Telugu Global
Cinema & Entertainment

సౌత్ నిర్మాతల పాత అలవాట్లతో కొత్త సమస్యలు!

ఆలిండియా మార్కెట్ లో తెలుగు, తమిళ సినిమాల జోరుకి కొత్త బ్రేకులు పడుతున్నాయి. ఒకవైపు మల్టీప్లెక్సులు, మరోవైపు ఓటీటీలు సౌత్ సినిమాలని కఠిన నిబంధనలతో అదుపు చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు నిర్మాతల్నిబాధిస్తున్నాయి.

సౌత్ నిర్మాతల పాత అలవాట్లతో కొత్త సమస్యలు!
X

ఆలిండియా మార్కెట్ లో తెలుగు, తమిళ సినిమాల జోరుకి కొత్త బ్రేకులు పడుతున్నాయి. ఒకవైపు మల్టీప్లెక్సులు, మరోవైపు ఓటీటీలు సౌత్ సినిమాలని కఠిన నిబంధనలతో అదుపు చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు నిర్మాతల్నిబాధిస్తున్నాయి. ఐమాక్స్ థియేటర్లు మల్టీప్లెక్సుల చేతిలోవున్నాయి. ఓటీటీలు పెద్ద కంపెనీల చేతిలో వున్నాయి. దీంతో రాజీపడీ రాజీపడలేని పరిస్థితిని నిర్మాతలు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని మల్టీప్లెక్సులతో తమిళ నిర్మాతలు ఒకవైపు, ఓటీటీలతో తెలుగు నిర్మాతలు మరో వైపూ సృష్టించుకున్నారని ట్రేడ్ వర్గాలే చెప్తున్నాయి. పానిండియా ప్రభ వెలుగుతూ ముందంజలో వున్న తెలుగు సినిమాల పట్ల ఓటీటీల అసంతృప్తి కొత్త పరిణామం. అలాగే భారీ వసూళ్ళు సాధిస్తున్న తమిళ సినిమాల పట్ల మల్టీప్లెక్సుల అనాసక్తి ఇంకో ఇరకాటం.

తమిళ సినిమాల్ని ఎనిమిది వారాల వ్యవధిలో కాకుండా థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల్లోనే ఓటీటీ రిలీజ్ కి ఇచ్చేసే నిర్మాతల చర్యని మల్టీప్లెక్సులు ప్రతిఘటిస్తున్నాయి. ఓటీటీలు ప్రారంభమయిన కొత్తల్లో తమిళ బయ్యర్ల నుంచి ఇదే ప్రతిఘటన వుండేది. ఇప్పుడు మల్టీప్లెక్సులు చర్యకి దిగాయి. రజనీకాంత్ ‘జైలర్’ విడుదలైన నాలుగు వారాల్లోనే ఓటీటీలో ప్రత్యక్ష్య మైంది. హిందీ వెర్షన్ కి కనీసం ఎనిమిది వారాల విండో వుండాలని కోరాయి మల్టీప్లెక్సులు. దీనికి నిర్మాతలు అంగీకరించక పోవడంతో మల్టీ ప్లెక్సుల్లో ‘జైలర్’ హిందీ వెర్షన్ విడుదల కాలేదు. ఇప్పుడు తాజాగా దసరాకి విడుదలవుతున్న విజయ్ ‘లియో’ కూడా హిందీ వెర్షన్ విడుదలకి ఆసక్తి చూపడం లేదు మల్టీప్లెక్సులు.

దీంతో ‘లియో’ నిర్మాతలే సమస్యలో పడ్డారు. ఎలాగంటే, దక్షిణాదిలో పెద్దగా ఐమాక్స్ థియేటర్లు లేవు. దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాదిలోనే ఎక్కువ వున్నాయి. పైగా ఇవి పీవీఆర్- ఐనాక్స్ మల్టీప్లెక్స్ గ్రూపు చేతిలో వున్నాయి. ‘లియో’ ఐమాక్స్ ప్రీమియం ఫార్మాట్ లో కూడా విడుదలవుతోంది. హిందీ వెర్షన్ ఓటీటీ విడుదలకి ఎనిమిది వారాల విండో ఇవ్వకపోతే ఉత్తరాదిలో ‘లియో’ హిందీ వెర్షన్ విడుదల అయ్యే అవకాశం లేదు. దీంతో అక్కడి ఇమాక్స్ రెవెన్యూ కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఈ ఐమాక్స్ రెవెన్యూ 7 కోట్లు వుండగలదని అంచనా!

నిర్ణయం నిర్మాతల చేతుల్లోనే వుందని అంటున్నారు మల్టీప్లెక్స్ బాసులు. హిందీ వెర్షన్ కి ఎనిమిది వారాల సమయం తప్పదంటున్నారు. తమిళ వెర్షన్ కి నాలుగు వారాల విండో అంగీకరించామంటున్నారు. విండో నిర్ణయాలు ఫిల్మ్-టు-ఫిల్మ్ ప్రాతిపదికన జరుగుతాయని, ఎగ్జిబిటర్ అంచనాల ఆధారంగానే ఇవి జరుగుతాయనీ చెప్తున్నారు.

