకంపనలు మొదలయ్యాయి.

ఇప్పుడు ఓటీటీ రైట్స్ మీద ఆశలు పెట్టుకుని ప్రారంభించిన సినిమాలు సంక్షోభంలో పడ్డాయి. నిర్మాతలు హీరోల్ని ప్రాధేయపడసాగారు. రూ. 5 కోట్లు తీసుకునే హీరోలు కూడా ఓటీటీ రైట్స్ పలుకుతున్న మొత్తాల్ని చూసి పారితోషికాల్ని రూ. 10-15 కోట్లకి పెంచేశారు. ఇప్పుడు తగ్గేది లేదు పొమ్మంటున్నారు. ఓటీటీలు 50 శాతం తగ్గించేయడంతో, మరో వైపు హీరోలు రెండు మూడు రెట్లు పారితోషికాలు పెంచడంతో, దిక్కుతోచని స్థితిలో పడ్డారు నిర్మాతలు.

బాలీవుడ్ ని ఆత్మరక్షణలో పడేసేలా ‘బాహుబలి’, ‘పుష్ప’, ‘ఆర్ ఆర్ ఆర్’ వంటి బ్లాక్ బస్టర్స్ తో పానిండియా మార్కెట్ ని ప్రముఖంగా కైవసం చేసుకున్న టాలీవుడ్ ఇవాళ ఓటీటీ రైట్స్ కోసం స్ట్రగుల్ చేస్తోంది. కారణం పక్క రాష్ట్రాల్లో కూడా ఆడని అవే మసాలా సినిమాల్ని ఉత్పత్తి చేయడం. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, కస్టడీ, స్పై, ఏజెంట్, ఖుషీ, భోళా శంకర్ వంటి సినిమాలెన్నిటికో ఓటీటీ వ్యూస్ గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో రైట్స్ మీద ఆంక్షలు విధించాయి ఓటీటీ దిగ్గజాలు. అటు హీరోలు రాజీ పడక, ఇటు ఓటీటీలు దిగిరాక పోవడంతో చాలా సినిమాలు రద్దయ్యాయని ఒక దర్శకుడు ధృవీకరించారు. పారితోషికాల విషయంలో రాజీ పడని హీరోలు సొంతంగా సినిమాలు నిర్మించుకోవాలని ఆలోచిస్తున్నట్టు కూడా దర్శకుడు చెప్పారు.

అటు హిందీలో ఇంకో పరిస్థితి తలెత్తింది. ఓటీటీలు కంటెంట్‌పై తక్కువ ఖర్చు చేయడంతో, స్ట్రీమింగ్ సేవల కోసం స్వతంత్ర వెబ్ సిరీస్‌ చేపట్టిన చిన్న నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు. ఒక్కొక్కటి రూ. 7-8 కోట్ల బడ్జెట్స్ తో 30 - 40 చిన్న తరహా ప్రొడక్షన్‌ల పరిస్థితి అయోమయంగా తయారైంది.

ఆదిత్య బిర్లా యాజమాన్యంలోని ప్రొడక్షన్ హౌస్ అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ వంటి పెద్ద సంస్థలు మాత్రమే వెబ్ సిరీస్‌ నిర్మించి, వాటిని ఓటీటీలకి పిచ్ చేసే స్థాయిలో వుంటాయని చెబుతున్నారు. పరపతి లేని నిర్మాతలకి ఇది సాధ్యం కాదు. హిందీలో వెబ్ సిరీస్ ఉత్పత్తి చాలావరకు అసంఘటిత వ్యాపారంగా వున్నందున, అనేక మంది పెట్టుబడిదారులు ఫండింగ్ షోలలో మోసపోతున్నారు. నిర్మాతలు పెద్ద ఓటీటీల దగ్గర తమకు సాగక, చిన్న ప్లాట్ ఫారమ్స్ కి తక్కువ ధరలకి అమ్ముకోవాల్సి వస్తోంది. చాలా షోస్ ని నష్టానికి లేదా బ్రేక్ ఈవెన్‌ కి అమ్మేసుకుంటున్నారు.

ఇటీవల ఒక సర్వేలో ఓటీటీల ధాటికి టీవీ ఛానెల్స్ రేటింగ్స్ పడిపోతున్నాయని వెల్లడైంది. ఇంకో అంతర్జాతీయ సర్వేలో యూట్యూబ్ దెబ్బకి ఓటీటీలు ఢామ్మంటున్నాయని తేలింది. వారానికి 30 సినిమాలు,40 షోలు స్ట్రీమింగ్ చేసి ప్రేక్షకులమీద పడేస్తూంటే ఏవి చూడాలో అర్ధంగాక, తట్టుకోలేక, యూట్యూబ్ వైపు వెళ్ళి పోతున్నారని సర్వే చెప్పింది. మొత్తం ప్రపంచ ఆన్ లైన్ వ్యూయింగ్ లో 80 శాతం వాటా యూట్యూబ్ దేనని తేల్చింది సర్వే.

టాలీవుడ్ కి ఓటీటీలతో ప్రమాద ఘంటికలు, ఓటీటీలకి యూట్యూబ్ తో వార్నింగ్ బెల్స్. తెలుగు ప్రేక్షకులకి పాత బ్లాక్ బస్టర్స్ తో సత్కాలక్షేపం. కొత్త మసాలా కంటే తెలిసిన పాత మసాలా బెస్ట్. నెట్ ఫ్లిక్స్ లో ఈ రోజు నుంచి ఆరు పాత మసాలాలు ప్రసారం. ఒక వారం రోజులు ప్రేక్షకులు సురక్షితంగా కాలం గడపొచ్చు. దారితప్పి 2023 లోకి వచ్చిన కొత్త మసాలా ‘ఆది కేశవ’ ఇంకోసారి దారితప్పి త్వరలో ఓటీటీలో వస్తున్నట్టు ఒక హెచ్చరిక!

First Published:  30 Nov 2023 10:53 AM GMT
Next Story