Telugu Global
Cinema & Entertainment

సబ్ లైసెన్సింగ్ తో ఓటీటీల కొత్త వ్యూహం

ఓటీటీలు కొనుగోలు చేసిన సినిమాల మెరుగైన మానిటైజేషన్ కోసం సబ్ లైసెన్సింగ్ హక్కుల విక్రయమనే కొత్త విధానాన్ని ప్రారంభించాయి.

OTT Movies: సబ్ లైసెన్సింగ్ తో ఓటీటీల కొత్త వ్యూహం
X

OTT Movies: సబ్ లైసెన్సింగ్ తో ఓటీటీల కొత్త వ్యూహం

ఓటీటీలు కొనుగోలు చేసిన సినిమాల మెరుగైన మానిటైజేషన్ కోసం సబ్ లైసెన్సింగ్ హక్కుల విక్రయమనే కొత్త విధానాన్ని ప్రారంభించాయి. కొత్త, పాత సినిమాలతోబాటు, వాటి డబ్బింగ్ వెర్షన్స్ ని ఈ పరిధిలోకి తెచ్చాయి. అమెజాన్ ఒరిజినల్ తెలుగు సినిమా 'సీతా రామం' తమిళ సినిమా 'విక్రమ్' వంటి కొత్త విడుదలలు డిస్నీ+ హాట్‌స్టార్‌తో పాటు ఇతర ఓటీటీలలో ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. విజయ్ దేవరకొండ నటించిన 'డియర్ కామ్రేడ్' అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు, ఎంఎక్స్ ప్లేయర్‌లో స్ట్రీమింగ్ అవుతూండగా, తమిళ యాక్షన్ డ్రామా 'విక్రమ్ వేద' హిందీ వెర్షన్ డబ్బింగ్ డిస్నీ+ హాట్‌స్టార్‌లో, ఎంఎక్స్ ప్లేయర్‌లో అందుబాటులో వుంది.

ఒక సినిమా మీద ఓటీటీ హక్కులు తామే కలిగివుండడం ప్రిస్టేజిగా భావించే కంపెనీలు, ఇప్పుడు సబ్ లైసెన్సింగ్ విధానంతో సినిమాల సేకరణకి అయ్యే వ్యయాల్ని నియంత్రణలో వుంచుకోగల్గడంతో బాటు, లైబ్రరీల పరిమాణాన్ని పెంచుకోవడానికి ఉభయతారకంగా వుంటుందన్న నిర్ణయానికి వచ్చాయి. గత రెండు మూడు సంవత్సరాలుగా పెద్ద సినిమాల స్ట్రీమింగ్ హక్కుల విలువ పెరిగింది. ఈ భారాన్ని తగ్గించుకోవాలన్నా, నిరంతర కంటెంట్ సరఫరా వుండాలన్నా, కొత్త చందారుల్ని ఆకర్షించాలన్నా, ఉన్న చందాదారుల్ని నిలుపుకోవాలన్నా, ఓటీటీలు వాటి లైబ్రరీల్లో సినిమాల సంఖ్య పెంచుకోవాలన్నా, సబ్ లైసెన్సింగే శరణ్యమని భావిస్తున్నారు. దేశంలో ఓటీటీ చందాదారులు సగటున సగటున 2.4 సబ్‌స్క్రిప్షన్‌లను కలిగి వున్నారని తేలింది. అందువల్ల, ఒకే సినిమాని బహుళ ప్లాట్‌ఫామ్స్ లో వుంచడం వల్ల చందాదారుల్ని స్థిరంగా వుంచే వీలు కలుగుతుంది. ఒక ప్లాట్ ఫామ్ లో ఆ సినిమాలేదని చందాదారులు వేరే ప్లాట్ ఫామ్ కి చందాకట్టి వీక్షించే అవసరం తప్పుతుంది. ఈ విధంగా సబ్ లైసెన్సింగ్ భాగస్వాములుగా వున్న ప్లాట్ ఫామ్స్ దాటి చందాదారులు వెళ్ళలేరు.

