Telugu Global
Cinema & Entertainment

OTT: చిన్నసినిమాలకి నో అంటున్న ఓటీటీ?

ఓటీటీల్లో ప్రేక్షకులు చిన్న సినిమాల్ని చూడక పోతే ఓటీటీ కంపెనీలు ఏం చేస్తాయి? కొత్తలో అంటే లాక్ డౌన్ సమయంలో పోటీలు పడి చిన్న సినిమాల్ని కొన్న ఓటీటీలు, తర్వాత కొనడం మానేసి పే పర్ వ్యూ విధానం ప్రవేశపెట్టారు.

చిన్నసినిమాలకి నో అంటున్న ఓటీటీ?
X

చిన్నసినిమాలకి నో అంటున్న ఓటీటీ? 

తెలుగులో చిన్న సినిమాల నిర్మాణాలు ఇక ఆగిపోతాయా? అవునని కచ్చితంగా చెప్పలేం గానీ పరిస్థితులు చూస్తే అంత ప్రోత్సాహకరంగా లేవు. ఒకటి, చిన్న సినిమాలకి థియేటర్ విడుదల అవకాశాలు సన్నగిల్లడం; రెండు, చిన్న సినిమాల పట్ల ఓటీటీలు ఆసక్తి చూపకపోవడం; మూడు, చిన్న సినిమాలని ప్రేక్షకులే ఆదరించక పోవడం. ఈ మూడు కారణాలు చిన్న సినిమాల భవిష్యత్తుని ప్రశ్నార్ధకం చేస్తున్నాయి. అయితే ఏమిటి? చిన్న సినిమాలు లేకపోతే ప్రపంచం మునిగిపోతుందా? ఎందుకంత ప్రాధాన్యమివ్వాలి? ఎందుకంటే టాలీవుడ్ ఉత్పత్తి చేసే సినిమాల్లో 80 శాతం చిన్న సినిమాలే. వారం వారం థియేటర్లకి ఫీడింగ్ ఇస్తున్నవి చిన్న సినిమాలే. వందలాది ఆర్టిస్టులకీ, టెక్నీషియన్లకీ భృతిని కల్పిస్తున్నది చిన్న సినిమాలే. చిన్న సినిమాలు లేని నాడు నిర్మాణ, ప్రదర్శన రంగాలు రెండూ మూతబడిపోతాయి.

దీనికి కారణం చిన్న సినిమాల్ని ఆదరించని ప్రేక్షకులే అవుతారా? ఓటీటీలే అవుతాయా? ఎందుకని ప్రేక్షకులు ఆదరించడం లేదంటే, చిన్న సినిమాల క్వాలిటీ ప్రధానంగా కనిపిస్తుంది. అయితే అన్ని చిన్న సినిమాలూ అద్భుత క్వాలిటీతో నిర్మించడం అసాధ్యం. వీటి మేకర్స్ అందరూ అపూర్వ క్రియేటివిటీతో వుండే అవకాశం కూడా వుండదు. ఏదో ఒక స్థాయి క్వాలిటీతో తీస్తూంటారు. వీటికి పూర్వం లేని క్వాలిటీ సమస్య ఇప్పుడెందుకొచ్చినట్టు. ప్రేక్షకులు ఇప్పుడు ఉత్తమాభిరుచులకి అప్ గ్రేడ్ అయ్యారా? ఇదేం కాదు. ప్రేక్షకుల అభిరుచులు అలాగే వున్నాయి. ఆ అభిరుచులతోనే రెండేళ్ళ క్రితం వరకూ చిన్న సినిమాలని కూడా చూస్తూ వచ్చారు.

ఈ రెండేళ్ళల్లో ఏం జరిగిందంటే ఓటీటీ విప్లవం ఇంట్లో కూర్చోబెట్టింది. ఇంట్లో కూర్చో బెట్టి ప్రపంచ సినిమాలన్నీ చూపెట్టింది. సెల్ ఫోన్లతో కూడా సినిమాల్ని అరచేతిలో పెట్టింది. ఇంత వెరైటీ ముందు ఇక తెలుగు చిన్న చిన్న సినిమాలు కంటికేం కన్పిస్తాయి. ఇందుకే థియేటర్ కి వెళ్ళకుండా, ఓటీటీలో కూడా చిన్న సినిమాల్ని చూడకుండా, వివిధ దారులు వెతుక్కున్నారు ప్రేక్షకులు.

