Telugu Global
Cinema & Entertainment

OTT Movies: గంటలో ఓటీటీ కంటెంట్ పైరసీ!

OTT Movies: ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ని పైరసీ కబళిస్తోంది. కేవలం చందాదారుల మీద ఆధారపడ్డ ఓటీటీల ఆదాయానికి గండి కొడుతోంది. ఓటీటీల్లో విడుదలైన కంటెంట్ గంట వ్యవధిలో టెలిగ్రామ్, టోరెంట్ సైట్లు, ఓటీటీల్ని అనుకరించే రోగ్ వెబ్‌సైట్‌లు వంటి మాధ్యమాల్లో లీక్ అయి భారీగా నష్టపరుస్తోంది.

OTT Movies: గంటలో ఓటీటీ కంటెంట్ పైరసీ!
X

ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ని పైరసీ కబళిస్తోంది. కేవలం చందాదారుల మీద ఆధారపడ్డ ఓటీటీల ఆదాయానికి గండి కొడుతోంది. ఓటీటీల్లో విడుదలైన కంటెంట్ గంట వ్యవధిలో టెలిగ్రామ్, టోరెంట్ సైట్లు, ఓటీటీల్ని అనుకరించే రోగ్ వెబ్‌సైట్‌లు వంటి మాధ్యమాల్లో లీక్ అయి భారీగా నష్టపరుస్తోంది. పైరసీ కారణంగా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ మొత్తం రాబడిలో 25-30% నష్టపోతున్నాయని తెలుస్తోంది. ఓటీటీల్లో విడుదలయ్యే వివిధ షోలు, వెబ్ సిరీస్ సహా సినిమాలూ పైరసీకి గురై ఫ్రీగా ప్రేక్షకుల చేతిలో కొచ్చేస్తున్నాయి. చందాదారులు చందా కట్టడం మానేస్తున్నారు.

వివిధ సినిమాలతో బాటు స్కామ్ 1992 , రాకెట్ బాయ్స్, ఆశ్రమ్ వంటి షోలెన్నో ఓటీటీల్లో విడుదలైన కొన్ని గంటల్లోనే టెలిగ్రామ్‌లో సర్క్యులేట్ అవుతున్నట్టు గుర్తించారు. తెలుగు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న బాలకృష్ణ 'అన్ స్టాపబుల్' షో ది కూడా ఇదే పరిస్థితి. ఓటీటీ కంపెనీలు కంటెంట్‌ ని ఎన్‌క్రిప్ట్ చేయడానికి, వాటర్‌మార్క్ చేయడానికీ చర్యలు తీసుకుంటున్నప్పటికీ, డిజిటల్ మాధ్యమం వృద్ధితో పైరసీ సవాళ్ళు మరింత తీవ్రమై పోతున్నాయి.

దేశంలో సినిమాలు, టీవీ కార్యక్రమాలు పైరసీ కారణంగా గత సంవత్సరంలో 2.3 బిలియన్ డాలర్ల ఆదాయ నష్టం వాటిల్లిందని డేటా రీసెర్చ్- అనలిటిక్స్ సంస్థ పేర్కొంది.

ఓటీటీల్లో విడుదలైన గంట వ్యవధిలోనే ప్రేక్షకులు చట్టవిరుద్ధమైన మీడియాల్లో ఎక్కువగా చూసేస్తున్నారు. అన్ని ఓటీటీ సేవలు వాటి ఆదాయ వనరుగా సబ్‌స్క్రిప్షన్‌లతో మనుగడ సాగిస్తున్నాయి. అయితే పైరసీ పెరుగుదలతో ఆదాయాలు నేరుగా దెబ్బతింటున్నాయి. చందాదారులు చందా కడుతున్నప్పటికీ పైరసీలు చూస్తున్నప్పుడు, ఏ తరహా కంటెంట్ బాగా పోతోందీ, ఏ తరహా కంటెంట్ ఆదరణ తగ్గిందీ డేటా సేకరించడం ఓటీటీ కంపెనీలకి కష్ట మై పోతోంది. దీంతో ఏ కంటెంట్ ని కొనుగోలు చేయాలి, లేదా దేన్ని ఉత్పత్తి చేయాలన్నది అగమ్యగోచరంగా మారుతోంది.