అలాగే వ్యూస్ తగ్గిన సినిమాలని తర్వాత కొంతమంది చిన్న ప్లేయర్‌లకు విక్రయించే వ్యూహం కూడా పరిశీలనలో వుంది. ఒక పెద్ద సినిమాని రూ. 20-25 కోట్ల రూపాయలకి కొనుగోలు చేస్తే, 3 నుంచి 5 కోట్ల రూపాయలకు సబ్ లైసెన్సింగ్ చేసి లబ్ది పొందవచ్చు.

అయితే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్, వూట్ మొదలైన ఓటీటీలు ఈ సబ్ లైసెన్సింగ్ (సహ-భాగస్వామ్య) సినిమా హక్కులపై ప్రకటనలు చేయకుండా గుంభనంగా వ్యవహరిస్తున్నాయి.

అన్ని ప్లాట్ ఫామ్స్ ప్రీమియం ఎక్స్ క్లూజివ్ కంటెంట్‌ని ఒరిజినల్ రూపంలో బయటకు తీసుకురావడానికి కృషి చేస్తున్నప్పుడు, ఇతర ప్లాట్‌ ఫామ్స్ తో షేర్ చేసుకున్న సినిమాలు వీక్షకుల స్థాన చలనాన్ని నిరోధిస్తాయి. సినిమాలే గాకుండా వెబ్ సిరీస్, ఇతర ప్రోగ్రామ్స్, షోస్, జనాదరణపొందిన మరే కంటెంట్ అయినా ప్లాట్ ఫామ్స్ మధ్య షేరింగ్ తో ఓటీటీల పై ఆర్ధిక భారాన్ని తగ్గిస్తాయి.

కంటెంట్ కొనుగోళ్ళపై నెట్ ఫ్లిక్స్ భరిస్తున్న ఆర్ధిక భారాన్ని గమనిస్తే, సినిమా త్రనిర్మాతలు, టీవీ నెట్వర్క్స్, ఇతర కంటెంట్ యజమానులతో లైసెన్సింగ్ ఒప్పందాల్ని పొందడం నెట్‌ఫ్లిక్స్ భారీ వ్యయాన్నే భరిస్తోంది. 2020 చివరి నాటికి, నెట్‌ఫ్లిక్స్ బ్యాలెన్స్ షీట్‌లో 25.4 బిలియన్ డాలర్ల విలువైన కంటెంట్ ని కలిగి వుంది, ఇది అంతకు ముందు సంవత్సరం 24.5 బిలియన్ డాలర్లుగా వుంది.

ఇందులో, లైసెన్స్ పొందిన కంటెంట్ 2020లో 13.7 బిలియన్ డాలర్లు, 2019లో 14.7 బిలియన్ డాలర్లుగా వుంది. కంపెనీ సొంత టీవీ ప్రోగ్రామ్స్ ని, సొంత సినిమా నిర్మాణాల్ని అభివృద్ధి చేయడంలో తన ఆర్థిక వనరుల్ని ఎక్కువగా వినియోగిస్తోంది. ఇది 2019లో 9.8 బిలియన్ల నుంచి 2020లో 11.6 బిలియన్లకి పెరిగింది.

సబ్ లైసెన్సింగ్స్ తో ఈ వ్యయప్రయాసలు కొంత మేర తగ్గుతాయి. ఓటీటీల మధ్య పరస్పర సహకార భావమేర్పడినప్పుడు పోటీతత్వం కూడా తగ్గ వచ్చని నిపుణులు భావిస్తున్నారు. చందాదారులు కూడా రెండు మూడు ఓటీటీలకి చందాలు కట్టే అవసరం తప్పవచ్చు.

First Published:  1 Dec 2022 6:45 AM GMT
Next Story