Telugu Global
Cinema & Entertainment

118 లో ఐదు కన్నడ సినిమాలకే బ్రేక్ ఈవెన్!

పడకపడక పానిండియా ప్రేక్షకుల దృష్టిలో పడ్డ కన్నడ కమర్షియల్ సినిమాలు తిరిగి యథాపూర్వ స్థితి కొచ్చాయి.

118 లో ఐదు కన్నడ సినిమాలకే బ్రేక్ ఈవెన్!
X

పడకపడక పానిండియా ప్రేక్షకుల దృష్టిలో పడ్డ కన్నడ కమర్షియల్ సినిమాలు తిరిగి యథాపూర్వ స్థితి కొచ్చాయి. కన్నడ ఆర్ట్ సినిమాలకయితే దశాబ్దాల ప్రఖ్యాతి వుంది. గిరీష్ కర్నాడ్, జివి అయ్యర్, బివి కారంత్ మొదలైన ఉద్దండ దర్శకులు ఎప్పుడో కన్నడ సినిమాలకి జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టారు. కానీ కమర్షియల్ సినిమాల విషయానికొచ్చేసరికి ప్రశాంత్ నీల్, రిషభ్ శెట్టి ఇద్దరే ఇటీవల కన్నడ సినిమాల్ని పానిండియా మార్కెట్ లో సంచలన విజయాలతో నిలబెట్టారు. వీరికి పూర్వం కన్నడ కమర్షియల్ సినిమాలకి జాతీయ మార్కెట్ వుండేది కాదు. తెలుగులో డబ్బింగ్ అవడం కూడా చాలా చాలా తక్కువ!

దీంతో 2023 ప్రథమార్థంలో కన్నడ సినిమాలు హిట్లు లేక వెలవెల బోయాయి. ఈ ప్రథమార్ధంలో కన్నడ పానిండియా సినిమాలు విడుదల కాలేదు. రెగ్యులర్ సినిమాలే కర్ణాటక రాష్ట్రంలో 118 విడుదలయ్యాయి. ఇది సరిగ్గా ప్రథమార్ధంలో మన తెలుగు సినిమాల సంఖ్యతో సమానం. తెలుగులో 118 లో ఏడే హిట్లయితే, కన్నడలో 118 లో 5 కూడా హిట్ కాలేదు. పెట్టిన పెట్టుబడి రికవరీ అయి బ్రేక్ ఈవెన్ మాత్రమే అయ్యాయి. సక్సెస్ రేటు 2022లో 5-10 శాతంతో పోలిస్తే, 2023 ప్రథమార్ధంలో దాదాపు 4-5 శాతం.

‘క్రాంతి’, ‘కబ్జా’ అనే రెండు ప్రముఖ సినిమాలు ఫ్లాపవడానికి నాణ్యత లేకపోవడమే కారణమని రివ్యూలు చూస్తే తెలుస్తుంది. పేలవమైన కంటెంట్ కి భారీగా గ్రాఫిక్స్ తో అలంకరణ చేస్తే ‘కేజీఎఫ్’ తో పోలిక వచ్చి మట్టి కరిచాయి. ‘కేజీఎఫ్ 2’, ‘కాంతారా’, ‘చార్లీ 777’, ‘విక్రాంత్ రోనా’ సినిమాలు నాలుగూ పానిండియా విజయాలు సాధించడం వల్ల 2022లో శాండల్ వుడ్ (కన్నడ సినిమా రంగం) కి అనుకూలంగా మారినప్పటికీ , 2023 ప్రథమార్థం వచ్చేసరికి మసకబారింది. 2022 కల్లా పాన్-ఇండియన్ విడుదలల వైభవంతో దూసుకుపోతున్న కన్నడ సినిమా పరిశ్రమ పరిస్థితి ఇప్పుడు భయంకరంగా కనిపిస్తోంది. నాణ్యమైన రచన లేకపోవడం, పేలవమైన ప్రొడక్షన్ విలువలు, గ్రాఫిక్స్ పై అధికంగా ఆధారపడడం వంటివి ప్రధాన అడ్డంకిగా మారాయి. అయితే ఈ పరిస్థితిని కన్నడ లోనే కాదు, దేశవ్యాప్తంగా అన్ని సినిమా పరిశ్రమల్లోనూ చూడొచ్చు.

