Telugu Global
Cinema & Entertainment

ప్రయోగాల దశలో సూపర్ అడ్వాన్స్ బుకింగులు

పెద్ద బ్యానర్‌ల నుంచి వెలువడే సూపర్ స్టార్ సినిమాలు చూడడానికి ఒక వారం లేదా అంతకు తక్కువ రోజుల ముందు అడ్వాన్స్ బుకింగుల కోసం ఇంకెంత మాత్రం వేచి చూడాల్సిన అవసరం లేదు.

ప్రయోగాల దశలో సూపర్ అడ్వాన్స్ బుకింగులు
X

పెద్ద బ్యానర్‌ల నుంచి వెలువడే సూపర్ స్టార్ సినిమాలు చూడడానికి ఒక వారం లేదా అంతకు తక్కువ రోజుల ముందు అడ్వాన్స్ బుకింగుల కోసం ఇంకెంత మాత్రం వేచి చూడాల్సిన అవసరం లేదు. ఒక నెల ముందుగానే కొనుగోలు చేయవచ్చు, కొన్నిసార్లు ఆరు వారాల ముందు కూడా. ఇది కొత్త ట్రెండ్. ఇది బెడిసి కొట్టిన సందర్భాలూ లేకపోలేదు. ఉదాహరణకి ప్రభాస్ నటిస్తున్న ‘సాలార్’ కి అమెరికాలో ఆరు వారాల ముందు అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించి, తర్వాత క్యాన్సిల్ చేసిన విషయం తెలిసిందే.కారణం ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడమే. ఫలితంగా అడ్వాన్స్ బుకింగులతో సమకూడిన మొత్తం 400 k డాలర్లు (రూ. 3,33,25,900) వెనక్కి ఇచ్చారు. సెప్టెంబర్ 28 విడుదల తేదీగా ప్రకటించి ఆగస్టులో అడ్వాన్స్ బుకింగులు ప్రారంభించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడంతో విడుదల జనవరికి వాయిదా వేశారు. ఇలా సూపర్ అడ్వాన్స్ బుకింగుల స్కీము బెడిసికొట్టింది.

ఇప్పుడు అమల్లో వున్న వాక్-ఇన్‌ బుకింగ్స్, లేదా కౌంటర్ బుకింగ్స్, లేదా రెగ్యులర్ అడ్వాన్స్ బుకింగ్స్ వంటి మార్కెటింగ్ టూల్స్ వున్నప్పటికీ, నిర్మాతలు తమ సినిమాల పట్ల మరింత బజ్ క్రియేట్ చేయడానికి సూపర్ అడ్వాన్స్ బుకింగుల వైపు మొగ్గుచూపుతున్నారు.

అయితే కచ్చితంగా ప్రకటించిన తేదీకి సినిమా విడుదల చేయగలిగితేనే దీన్ని చేపట్టాలి. ఈ కమిట్ మెంట్ తప్పితే ఇతర నిర్మాతల సినిమాల విషయంలో కూడా విశ్వసనీయత దెబ్బ తింటుంది. మొత్తానికే ఈ కొత్త మార్కెటింగ్ టూల్ మూలన బడుతుంది.

నెల ముందు, అరు వారాల ముందు, సూపర్ అడ్వాన్స్ బుకింగులు ఓపెన్ చేస్తే మొత్తం బాక్సాఫీస్ కలెక్షన్లలో దాదాపు 30-40 శాతం ముందుగానే రాబట్టుకునే అవకాశముంటుంది. సూపర్ అడ్వాన్స్ బుకింగ్‌లు ఓ ప్రధాన ట్రెండ్‌గా మారబోతున్నాయి. సినిమాపై ప్రేక్షకుల ఆసక్తిని అంచనా వేయడానికి నిర్మాతలు, థియేటర్ల యజమానులు ఇద్దరికీ ఇది ఉపయోగకరమైన టూల్ కాగలదు. ప్రేక్షకులు అత్యధిక ఆసక్తితో ఎదురుచూసే సినిమాలకి, వాటి అడ్వాన్సు బుకింగ్స్ కీ మధ్య బలమైన సంబంధం వుంది. పెద్ద సినిమాల విషయంలో అడ్వాన్స్ బుకింగ్స్ ని చాలా ముందుగానే తెరవడం చాలా ప్రయోజనకరంగా వుంటుందని, ఇలా అడ్వాన్సు రెస్పాన్స్ ఆధారంగా షో షెడ్యూళ్ళని సర్దుబాటు చేయడానికి కూడా వీలవుతుందనీ మల్టీప్లెక్స్ యజమాన్యాలే చెప్తున్నాయి.

ఇంత ముందుగా టికెట్స్ ని బుక్ మై షో, పేటీఎం వంటి ప్లాట్‌ఫారమ్‌లలో ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ఈ సమయంలో కౌంటర్ బుకింగ్స్ అందుబాటులో వుండవు. సూపర్ అడ్వాన్స్ బుకింగ్ తేదీల్ని నిర్మాతలు, సినిమా థియేటర్ యజమానులు నిర్ణయిస్తారు. సోషల్ మీడియాలో - ముఖ్యంగా ట్విట్టర్ లో, ఇన్‌స్టాగ్రామ్‌లో- నిర్మాతలు, స్టార్లు ప్రమోషన్లు చేస్తారు. ఈ డిజిటల్ ప్రచారానికయ్యే ఖర్చు మొత్తం మార్కెటింగ్ బడ్జెట్‌లో 25% వుంటుంది. భారీ బజ్ క్రియేటయిన సినిమాల సూపర్ బుకింగ్‌లు ప్రారంభ వారాంతంలో 35-40% వరకూ వుండొచ్చు.

