Telugu Global
Cinema & Entertainment

మల్టీప్లెక్సుల నష్టం సౌత్ సినిమాల లాభం

తెలుగు పానిండియా ‘పుష్ప 2’ నిర్మాతలు గనుక సినిమా విడుదలైన 4 వారాల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ కి ఒప్పందం చేసుకుంటే నార్త్ లో మల్టీప్లెక్సులు మళ్ళీ భారీగా నష్ట పోతాయి.

మల్టీప్లెక్సుల నష్టం సౌత్ సినిమాల లాభం
X

తెలుగు పానిండియా ‘పుష్ప 2’ నిర్మాతలు గనుక సినిమా విడుదలైన 4 వారాల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ కి ఒప్పందం చేసుకుంటే నార్త్ లో మల్టీప్లెక్సులు మళ్ళీ భారీగా నష్ట పోతాయి. ఇప్పటికే రజనీకాంత్ ‘జైలర్’ తో, విజయ్ ‘లియో’ తో భారీగా నష్ట పోయాయి. ఇక రూ. 200 కోట్లకి ఓటీటీ హక్కులు అమ్ముడైన ప్రభాస్ నటించిన ‘సాలార్’ కూడా 4 వారాల విండోతో స్ట్రీమింగ్ అయితే మల్టీప్లెక్సుల నష్టాలు చెప్పనవసరం లేదు. మల్టీప్లెక్సులు ఇలాగే 8 వారాల విండో కోసం పట్టుబడితే సౌత్ సినిమాలతో వ్యాపారం వదులుకోవాల్సిందే.

మల్టీప్లెక్సులు సౌత్ సినిమాల హిందీ వెర్షన్స్ కి 8 వారాల విండో కోరుతున్నాయి. ఎందుకంటే బాలీవుడ్ తో హిందీ సినిమాలకి 8 వారాల విండో ఒప్పందమే వుంది. ఒక హిందీ సినిమా విడుదలైతే 8 వారాల వరకూ మల్టీప్లెక్సుల్లో ఆడనివ్వాలని, ఆ తర్వాతే ఓటీటీల్లో స్ట్రీమింగ్ చేసుకోవాలని ఆ ఒప్పందం. కానీ సౌత్ లో 4 వారాల థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీల్లో విడుదల చేసుకోవచ్చు. బాలీవుడ్ కీ సౌత్ కీ ఈ వేర్వేరు విండోల వల్ల సౌత్ సినిమాల హిందీ వెర్షన్లు నార్త్ లో మల్టీప్లెక్సుల్లో విడుదల కావడం లేదు.

పీవీఆర్- ఐనాక్స్, సినీపొలిస్ వంటి జాతీయ మల్టీప్లెక్స్ చైన్లు దక్షిణ సినిమాల హిందీ వెర్షన్స్ ని ప్రదర్శించడానికి నిరాకరిస్తే ఇంకేం జరుగుతుందో చూద్దాం. ‘లియో’, ‘జైలర్’ రెండు భారీ సౌత్ సినిమాలు 4 వారాల విండోతో లాభదాయకమైన స్ట్రీమింగ్ ఒప్పందాల్ని పొందడమే కాకుండా, నార్త్ లో సింగిల్ స్క్రీన్‌ థియేటర్లలో, స్థానిక థియేటర్ చైన్‌లలో, బి-సి సెంటర్లలో సూపర్ హిట్టయ్యాయి.

సౌత్ నిర్మాతలు సాధారణంగా నాలుగు వారాల ఓటీటీ విండోని కోరుకుంటారు. ఆ సినిమాలు ప్రస్తుతం నార్త్ లో వున్న 8 వారాల విండోతో పోలిస్తే, థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల వరకు నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో వుండవు. నార్త్ మార్కెట్‌లో హిందీ సినిమాలకి 8 వారాల సుదీర్ఘ ఓటీటీ విండో వల్ల, థియేటర్ ఆపరేటర్‌లు కలెక్షన్స్ ని చివరంటా రాబట్టుకో గల్గుతారు.