2020, 2021 లలో ఓటీటీ బూమ్ మొదలైనప్పటినుంచే పైరసీ పెరుగుతోంది. అయితే 2022లో ప్రజలు పైరసీ వెబ్‌సైట్‌ల గురించి మరింత అవగాహన పెంచుకోవడంతో విపరీతమైన పెరుగుదల జరిగింది. ఒరిజినల్ ప్లాట్‌ఫామ్ కంటెంట్‌ చూడకపోతే, మొత్తం ఆదాయం పోతుంది. ఒక షోని ఒకసారి వీక్షించిన తర్వాత, దానికి తక్కువ మానిటైజేషన్ అవకాశం వుంటుంది. ఎందుకంటే వినియోగదారులు ప్లాట్‌ఫామ్స్ కాకుండా షోల వెంటపడతారు.

పెద్ద పట్టణాల జనాభా పైరేటెడ్ కంటెంట్‌ ని వినియోగించక పోవచ్చు. ఈ సమస్య రెండవ, మూడవ శ్రేణి పట్టణాల్లో చాలా బలంగా వుంది. దీని ప్రభావం రూరల్ కంటెంట్ కోసం ప్రారంభమయిన వెర్నాక్యులర్ ఓటీటీ సంస్థల మీద కూడా పడుతోంది. ఇవి ఎదుగుదలకి నోచుకోలేకపోతున్నాయి.

మాస్టర్ కాపీని ఫైనల్ ఎడిట్ పూర్తి చేస్తున్నప్పటి నుంచి, ఓటీటీ సర్వర్‌లలో అప్‌లోడ్ చేసే వరకూ ఎప్పుడైనా లీక్ అయిపోతోంది. అలా పైరేటెడ్ కంటెంట్ విడుదల తేదీకి ముందే అందుబాటులోకి రావచ్చు. ఓటీటీ సంస్థలు వాటర్‌మార్కింగ్, డిజిటల్ రైట్స్ మేనేజ్‌మెంట్, సెక్యూర్ హోస్టింగ్, ఎన్‌క్రిప్షన్ మొదలైన వాటికోసం టెక్నాలజీని ఉపయోగించుకోగలవు. విడుదలకి తుది అప్‌లోడ్ చేయడానికి ముందు కంటెంట్ ఎక్కడికీ పోతోందీ అదుపు చేయగలవు. ఇలా కంటెంట్ పంపిణీకి మెరుగైన విండోస్ వున్నప్పటికీ ఆన్‌లైన్ పైరసీ, కంటెంట్ చోరీ దేశంలో ఆందోళనకర స్థాయిలోనే వుంది.

ముఖ్యంగా టెలిగ్రామ్ యాప్ లో తక్కువ సమయంలో ఎక్కువ ప్రజాదరణ పొందడంలో విజయవంతమవుతోంది పైరసీ. ఓటీటీల్లో అందుబాటులో వున్న తాజా సినిమాలన్నీ ఉచితంగా టెలిగ్రామ్ లో చూపించేస్తోంది పైరసీ. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఏదైనా సరే, టెలిగ్రామ్ లో కుక్కలు చింపిన విస్తరి కాని ఓటీటీ ప్లాట్ ఫామ్ లేదు. ప్రేక్షకులు యథేచ్ఛగా వీటిలోని కంటెంట్ ని డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. ఇది చట్టరీత్యా నేరమని తెలిసినా, దొరికిపోయే ప్రమాదమున్నా డోంట్ కేర్ అన్నట్టు వుంటున్నారు. ప్రేక్షకుల్ని పట్టుకుని శిక్షలు వేసే యంత్రాంగం గానీ, తీరిక గానీ లేవు. అలా గనుక చేస్తే జైళ్ళు చాలవు.

సినిమా నిర్మాతలేం చేశారు? పైరసీతో పోరాడి పోరాడీ దాని ఖర్మానికి వదిలేశారు. థియేటర్లలో వందల కోట్లు కలెక్షన్లు బాగానే వస్తున్నాయి. ఆపైన ఓటీటీ హక్కులు. ఓటీటీలకే పైరసీతో గండం. దీన్ని ఎదుర్కొనే మార్గం ప్రస్తుతానికైతే లేదు. వెయ్యి రూపాయలు చందాకట్టి సంవత్సరం పొడవునా అపారమైన కంటెంట్ ని ఓటీటీల్లో చూసే చందాదారులే ఓటీటీలతో విశ్వాసంగా వుండాలి. ఇంకో నల్గురిని చేర్పించాలి.

First Published:  1 Feb 2023 9:09 AM GMT
Next Story