Telugu Global
MOVIE REVIEWS

వాంటెడ్ పండుగాడ్ మూవీ రివ్యూ

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సమర్పణలో థియేటర్లలోకి వచ్చింది "వాంటెడ్ పండుగాడ్". మరి ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు గ్లోబల్ ఎక్స్ క్లూజివ్ రివ్యూ

వాంటెడ్ పండుగాడ్ మూవీ రివ్యూ
X

నటీనటులు: సునీల్, అన‌సూయ, వెన్నెల కిషోర్‌, స‌ప్త‌గిరి, శ్రీనివాసరెడ్డి, సుడిగాలి సుధీర్‌, దీపికా పిల్లి, బ్ర‌హ్మానందం, ర‌ఘుబాబు, అనంత్, పుష్ప జ‌గ‌దీష్‌, నిత్యా శెట్టి, వసంతి, విష్ణు ప్రియ‌, హేమ‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, ఆమ‌ని, థ‌ర్టీ ఇయ‌ర్స్ పృథ్వీ త‌దిత‌రులు

స‌మ‌ర్ప‌ణ : కె.రాఘ‌వేంద్ర‌రావు

బ్యాన‌ర్ : యునైటెడ్ కె ప్రొడ‌క్ష‌న్స్‌

నిర్మాత‌లు : సాయి బాబ కోవెల‌మూడి, వెంక‌ట్ కోవెలమూడి

ద‌ర్శ‌క‌త్వం : శ్రీధ‌ర్ సీపాన‌

క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే : జ‌నార్ధ‌న మ‌హ‌ర్షి

సినిమాటోగ్ర‌ఫీ : మ‌హి రెడ్డి పండుగుల‌

మ్యూజిక్ : పి.ఆర్‌

రేటింగ్ : 1/5

ఓ పుస్తకం ఎలా రాయకూడదో తెలుసుకోవాలంటే తాజాగా రాఘవేంద్రరావు రాసిన పుస్తకం చదవాలి. అదే విధంగా ఓ సినిమా ఎలా తీయకూడదో తెలుసుకోవాలంటే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సమర్పించిన వాంటెడ్ పండుగాడ్ అనే సినిమా చూడాలి. ఈ సినిమా గురించి ఇలా చెప్పుకుంటూ పోతే చాట భారతం అవుద్ది. తిట్టాలంటే పదాలు రావు, రాయాలంటే పేజీలు చాలవు. థియేటర్ లో ప్రేక్షకుడ్ని ఊచకోత కోసింది ఈ సినిమా. ఇంటర్వెల్ తర్వాత సగం మంది జంప్ అయ్యారంటే పరిస్థితి ఎంత దారుణాతి దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఈ సినిమాలో ఓ డైలాగ్ ఉంది. "నీ కథలో బొక్క ఉందా.. లేదంటే నీ కథే బొక్క" అని అడుగుతాడు ఓ హీరో. ఈ సినిమా చూసిన తర్వాత ఇదే డైలాగ్ మళ్లీమళ్లీ చెప్పాలనిపిస్తుంది. అసలు రాఘవేంద్రరావుకు ఎందుకు ఇలాంటి సినిమాలు తీయాలనిపిస్తోంది. శతాధిక చిత్రాలు తీసి, ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చి చరిత్ర సృష్టించిన దర్శకేంద్రుడికి ఎందుకీ తిప్పలు? పోనీ రాఘవేంద్రరావు అంటే ప్రేమతో, గౌరవంతో, భక్తితో.. ఆయన పేరును సమర్పించుకున్నారని సర్దుకుందామనుకున్నా.. ఎండ్ టైటిల్స్ లో సెట్స్ లో రాఘవేంద్రరావు గారి దర్శనభాగ్యం. ఆయన దర్శకత్వం చేస్తున్న విజువల్స్, సూచనలిస్తున్న దృశ్యాలు కనులారా కనిపిస్తాయి. కాబట్టి ఈ టార్చర్ లో దర్శకేంద్రుడికి కూడా అగ్రభాగం ఇవ్వాల్సిందే.

మొన్నటికిమొన్న పెళ్లిసందD అనే సినిమాను సమర్పించుకున్నారు రాఘవేంద్రరావు. అది కూడా రొటీన్ రొట్ట సినిమా. అయినప్పటికీ అందులో చెప్పుకోవడానికి శ్రీలీల లాంటి గ్లామరస్ బ్యూటీ ఉంది. కీరవాణి పాటలు ఉన్నాయి. ఈ పండుగాడ్ లో అలా వెతికి తృప్తిపడదామంటే ఒక్క ఎలిమెంట్ కూడా కనిపించదు. అనసూయను గ్లామర్ డాల్ గా చూపించడానికి దర్శకుడు శ్రీధర్ సీపాన పడిన తపన, కృషి, పట్టుదల చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అదే సినిమాలో ఉన్న మరో హీరోయిన్ పైన ఆ కృషి పెట్టినా బాగుండేదేమో. అన్నట్టు అనసూయకు ఈ సినిమాలో సోలో సాంగ్ కూడా దక్కింది.