‘జైలర్’, ‘లియో’ హిందీ వెర్షన్లు నార్త్ లోని సింగిల్ స్క్రీన్‌లలో, కార్పొరేట్లు కాని స్వతంత్ర మల్టీప్లెక్సుల్లో భారీ కలెక్షన్స్ ని రాబట్టుకున్నాయి. జాతీయ- కార్పొరేట్ మల్టీప్లెక్స్ చైన్‌లు 4 వారాల విండోకి ఎందుకు వ్యతిరేకంగా వున్నాయంటే, సౌత్ సినిమాలకి 4 వారాల విండో ఇస్తే, హిందీ నిర్మాతలు కూడా అదే డిమాండ్ చేయడం ప్రారంభించవచ్చు.

సౌత్ నిర్మాతలు 4 వారాల విండో మార్గంలో వెళ్ళడానికి ఇష్టపడే కారణం ఏమిటంటే, థియేట్రికల్ బాక్సాఫీసు కలెక్షన్లు ఎప్పుడేమవుతాయో దైవాధీనం కాబట్టి. ఇప్పుడు పెద్ద ఎత్తున హిందీ, తమిళం, తెలుగు సినిమాల్ని కొనుగోలు చేయాలని చూస్తున్న ఓటీటీల భారీ మొత్తాల్ని నిర్మాతలు అందుకో గల్గుతున్నారు కాబట్టి. థియేట్రికల్ కలెక్షన్ల కంటే దీనికెక్కువ గ్యారంటీ వుంది కాబట్టి.

‘లియో’ లాంటి సినిమాని నెట్‌ఫ్లిక్స్ 4 వారాల విండోతో రూ. 130 కోట్లకు కొనుగోలు చేసింది. 8 వారాల విండోకి అంగీకరించి వుంటే ఓటీటీ ధర సగానికి సగం తగ్గి వుండేదని ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంకా అదనంగా ‘లియో’ రూ. 30 కోట్ల రూపాయల్ని హిందీ వెర్షన్ నుంచి మల్టీప్లెక్సులు కాకుండా నార్త్ థియేటర్లలో సంపాదించి పెట్టింది.

ఆగస్టులో ‘జైలర్’ ని కూడా పీవీఆర్- ఐనాక్స్, సినీపొలిస్ మొదలైన మల్టీప్లెక్సులు హిందీ వెర్షన్‌ ని విడుదల చేయడానికి నిరాకరించాయి. అయితే ‘లియో’ కి ఒక నష్టం మాత్రం వాటిల్లింది. నార్త్ మల్టీప్లెక్సుల్లో హిందీ వెర్షన్ విడుదల కాకపోవడంతో, దాని ఐమాక్స్ వెర్షన్ కూడా ఐమాక్స్ థియేటర్లలో విడుదల కాలేదు. ఈ నష్టం నిర్మాతలకి రూ. 7 కోట్లు కాక, నార్త్ ప్రేక్షకులకి ఈ సినిమాతో ఐమాక్స్ అనుభవం లేకుండా పోయింది. నార్త్ లో పాతిక ఐమాక్స్ థియేటర్లున్నాయి. ఇవి లైసెన్సు పొందిన పీవీఆర్- ఐమాక్స్ చేతిలో వున్నాయి. సౌత్ లో ఐదారు కూడా లేవు.

ఇదే రేపు ‘పుష్ప 2’ తో, ‘సాలార్’ తో జరగొచ్చు. ఈ పానిండియా సినిమాల హిందీ వెర్షన్స్ కి ప్రీమియం ఫార్మాట్ లో ఐమాక్స్ అదృష్టం కూడా లేకుండా పోవచ్చు. భారీ పానిండియా సౌత్ సినిమాలు ఐమాక్స్ విడుదల ప్రయోజనాలని కోల్పోతే అది దురదృష్టమే!

First Published:  16 Dec 2023 9:58 AM GMT
Next Story