Telugu Global
Cinema & Entertainment

ఆస్కార్స్ కి ఉత్తమ డాక్యుమెంటరీగా ‘టు కిల్ ఏ టైగర్’

మన దేశానికి చెందిన నిషా పహుజా దర్శకత్వం వహించిన డాక్యుమెంటరీ ఫీచర్ 'టు కిల్ ఏ టైగర్' 96 వ ఆస్కార్స్ అవార్డ్స్ కి ఉత్తమ డాక్యుమెంటరీగా నామినేట్ అవడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

ఆస్కార్స్ కి ఉత్తమ డాక్యుమెంటరీగా ‘టు కిల్ ఏ టైగర్’
X

మన దేశానికి చెందిన నిషా పహుజా దర్శకత్వం వహించిన డాక్యుమెంటరీ ఫీచర్ 'టు కిల్ ఏ టైగర్' 96 వ ఆస్కార్స్ అవార్డ్స్ కి ఉత్తమ డాక్యుమెంటరీగా నామినేట్ అవడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ డాక్యుమెంటరీ ఫీచర్ గతంలో టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ -2022 లో ఉత్తమ కెనడియన్ ఫీచర్ ఫిలింగా యాంప్లిఫై వాయిస్ అవార్డుని గెలుచుకుంది. ముగ్గురు వ్యక్తులతో సామూహిక అత్యాచారానికి గురైన కుమార్తెకి న్యాయం కోసం తండ్రి రంజిత్ చేసిన పోరాటం చుట్టూ ఈ ఫీచర్ కేంద్రీకృతమై వుంది.

'ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్' విభాగంలో మరో నాలుగు నామినేషన్స్ బోబీ వైన్: ది పీపుల్స్ ప్రెసిడెంట్, ది ఎటర్నల్ మెమరీ, ఫోర్ డాటర్స్ , 20 డేస్ ఇన్ మారిపోల్ లకు దక్కాయి. 2024 లో 96వ ఆస్కార్ వేడుకలు మార్చి 10న లాస్ ఏంజిల్స్ లో ఓవేషన్ హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్‌లో జరగనున్నాయి. జిమ్మీ కిమ్మెల్ వరుసగా రెండో సంవత్సరం ఈ వేడుకని హోస్ట్ చేయబోతున్నాడు. జేమ్స్ క్రిస్టియన్ కిమ్మెల్ ప్రసిద్ధ అమెరికన్ టెలివిజన్ హోస్ట్, హాస్యనటుడు, రచయిత, నిర్మాత. ఇతను మూడు సార్లు ప్రైమ్ టైమ్ ఎమ్మీ అవార్డ్సుని కూడా హోస్ట్ చేశాడు. 2017,2028 లలో కూడా మరో రెండుసార్లు ఆస్కార్ అవార్డ్సుని హోస్ట్ చేశాడు.

'టు కిల్ ఏ టైగర్' ఝార్ఖండ్ గ్యాంగ్‌రేప్ కేసు సంఘటనపై వివరణాత్మక కథనం. ఝార్ఖండ్‌లో 13 ఏళ్ళ బాలికపై సామూహిక అత్యాచారం చుట్టూ వున్న కలతపెట్టే సంఘటనల్ని ఇది హైలైట్ చేస్తుంది. ఈ ఘోర కృత్యంపై దృష్టిని మళ్ళిస్తూ న్యాయం పొందడం కోసం ఆమె తల్లిదండ్రులు ఎదుర్కన్న సవాళ్ళని అన్వేషిస్తుంది. ఈ డాక్యుమెంటరీ అధికారిక వెబ్ సైట్ ప్రకారం, 'టు కిల్ ఏ టైగర్’ అసాధారణ పరిస్థితుల్ని ఎదుర్కొన్న ఒక సాధారణ మనిషి భావోద్వేగ ప్రయాణాన్ని చిత్రిస్తుంది. కూతురి పట్లగల ప్రేమతో గ్రామ ప్రజల ఇష్టాలకు వ్యతిరేకంగా వెళ్ళి, దేశంలో పితృస్వామ్య సంస్కృతికీ, రేప్ కల్చర్ కీ సవాలు విసిరిన తండ్రి పోరాట కథ ఇది.

ఈ డాక్యుమెంటరీ ఫీచర్ గత సంవత్సరం అమెరికాలో థియేటర్లలో విడుదలైంది. ఇండో-కెనడియన్ కవయిత్రి రూపీ కౌర్ దీని గురించి వ్యాఖ్యానిస్తూ, ‘ప్రేమను సినిమా చేయడం అంత సులభం కాదు. ఒక తండ్రి తన కూతురిని రక్షించుకుంటూ ఒక గ్రామాన్ని, దేశాన్ని, బహుశా ప్రపంచాన్నే మార్చాడు’ అని పేర్కొంది.

‘ఈ ఫీచర్ ఆ కుటుంబంలో చాలా బాధాకరమైన క్షణాల రికార్డు. సిగ్గుపడడానికీ, దాచడానికీ ఏమీ లేని అసాధారణ కుటుంబపు అపార ప్రేమని, శక్తినీ కూడా సంగ్రహించింది ఈ ఫీచర్’ అని దర్శకురాలు నిషా పహుజా పేర్కొంది.

2017 ఏప్రెల్ 9న బాలిక తల్లిదండ్రులు ఒక పెళ్ళిలో వున్నారు. ఇంటికి తిరిగి వచ్చి చూస్తే కూతురు లేదు. అర్ధరాత్రి సమయంలో ముగ్గురు గ్రామస్తులు ఆమెని అడవిలోకి లాగి సామూహిక అత్యాచారం చేశారు. నిందితుల్లో ఆమె బంధువు కూడా వున్నాడు. ఈ డాక్యుమెంటరీ కి సంగీతం జొనాథన్ గోల్డ్ స్మిత్, ఛాయాగ్రహణం మృణాల్ దేశాయ్. నిర్మాతలు నిషా పహుజా, డేవిడ్ ఓపెన్ హీమ్, కార్నెలియా ప్రిన్సిపీ, ఆండీ కొహెన్.



First Published:  24 Jan 2024 2:36 PM GMT
Next Story