ఉదాహరణకి, ఈ బుకింగ్ మోడల్లో ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’, ‘పఠాన్’, ‘జవాన్’ వంటి సినిమాల సూపర్ అడ్వాన్స్ బుకింగ్‌లు వాటి బాక్సాఫీసు కలెక్షన్స్ కి గణనీయంగా దోహదపడ్డాయి, ఈ ఆదాయం రూ. 35-40 కోట్లకు చేరుకుందంటే ఈ టూల్ ఎంత బలమైనదో గమనించ వచ్చు. ఇలా బలమైన సూపర్ అడ్వాన్స్ బుకింగ్‌లు నిర్దిష్ట సినిమాల చుట్టూ పాజిటివ్ హైప్ ని, అంచనాలనీ సృష్టిస్తాయి. ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపుతాయి. అక్టోబర్‌లో విడుదలైన తమిళ హిట్ ‘లియో’ విషయంలో, విక్రయించిన మొత్తం టిక్కెట్లలో రెగ్యులర్ అడ్వాన్స్ బుకింగ్స్ 30 శాతంగా వున్నాయి. ఇదే నెల, నెలన్నర ముందు సూపర్ బుకింగ్స్ తెరిచి వుంటే, ఇంకా ముందుగానే నిర్మాతల జేబులో ఈ మొత్తాలు పడేవి.

ఖచ్చితంగా చెప్పాలంటే, రెగ్యులర్ అడ్వాన్స్ బుకింగ్‌లు, సూపర్ అడ్వాన్సు బుకింగులు ముఖ్యంగా సినిమా వీరాభిమానుల్ని బలంగా ఆకర్షిస్తాయి. అధికంగా యువత, సాంకేతిక పరిజ్ఞానమున్న ఇతరులూ- ముఖ్యంగా సూపర్ హీరో ఫ్రాంచైజీలు, లేదా సీక్వెల్‌ల వంటి భారీ అంచనాలు గల సినిమాలపై ఆసక్తి కలిగి వుంటారు. దీనికి విరుద్ధంగా, కాస్త వేచి చూసే వాక్-ఇన్‌లు, రివ్యూలు చూశాకే వచ్చే ప్రేక్షకులు, మౌత్ టాక్ తెలుసుకుని వచ్చేవాళ్ళూ, అప్పటికప్పుడు సినిమా చూడాలని మూడ్ పుట్టి వచ్చే వాళ్ళూ వుంటారు. వీళ్ళ శాతమే ఎక్కువ వుంటుంది. పెరుగుతున్న ట్రెండ్‌గా, సూపర్, రెగ్యులర్ అడ్వాన్స్ బుకింగ్‌లు ముఖ్యంగా మొదటి శ్రేణి నగరాల్లో జనాదరణ పొందుతున్నాయి.

మధ్య, చిన్న తరహా సినిమాలకి ఆన్-ది-స్పాట్ బుకింగులే శరణ్యం. తెలుగులో తీసుకుంటే, మ్యాడ్, కీడా కోలా వంటి సినిమాలకి ఆకట్టుకునే అడ్వాన్స్ బుకింగులు లేనప్పటికీ, ఇవి బాక్సాఫీసు విజయాల్ని సాధించాయి. బుక్ మై షో ఆన్ లైన్ బుకింగ్ ప్లాట్ ఫారం ‘ది సినీ ఫైల్స్’ పేరుతో ఇటీవల ప్రారంభించిన వినియోగదారుల సర్వే నివేదిక ప్రకారం, జనరేషన్ జడ్ యువతలో, అలాగే జనరేషన్ ఎక్స్ యువతలో 74 శాతం మంది తమ అభిరుచులతో కనెక్టయ్యే సినిమాల కోసం మూడు రోజుల ముందుగానే ప్లాన్ చేసి, ఓ కన్ను వేసి వుంచుతున్నారు. మిగతా 26 శాతం మంది ఇప్పటికీ ఆ రోజుకి అనుకుని సినిమా కెళ్తున్నారు. ఇంకా, 35 శాతం జనరేషన్ జడ్ యువత ఫస్ట్ డే- ఫస్ట్ షో ఉన్మాదంతో తులతూగుతున్నారు.

పైన చెప్పుకున్నట్టు సూపర్ అడ్వాన్సు బుకింగులతో ఒకటే సమస్య. నెల, నెలన్నర ముందుగానే బుకింగ్స్ తెరవాలనుకున్నప్పుడు విడుదల తేదీ పట్ల ఖచ్చితమైన నమ్మకముండాలి. పోస్ట్ ప్రొడక్షన్ వాయిదాలు పడే పరిస్థితులు లేకుండా చూసుకోవాలి. థియేటర్లూ బుక్ చేసుకుని వుండాలి. ఇవి గనుక సాధ్యమైతే బయ్యర్ల నుంచి వచ్చే అడ్వాన్సులే గాకుండా, ప్రేక్షకుల నుంచి కూడా 30-40 శాతం అడ్వాన్సులు వచ్చిపడతాయి.

First Published:  26 Nov 2023 8:30 AM GMT
Next Story