హిందీ సినిమాల విషయంలో కూడా ఎనిమిది వారాల విండో అమలవుతున్న పరిస్థితి వుంది. ఇది అన్ని నాన్-నేషనల్ చైన్‌లు, సింగిల్ స్క్రీన్‌లు కూడా అనుసరించాల్సిన బెంచ్‌మార్క్. కానీ కొన్ని సమయాల్లో కంటెంట్ కొరత కారణంగా మినహాయింపు తప్పడం లేదు. నాలుగు వారాల్లో సినిమాలు హోమ్ స్క్రీన్లలో ప్రసారమయితే ప్రేక్షకులకి థియేటర్ కి వెళ్ళాలన్న ఆసక్తి వుండదనేది ఈ విండో నిబంధనలకి ప్రధాన కారణం.

తెలుగులో ఓటీటీ బడ్జెట్ కోత!

తమిళ నిర్మాతలకి హిందీ వెర్షన్ ఓటీటీ విండో సమస్య ఎదురైతే, తెలుగు నిర్మాతలకి ఓటీటీలు బడ్జెట్ లో కోత విధించుకోవడం తలనొప్పిగా మారింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి అంతర్జాతీయ బ్రాండ్‌లు తెలుగు సినిమాలు తీసుకోవడం తగ్గించాలని యోచిస్తున్నట్లు సమాచారామందింది. ఈ రెండు దిగ్గజాలు కలిసి టాలీవుడ్ నుంచి కంటెంట్‌ ని సేకరించడం కోసం ఇక సంవత్సరానికి రూ. 250 నుంచి 300 కోట్లు మాత్రమే కేటాయించాలని నిర్ణయించాయి. కొన్ని తెలుగు సినిమాల కారణంగా ఎదుర్కొంటున్న నష్టాన్ని తగ్గించుకోవడానికే బడ్జెట్లో ఈ కోత.

స్టార్ సినిమాలు తీసే అగ్రనిర్మాతలు రిటర్న్స్ లో భర్తీ కోసం ఓటీటీ హక్కుల మీదే ఆధారపడతారు. ఆడియో, శాటిలైట్, డబ్బింగ్ హక్కులకంటే ఓటీటీల హక్కుల ద్వారానే అధిక మొత్తాలు లభిస్తాయి. ఓటీటీలు బడ్జెట్ తగ్గించుకుని తక్కువ సినిమాలు తీసుకుంటే ఏ సినిమాలు తీసుకుంటారో తెలియని పరిస్థితుల్లో నిర్మాతలు స్టార్ సినిమాలు తీయడం కష్టమవుతుంది. ఏడాదికి రూ. 250 - 300 కోట్లు ఓటీటీ బడ్జెట్ అంటే ఏడెనిమిది సినిమాలకి మించి ఒప్పందాలు జరిగే పరిస్థితి వుండదు. మిగిలిన నిర్మాతలు ఎక్కడికి పోవాలి?

ఈ గందరగోళానికి కొంతమంది అగ్రశ్రేణి నిర్మాతలే కారణమని టాలీవుడ్ వర్గాలే అంటున్నాయి. తమ సినిమాలకి పాన్-ఇండియా ప్రచారాలు చేసుకుంటూ ఓటీటీలకి భారీ మొత్తాలకి అంటగట్టారనీ, ఇదే కొంప ముంచిందనీ అంటున్నారు. ప్రతీ సినిమా ఆర్ ఆర్ ఆర్ గా, ప్రతీ సినిమా పుష్పా గా ఫీలైపోతున్నారనీ, ఇలా తమని తామే మోసం చేసుకుంటున్నారనీ టాలీవుడ్ వర్గాల మాట. ఒక స్టార్ సినిమా రూ. 30 కోట్లకి కొనుగోలు చేసిన ఓ టీటీకి రూ. 6 కోట్లు కూడా రికవరీ కాలేదని తెలుస్తోంది.

ఈ అంతర్జాతీయ ఓటీటీ దిగ్గజాలకి మన దేశంలో ఆడిట్ టీమ్‌లు వున్నాయి. కొత్త సినిమా ప్రతిపాదన ముందు కొచ్చినప్పుడు, సబ్‌స్క్రిప్షన్‌ల పెరుగుదలని, రిపీట్ ఆడియన్స్ కౌంట్‌తో పాటు దాని వాస్తవ వీక్షకుల సంఖ్యనీ నిశితంగా అధ్యయనం చేస్తారని బహుశా నిర్మాతలకి తెలీదు. నిర్మాతలు హైప్ చేసిన కొన్ని స్టార్ సినిమాలకి తక్కువ ఫుట్ ఫాల్స్ ని ఆడిట్ టీములు గమనించాయని, ఓటీటీలు అంత అమాయకంగా లేవని నిర్మాతలు కూడా గమనిస్తే మంచిదని చెన్నైకి చెందిన ట్రేడ్ నిపుణుడు హెచ్చరించాడు.

First Published:  5 Oct 2023 10:43 AM GMT
Next Story