ఓటీటీల్లో ప్రేక్షకులు చిన్న సినిమాల్ని చూడక పోతే ఓటీటీ కంపెనీలు ఏం చేస్తాయి? కొత్తలో అంటే లాక్ డౌన్ సమయంలో పోటీలు పడి చిన్న సినిమాల్ని కొన్న ఓటీటీలు, తర్వాత కొనడం మానేసి పే పర్ వ్యూ విధానం ప్రవేశపెట్టారు. దీనికి ఆరు రూపాయలు ధర నిర్ణయించి తర్వాత నాల్గు రూపాయలు, ఇప్పుడు రూపాయిన్నర ఇచ్చే స్థితికి వచ్చారు. ఇంకేం చిన్న నిర్మాతలు ఓటీటీల మీద ఆధారపడతారు.

లాక్ డౌన్ సమయంలో భారీ ఎత్తున తెలుగులోకి ప్రవేశించిన అమెజాన్ ఓటీటీ రెండు ఎదురు దెబ్బలతో తెలుగు సినిమాలకి గుడ్ బై చెప్పేసింది. నాని నటించిన మిస్టర్ వి, టక్ జగదీష్ భారీ మొత్తాలకు కొనుగోలు చేసి నష్టపోవడంతో- అంతవరకూ కొనుగోలు చేస్తూ వచ్చిన చిన్న సినిమాల్ని కూడా ఆపేసింది. చాలా తక్కువగా, కాస్త స్టార్ కాస్ట్ వున్న చిన్న సినిమాలు - గుడ్ లక్ సఖి, గమనం, రామ్ అసుర్, రావణ లంక వంటివి మాత్రమే కొనుగోలు చేసింది. ఇక నెట్ ఫ్లిక్స్ చాలా అరుదుగా తెలుగు వైపు చూపు వేస్తోంది.

ఓటీటీలు పెద్ద సినిమాల వైపే మొగ్గు చూపిస్తున్నాయి. డిస్నీ ప్లస్ హాట్ స్టార్, జీ5, సోనీ లివ్ మొదలైనవి చిన్న సినిమాలవైపే చూడడం లేదు. ఆహా ఒక్కటే చిన్న సినిమాలని రెగ్యులర్ గా రిలీజ్ చేస్తున్నా, పే పర్ వ్యూ నిబంధనతో ఇది కూడా చిన్న నిర్మాతల్ని నిరుత్సాహ పరుస్తోంది.

ఇటీవల ఒక తెలుగు ఎన్నారై ఓటీటీ రంగంలోకి ప్రవేశిస్తున్నట్టు వార్త వెలువడింది. హిట్ డాట్ మూవీ పేరుతో ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. నేరుగా విడుదల చేయడానికి థియేటర్లు దొరకని చిన్న బడ్జెట్ సినిమాలకి తన ప్లాట్‌ అనువైనదని ఆయన చెప్పారు. ప్రేక్షకులు సబ్‌స్క్రయిబ్ చేయాల్సిన అవసరం కూడా లేదునీ, నిర్మాతలు కూడా తమ డిజిటల్ హక్కుల్ని విక్రయించాల్సిన అవసరం లేదనీ చెప్పారు.

థియేటర్లో టికెట్ కొన్నట్టే టికెట్ తీసుకుని సినిమాలు చూడవచ్చన్నారు. మొబైల్ లేదా టాబ్లెట్ లేదా ల్యాప్‌టాప్ లేదా టెలివిజన్ లేదా హోమ్ థియేటర్‌లో తమకు నచ్చిన సినిమాల్ని చూడవచ్చనీ చెప్పారు. అయితే నిర్మాతలకి అందిస్తున్న బిజినెస్ మోడల్ ఏమిటో వెల్లడించలేదు. దీని వెబ్ సైట్ చూస్తే ఇంకా సినిమాల్ని స్ట్రీమింగ్ చేయడం లేదు. తెలుగు సహా ప్రపంచ భాషల సినిమాలుంటాయని వెబ్సైట్లో పేర్కొన్నారు. ఎప్పుడు సర్క్యులేషన్ లోకి వస్తుందో సమాచారం లేదు.

చిన్న సినిమాలకి ప్రపంచ సినిమాలతో పోటీ తప్పదు. ప్రేక్షకులు ప్రపంచ సినిమాలవైపే పరుగులు దీస్తున్నప్పుడు చిన్న సినిమాలు స్ట్రగుల్ చేయక తప్పదు. ఎంత మంచి క్వాలిటీతో తీసినా థియేటర్లో రెండు వారాలు ఆడితే తప్ప దృష్టి నాకర్షించవు. ఫేస్బుక్ లో ప్రేక్షకులు రివ్యూలు కూడా రాస్తున్నారు. అయితే అవి ఇతర భాషల చిన్నా చితకా సినిమాల్ని మెచ్చుకుంటూ రాస్తున్నారే తప్ప, తెలుగు సినిమాల గురించి కాదు. ఈ ప్రపంచ భాషల సినిమాల మోజు తీరనంత కాలం తెలుగు చిన్న సినిమాలకి యాతన తప్పదు.

First Published:  5 Dec 2022 6:20 AM GMT
Next Story