ఇక రాఘవేంద్రరావు మార్క్ సినిమాలో అడుగడుగునా కనిపిస్తుంది. హీరోయిన్ల తొడలు కనిపించేలా క్లోజ్ ఫ్రేమ్స్, బొడ్డుపై బత్తాయిలు ఎగరేయడం, రంగురంగుల డ్రెస్సులు, గాల్లో మిరుమిట్లుగొలిపే రంగులు చల్లడం.. ఇలా రాఘవేంద్రరావు చమక్కులన్నీ ఇందులో ఉన్నాయి. కాకపోతే అన్నీ నాన్-సింక్.

పోనీ ఇవన్నీ పక్కనపెట్టి కామెడీ ఎంజాయ్ చేద్దామంటే ఎడారిలో బిస్లరీ బాటిల్ కోసం వెదికినట్టే ఉంటుంది పరిస్థితి. టాలీవుడ్ లో ప్రస్తుతం లీడింగ్ లో ఉన్న హాస్యనటులంతా ఇందులో ఉన్నారు. కానీ ఒక్కరి కామెడీ కూడా పేల్లేదు. ఈ సొంపుకు హాస్యబ్రహ్మ బ్రహ్మానందాన్ని కూడా వాడారు. బ్రహ్మానందం స్థాయిని తగ్గించేలా కామెడీ సీన్లు పెట్టారు. ప్రతి సీన్ లో ఓ కమెడియన్ ను పెట్టేస్తే, ప్రేక్షకులు తమంతట తామే నవ్వుకుంటారనే ఆలోచనతో ఇంతమందిని పెట్టినట్టుంది. పైగా సన్నివేశాల మధ్య పొంతన, లింక్ ఉండదు. వరుసగా కామెడీ సీన్లు తీసేసి, పేర్చుకుంటూ పోయారు.

ఇప్పుడు కథ గురించి చెప్పుకుందాం. పండుగాడు (సునీల్) ఓ భయంకరమైన నేరస్తుడు. జైలు నుంచి తప్పించుకొని అడవిలోకి పారిపోతాడు. అతడ్ని పట్టుకుంటే కోటి రూపాయలు బహుమతి ప్రకటిస్తారు. డబ్బు అవసరం ఉన్న అనసూయ, వెన్నెల కిషోర్, 30 ఇయర్స్ పృధ్వి, శ్రీనివాసరెడ్డి, సప్తగిరి, సుడిగాలి సుధీర్ లాంటోళ్లంతా వెంటపడతారు. వీళ్లంతా పండుగాడ్ని పట్టుకున్నారా లేదా.. ఈ క్రమంలో వాళ్లు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారనేది ఈ సినిమా స్టోరీ.

జనార్థన మహర్షి రాసుకున్న కథ ఇది. దీనికి స్క్రీన్ ప్లే కూడా ఆయనే సమకూర్చారు. పనిలోపనిగా మాటలు కూడా అందించారు. శ్రీధర్ సీపాన దర్శకత్వం వహించారు. వీళ్లిద్దరూ కలిసి తీసిన ఈ సినిమాను రాఘవేంద్రరావు సమర్పించారు. ఇటు దర్శకుడు, అటు రచయిత ఇద్దరూ కలిసి పాతికేళ్ల కిందటి కామెడీ ఫార్మాట్ ను పట్టుకొచ్చారు. ఇలాంటి ముతక కామెడీ, ఈ కాలం వర్కవుట్ అవుతుందా అవ్వదా అనే ఆలోచన కూడా చేయకుండా సినిమా తీశారు. అసలే చాలా వీక్ స్టోరీ. అలాంటి స్టోరీకి మంచి కామెడీ సన్నివేశాలు రాయకుండా, పైపైన అలా సీన్స్ రాసుకుంటూ వెళ్లారు. ఒక్కో పాత్రకు ఒక్కో కమెడియన్ ను తీసుకున్నాం కాబట్టి, సెట్స్ లో వాళ్లే ఇంప్రొవైజ్ చేసుకొని ఏదో ఒక డైలాగ్ చెప్పేస్తారు అన్నట్టు మాటలు రాసుకున్నారు. దీనికి తోడు తీసుకున్న ప్రతి నటుడికి తెరపై స్థానం కల్పించేందుకు లేనిపోని సీన్లు అన్నింటినీ తీసి పెట్టారు. లాజిక్స్ లేకుండా, ఆర్డర్ తో సంబంధం లేకుండా సన్నివేశాలు వచ్చిపోతుంటాయి.

నటీనటుల పనితీరు విషయానికొస్తే.. ఒక్కో నటుడి గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవడం అనవసరం. ఎవరికి తోచినట్టు వాళ్లు నటించి మమ అనిపించారు. ఒక్క జోకు పేలలేదు. ఒక్క సీన్ పండలేదు. టెక్నికల్ గా కూడా అంతే. సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అస్సలు బాగాలేదు. ఆర్ట్ వర్క్ దారుణం. సినిమాటోగ్రఫీ ఓకే. ఎడిటర్ తమ్మిరాజు అని టైటిల్స్ లో వేశారు కానీ అసలు ఈ సినిమాకు ఎడిటర్ తో పని లేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఓవరాల్ గా పండుగాడ్ సినిమా థియేటర్లలో ప్రేక్షకుడికి చుక్కలు చూపిస్తుంది. పాతకాలానికి చెందిన సి-గ్రేడ్ కామెడీని ఇష్టపడే వాళ్లకు ఇది ఓ మోస్తరుగా నచ్చే అవకాశం ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది పండుగాడ్ కాదు, పండురాడ్.

Next Story