Telugu Global
Cinema & Entertainment

సినిమా టూరిజంతో సినిమాలకే లాభం!

సినిమాలు వినోదానికి మాత్రమే సాధనాలుగా భావించుకుని సినిమాలు తీస్తే ఆర్ధిక వ్యవస్థ ఒక అంగాన్ని ఉపేక్షించినట్టే.

సినిమా టూరిజంతో సినిమాలకే లాభం!
X

సినిమాలు వినోదానికి మాత్రమే సాధనాలుగా భావించుకుని సినిమాలు తీస్తే ఆర్ధిక వ్యవస్థ ఒక అంగాన్ని ఉపేక్షించినట్టే. మామూలు సినిమా హాళ్ళలో చాయ్ బజ్జీల వంటి ఆహారపానీయాల అమ్మకాలు, మల్టీప్లెక్సుల్లో కేవలం పాప్ కార్న్ అమ్మి పీవీఆర్ -ఐనాక్స్ సంపాదించే ఆరేడు వందల కోట్లూ -ఇవి మాత్రమే సినిమా అనుబంధ వ్యాపారాలనుకుంటే సినిమా వ్యాపారం పూర్తిగా తెలియనట్టే. వీటికవతల విస్తారంగా సినిమా టూరిజమనే పెద్ద వ్యాపారం ప్రమోషన్ కోసం ఎదురుచూస్తోంది. సినిమా షూటింగులు విదేశాల్లో జరిపితే విదేశీ పర్యాటక శాఖలకి లాభం. స్వదేశంలో, స్వరాష్ట్రంలో జరుపుకుంటే ఇక్కడి టూరిజానికి లాభం. సినిమా టూరిజం నేడొక కోట్లాది రూపాయల ఆదాయ వనరు. దీన్ని విస్మరిస్తే దేశ ఆర్ధిక వ్యవస్థలో భాగం కానట్టే.

కానీ యాదృచ్ఛికంగానే కావొచ్చు - మలయాళంలో ‘ప్రేమమ్’ (2016) సినిమా టూరిజాన్ని ప్రేరేపించింది. కేరళలోని అలప్పుళ గ్రామ అందచందాల్ని అది చూపించిన తీరుకి కాలేజీ స్టూడెంట్స్ ఫిదా అయిపోయారు. పొలోమని అక్కడికి వరసకట్టి, ఆ సినిమాలో హీరోయిన్ ని చూసి హీరో ప్రేమలో పడే లొకేషన్ ని టూరిస్ట్ స్పాట్ గా చేసి పడేశారు. వర్ధమాన సినిమా రచయితలూ ఆ వూరికెళ్ళి ఇన్స్ పిరేషన్ కోసం విహరించడం మొదలెట్టారు.

మలయాళంలోనే ‘అనార్కలీ’ (2015) అనే మరో మూవీలో లక్షద్వీప్ లొకేషన్స్ ని చిత్రీకరించిన తీరుకి మలయాళీలు అక్కడికి విహారయాత్రలు మొదలెట్టారు. ఇంకో మలయాళ మూవీ ‘ఎన్ను నింతే మొయిదీన్’ (2015) విడుదలకి ముందు కేరళలోని ముక్కం అనే గ్రామం పెద్దగా ఎవరికీ తెలీదు. సినిమా విడుదలయ్యాక అదొక ప్రేమికుల యాత్రా స్థలమైపోయింది. సినిమాలో పాత్రలైన ‘మొయిదీన్- కాంచన మాల’ లు జీవించిన ఆ గ్రామానికి వెళ్ళని ప్రేమికుల్లేరు. ఒక హాస్టల్ విద్యార్థినులంతా ఆ వూళ్ళో ‘కాంచనమాల’ ని చూడ్డానికి ప్రయాణం కూడా కట్టారు. ఆ వూళ్ళో ‘కాంచనమాల’ ఇల్లు, ‘మొయిదీన్’ ఇల్లూ టూరిస్టు స్పాట్స్ గా మారిపోయాయి. ఈ విశేషాలు ఈ సినిమాలు విడుదలైనప్పుడు ఎప్పుడో చదివాం.

ఏదో విలేజికి వెళ్ళాం, సరదాగా షెడ్యూల్ ముగించు కొచ్చాం అన్నట్టుగాక- విలేజియే కథ- కథే విలేజి అన్నట్టుగా పర్యావరణాన్ని క్రియేట్ చేయాలన్న ఆలోచన వుంటే, ఆ విలేజిలు టూరిస్టు స్పాట్స్ కాకుండా పోవు. తెలుగులో చిన్న బడ్జెట్ గ్రామీణ సినిమాలెన్నో తీస్తూ వుంటారు. అవి సినిమా టూరిజాన్ని ప్రేరేపించేలా వుండవు. వాటిలో ఆకర్షించే ఒక లాండ్ మార్క్ స్థలం గానీ, ఎమోషనల్ గా కనెక్ట్ చేసే సన్నివేశాలతో కూడిన లొకేషన్స్ గానీ వుండవు. ఏదో వెళ్ళామా, తీశామా, చూపించామా, ఇంతే.

