Telugu Global
Cinema & Entertainment

స్టోరీ ఐడియాలపై గుత్తాధిపత్యం లేదు: ఢిల్లీ హైకోర్టు

‘యానిమల్’ స్టార్ రణబీర్ కపూర్ నటించిన ‘షంషేరా’ తన సినిమాకు అనుకరణ అని పేర్కొంటూ నిర్మాత వేసిన కాపీరైట్ ఉల్లంఘన దావాను ఢిల్లీ హైకోర్టు నేడు కొట్టి వేసింది.

స్టోరీ ఐడియాలపై గుత్తాధిపత్యం లేదు: ఢిల్లీ హైకోర్టు
X

‘యానిమల్’ స్టార్ రణబీర్ కపూర్ నటించిన ‘షంషేరా’ తన సినిమాకు అనుకరణ అని పేర్కొంటూ నిర్మాత వేసిన కాపీరైట్ ఉల్లంఘన దావాను ఢిల్లీ హైకోర్టు నేడు కొట్టి వేసింది. తండ్రీ కొడుకుల ఇతివృత్తాలు, పీరియాడికల్ డ్రామాలు మొదలైనవి బాలీవుడ్‌లో సర్వసాధారణమని పేర్కొన్న ఢిల్లీ హై కోర్టు, మధ్యంతర ఉపశమన పిటిషన్‌ ని తిరస్కరించింది. రణబీర్ కపూర్ నటించిన ‘షంషేరా’ని ఓటీటీల్లో ప్రసారం చేయడాన్ని నిలిపివేయడానికి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ నిర్మాత బిక్రమ్‌జీత్ సింగ్ భుల్లర్ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.

‘షంషేరా’ కథాంశం, ఇతివృత్తం తన రచన 'కబూనా ఛేడే ఖేత్' తో పోలివుందని, అందువల్ల ‘షంషేరా’ నిర్మించిన బ్యానర్ యష్ రాజ్ ఫిలిమ్స్ తన కాపీరైట్ ని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ, నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ పై, రచయితలపై భుల్లర్ దావా వేశారు.

పీరియాడికల్ డ్రామా, ఇద్దరు ఒకేలా కనిపించే తండ్రీకొడుకుల కథ, పిల్లలు, పక్షులు, వేడి నూనె, గుర్రం, భూగర్భ సొరంగం వంటి ఇతివృత్తాలపై భుల్లర్ గుత్తాధిపత్యాన్ని క్లెయిమ్ చేస్తున్నట్టు ఈ పిటిషన్ వుందని జస్టిస్ జ్యోతీ సింగ్ తీర్పులో పేర్కొన్నారు. విదేశీ దండయాత్రకి వ్యతిరేకంగా కొడుకు ప్రతీకారం, తిరుగుబాటు ఆధారంగా ‘షంషేరా’ కథ వుంది.

ఈ అంశాలు చాలా బాలీవుడ్ సినిమాలకి సర్వసాధారణమని, కోర్టు భుల్లర్‌తో ఏకీభవిస్తే, అది స్టోరీ ఐడియాలపై గుత్తాధిపత్యాన్ని మంజూరు చేసినట్లేనని, ఇది అమల్లో వున్న చట్టపరమైన వ్యవస్థాపిత సూత్రాలకు విరుద్ధమనీ జస్టిస్ పేర్కొన్నారు. ‘షంషేరా’ సినిమా, భుల్లర్ స్క్రిప్టు పోలికలున్నంత మాత్రాన రెండూ ఒకదానికొకటి కాపీ అని నిర్ధారించలేమని అన్నారు.

వాది (భుల్లర్) కాపీరైట్ ఉల్లంఘనకి సంబంధించి ప్రాథమికంగా కేసుని రుజువు చేయలేకపోయాడని, అందువల్ల ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో సినిమా ప్రసారాన్ని కొనసాగించకుండా ప్రతివాదుల్ని ఆదేశించేందుకు ఎటువంటి కారణం లేదనీ తీర్పు పాఠం పేర్కొంది.

2006 సంవత్సరంలో, 18వ శతాబ్దానికి సంబంధించిన పీరియాడికల్ డ్రామా ఐడియా తనకు వచ్చిందని వాదిస్తూ భుల్లర్ హైకోర్టుని ఆశ్రయించారు. 2009లో, ‘కబూ నా ఛేడే ఖేత్’ 10 నిమిషాల రన్‌టైమ్‌తో షార్ట్ ఫిలింగా తీశామని, దీన్ని టొరంటోలోని స్పిన్నింగ్ వీల్ ఫిలిం ఫెస్టివల్‌లో కూడా ప్రదర్శించామని, దివంగత నటుడు ఓం పురి వాయిస్ ఓవర్ అందించారనీ భుల్లర్ పేర్కొన్నారు. అప్పటి నుంచి తన వర్క్ పట్ల ఆసక్తిని చూపిన ‘షంషేరా’ దర్శకుడితో, రచయితలతో తాను టచ్ లో వున్నాననీ, అయితే జనవరి 2017లో, తనతో కలిసి పనిచేసే ఉద్దేశం లేనట్టు తెలిపారనీ భుల్లర్ వాదించారు.

జూన్ 2022లో ‘షంషేరా’ ట్రైలర్ యూట్యూబ్‌లో విడుదలైనప్పుడు చూడగా, అది తన షార్ట్ ఫిలింకి గణనీయమైన అనుకరణగా వుందనీ, దీంతో ఉపశమనం కోసం కోర్టుని ఆశ్రయించాననీ తెలిపారు. ‘షంషేరా’ లోని పీరియాడిక్ డ్రామా, అండర్ డాగ్స్ పాత్రలు, ఉత్తర భారతదేశంలో స్థాపించిన కథా నేపథ్యం, పురాణ పాత్ర పోలికలతో వున్న విరోధి పాల్పడే అణిచివేతకి వ్యతిరేకంగా పోరాడే కథానాయకుడు- మొదలైనవి షార్ట్ ఫిలింలో, సినిమాలో ఒకటేనని వివరించారు.