కానీ ఆశ్చర్యమేమిటంటే, కన్నడ, సినిమాలు, తెలుగు సినిమాలు కవలలుగా కన్పిస్తున్నాయి. కన్నడ విడుదలల జాబితాని పరిశీలిస్తే ఒక ఆసక్తికరమైన విషయం వెల్లడైంది. 2023 ప్రథమార్థంలో, 100 మందికి పైగా కొత్త దర్శకులు, హీరో హీరోయిన్లు శాండల్‌వుడ్‌లో పాదాలు మోపారు. వీళ్ళంతా ఫ్లాపుల్ని అందించి వెళ్ళిపోయారు. తెలుగులో ఇదే పని 87 సినిమాలతో చేశారు.

ఈ ప్రథమార్ధంలో కన్నడలో విడుదలైన 118 సినిమాల్లో 110 కొత్త వాళ్ళవే. ఈ సినిమాల బడ్జెట్ 50 లక్షల నుంచి 3 కోట్ల వరకు వుంటుంది. ఈ సినిమాల మొత్తం పెట్టు బడి సగటు లెక్కిస్తే 100 కోట్లు దాటుతుందని కర్ణాటక ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉమేష్ బణాకర్ అంచనా.

ఈ ట్రెండ్ ఆగదు. ద్వితీయార్ధం కూడా ఇదే ఒరవడి కొనసాగుతుంది. ఎందుకంటే ఈ సినిమాల్ని ఆషామాషీ నిర్మాతలు నిర్మిస్తున్నారు. ఫ్లాప్ చేసుకుని అదృశ్యమై పోతున్నారు. ఈ బాపతు నిర్మాతల తాకిడీయే తెలుగులో లాగే కన్నడలోనూ ఎక్కువుంది. అయితే ఈ కొత్త నిర్మాతలు నష్టపోయి వెళ్ళిపోయినా నటీనటులు, టెక్నీషియన్లు ఉపాధి పొంది బాగుపడుతున్నారు. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (కెఎఫ్‌సిసి) అధ్యక్షుడు బామ హరీష్ అభిప్రాయంలో, ఇంతమంది నిర్మాతలు నష్టపోయి వెళ్ళిపోతున్నా, ఇంకేదో ఒకటి సాధించాలనే ఆశతో మరో అంత మంది కొత్త నిర్మాతలు వచ్చి, కొత్త ముఖాలతో సినిమాలు తీసి సీను రిపీట్ చేస్తున్నారు.

118 లో - కబ్జా (ఉపేంద్ర, శివరాజ్ కుమార్, సుదీప్), రాఘవేంద్ర స్టోర్స్ (రాజ్యసభ సభ్యుడు జగ్గేష్ హీరో), క్రాంతి (దర్శన్ హీరో), శివాజీ సూరత్కల్-2 (రమేష్ అరవింద్ హీరో ), గురుదేవ్ హోయసల – ఈ ఐదు సినిమాలు బ్రేక్ ఈవెన్ తో బయటపడ్డాయి.

కెఎఫ్‌సిసి మాజీ అధ్యక్షుడు చంద్ర శేఖర్ ప్రకారం, 100 సినిమాలతో కొత్త ముఖాలు జాడ లేకుండా అదృశ్యమైన ఈ ధోరణి కొత్త యేం కాదు. పూర్వం 30 నుంచి 50 స్క్రీన్లలో సినిమాని విడుదల చేస్తే 60 లక్షల మందికి పైగా చూసేవారు. అది 50 రోజులకి పైగా ఆడేది. నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు ఈ విడుదల వ్యవస్థ ప్రయోజనాలని పొందేవారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ రోజుల్లో స్టార్ సినిమాలు 300 స్క్రీన్లలో రిలీజ్ చేస్తే కేవలం వారం రోజుల్లోనే 50 లక్షల మంది ప్రేక్షకుల్ని ఆకర్షిస్తున్నాయి. ఆ తర్వాత స్టార్ సినిమాల్ని కూడా వారం రోజులు దాటి థియేటర్లలో నిలబెట్టుకోవడానికి నానా తంటాలు పడాల్సి వస్తోంది. దీంతో కన్నడ రంగం ఇబ్బందికరంగా మారింది.

అయితే సినిమా పరిశ్రమ నష్టాల రంగంగా మారినా, కొత్త నిర్మాతలు చక్రం ఆగిపోకుండా వచ్చి తిప్పుతూనే వుంటారు. ది షో మస్ట్ గో ఆన్ ప్రక్రియలో వాళ్ళకి తెలియకుండానే పాల్గొంటూ పుణ్యం గట్టుకుంటూ వుంటారు. తెలుగులో కూడా ఇదే చేస్తున్నారు.

First Published:  8 Aug 2023 11:01 AM GMT
Next Story