సినిమా టూరిజానికి దేశంలోకి డబ్బుని తీసుకు వచ్చే శక్తి వుంది. ఆర్థిక వ్యవస్థలోని పర్యాటకం, వసతి సౌకర్యాలు, ఆహార పదార్థాలు, రవాణా సేవలు, ఆరోగ్య సేవలు, స్థానిక కార్మికుల ఉపాధి వంటి కార్యకలాపాల శ్రేణిని ప్రేరేపిస్తుంది సినిమా టూరిజం. ఒక నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 80 మిలియన్ల మంది అంతర్జాతీయ ప్రయాణికులు సినిమాల ద్వారా ప్రభావితమయ్యారు. హాలీవుడ్ అతి పెద్ద ఉదాహరణ. హాలీవుడ్ కాకుండా అనేక ఇతర దేశాలు కూడా ఈ అవకాశాన్ని పొందుతున్నాయి. టర్కీ ఈ రంగంలో అభివృద్ధి చెందుతున్న మరో దేశం. టర్కీ సినిమాలు, టీవీ సిరీస్ లు చూసి టర్కీని సందర్శించడానికి సౌదీలు, బల్గేరియన్లు అత్యంత ఆసక్తి కనబరుస్తున్నారని వెల్లడైంది.

ఇక కె- డ్రామాలు, కె పాప్ మ్యూజిక్ లతో దక్షిణ కొరియా అంతర్జాతీయ టూరిస్టుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. 2020లో కొరియన్ వేవ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 160,000 మంది విద్యార్థులు కొరియన్ భాషని నేర్చుకోవడం ప్రారంభించారు. సినిమాలు దీర్ఘకాలిక పర్యాటక ఆదాయాన్ని అందిస్తాయి. సినిమాలో లేదా టెలివిజన్‌లో ఏదైనా ఆకర్షణీయ ప్రాంతం కనిపిస్తే, అప్పటికే వున్న ఆ ప్రదేశానికి వచ్చే సందర్శకుల సంఖ్యపై భారీ ప్రభావాన్ని చూపుతుంది. ఆ ప్రాంతానికి కొత్త రకమైన పర్యాటకాన్ని సృష్టించి స్థానిక ఆర్థిక వ్యవస్థకి ఊతాన్ని అందిస్తుంది. సగటున ఒక సినిమా, లేదా టీవీ కార్యక్రమం పర్యాటక ఆదాయాన్ని దాదాపు 31% పెంచగలదని అంచనా.

న్యూజిలాండ్ లో షూటింగ్ చేసిన హాలీవుడ్ ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ విడుదలైనప్పుడు అభిమానులు న్యూజిలాండ్‌ కి ఎగబడ్డారు. అక్కడి వార్షిక పర్యాటక ఆదాయం 40% పెరిగింది. ఏ హాలీవుడ్ సినిమా ఏ దేశపు టూరిజాన్ని పెంచిందని చూస్తే- బ్రేవ్ హార్ట్- స్కాట్లాండ్, హెరీ పాటర్- బ్రిటన్, మామా మియా- గ్రీస్, ఇండియానా జోన్స్ అండ్ ది లాస్ట్ క్రుసేడ్- జోర్డాన్, గాడ్ ఫాదర్- ఇటలీ, ది డార్క్ నైట్ రైజెస్ - జోధ్ పూర్, ఇండియా...ఇలా ఎన్నో!

విదేశీ టూరిజాన్ని మన దేశం బాలీవుడ్ సినిమాలతో విశేషంగా ఆకర్షించేది ఒకప్పుడు. 1990 ల తర్వాత నుంచి హిందీ సినిమాలు విదేశీ షూటింగులు జరుపుకోవడం ప్రారంభించాక సినిమా టూరిజం తగ్గింది. విచిత్రమేమిటంటే రివర్స్ లో విదేశాల్లో టూరిజాన్ని ప్రోత్సహించిన సినిమాలున్నాయి. స్పెయిన్ లో తీసిన ‘జిందగీ నా మిలేగీ ‘దొబారా’ చూశాక పర్యటకులు స్పెయిన్ కి ఎగబడ్డారు!

కేవలం పాటల కోసం విదేశాలకి వెళ్ళి షూట్ చేయడం ఇంకో మోజు. దీని వల్ల ఒరిగగేదేమీ లేదు. దేశంలోనే ఇంకా వాడుకోకుండా మిగిలిపోయిన అద్భుత లొకేషన్స్ ఎన్నో వున్నాయి. వాటితో టూరిజాన్ని పెంచగల శక్తి సినిమాలకుంది. టూరిజం పెరిగితే మనకేంటి లాభమనుకోవచ్చు. నిజమే, మనకేంటి లాభం? సినిమాకొచ్చే పేరు కూడా ఒక లాభమేనా?

First Published:  2 Oct 2023 8:16 AM GMT
Next Story