రెండు కథల్లో పగ, బానిసత్వం, రెండు తరాల తండ్రీ కొడుకులూ ఒకటేనని వాదించారు. బర్నింగ్ ఆయిల్, వేడి నీరు, పక్షులు, దారి చూపడానికి ధృవ నక్షత్రం, నీటి అడుగున సొరంగాలని రహస్యంగా ఉపయోగించడంలోనూ సారూప్యత వుందనీ, రెండు కథల్లోనూ విరోధులు అనాగరికులైన విదేశీ ఆక్రమణదారులనీ, వీరు గ్రామాన్ని దోచుకోవడం, కథానాయకులు ఎదుర్కోవడం ఒకటేనని ఆధారాలుగా చూపారు.

తండ్రి చనిపోవడం, కొడుకు వారసత్వాన్ని కొనసాగించడం కథనం కూడా ఒకటేనని వాదించారు. రెండు రచనల్లోని ప్రధాన పాత్రలు మొదట్లో చెడ్డ పాత్రలే అని నొక్కిచెప్పారు.

ప్రతివాదులు (యష్ రాజ్ నిర్మాతలు, రచయితలు) ఒక పీరియాడికల్ డ్రామా అయినందున కథకి కాపీరైట్ వుండదనీ, ఇతివృత్తాలు లేదా ప్లాట్లు లేదా ఐడియాలకి కాపీరైట్ రక్షణ వుండదనీ వాదించారు. కోర్టు ‘షంషేరా’ సినిమాని వీక్షించిందినీ, భుల్లర్ స్క్రిప్టునీ విశ్లేషించిందనీ, అయితే భుల్లర్ స్క్రిప్టుకి- సినిమాకూ మధ్య వున్న అసమానతలు పిటిషనర్ ఆరోపించిన సారూప్యతల్ని మించి వున్నాయనీ జస్టిస్ సింగ్ తీర్పు పాఠంలో పేర్కొన్నారు.

‘ప్రతివాదులు వాదించినట్లు ఉత్తర భారతదేశంలో స్థాపించిన కథా నేపథ్యపు పోలిక, కాపీరైట్ ఉల్లంఘన కాదు. అదే విధంగా చమురు, నీరు, పక్షులు, నావిగేషన్ ప్రయోజనం కోసం నక్షత్రం, నీటి అడుగున రహస్య సొరంగాలు, గుర్రాలు, ఘాఘ్రా వంటి దుస్తులు, శృంగార దృశ్యాలూ ఎప్పటి నుంచో అసంఖ్యాక సినిమాల్లో చిత్రీకరిస్తున్నారు. ఒక సినిమాలో ఇవి చూసినప్పుడు తక్షణం మరెన్నో సినిమాలు గుర్తుకు వస్తాయి. దాదాపు ప్రతి కాల్పనిక కథలో ఈ సాధారణ అవగాహనకి సంబంధించిన విషయాలుంటాయి. ఈ ఆలోచనలు లేదా వ్యక్తీకరణల్లో ఏ ఒక్కరికీ లైసెన్స్ లేదు. వీటికి కాపీరైట్ సాధ్యం కాదు’ అని తీర్పు పాఠం పేర్కొంది.

‘ప్రతివాదుల తరపున వాదించినట్టుగా, వాది స్క్రిప్టు లోని షంషేర్ సింగ్ పాత్రే ఇతివృత్తం కాదు, ఈ ఇతివృత్తం ఆఫ్ఘన్‌ల దండయాత్రలకి కర్తార్ ప్రతిఘటన గురించి. అతను తన తండ్రి వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్ళలేదు, బ్రిటీషర్లకి- షంషేరాకూ మధ్య ఒక ఒప్పందం కుదిరినప్పటికీ. ఈ ఒప్పందం కారణంగా ఖమేరాన్ తన స్వేచ్ఛని మూల్యంగా చెల్లించవలసి వచ్చింది. సినిమాలో తండ్రి పాత్ర చాలా ముఖ్యమైనది, అయితే వాది స్క్రిప్టు లో పెద్దగా ప్రాధాన్యం లేదు’ అని తీర్పు పాఠం స్పష్టం చేసింది.

భుల్లర్‌ కి అనుకూలంగా ఎలాంటి ప్రాథమిక కేసు నమోదు కాలేదని, ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులివ్వక పోయినా అతడి కోలుకోలేని నష్టమేమీ జరగదనీ, అలాగే కేసు యష్ రాజ్‌ కి అనుకూలంగా వుందనీ కోర్టు నిర్ధారించింది. అందువల్ల, మధ్యంతర ఉపశమనం కోసం భుల్లర్ చేసిన దరఖాస్తుని కోర్టు తోసిపుచ్చింది. ప్రధాన సూట్ ని జనవరి 16, 2024 కి వాయిదా వేశారు.

అయితే 2022 లో విడుదలైన ‘షంషేరా’ యష్ రాజ్ ఫిలిమ్స్ కి భారీ ఫ్లాపుగా పరిణమించింది. రూ. 150 కోట్ల బడ్జెట్ కి రూ. 63 కోట్లు మాత్రమే బాక్సాఫీసు వచ్చింది.

First Published:  28 Dec 2023 10:23 AM GMT
Next Story