Telugu Global
MOVIE REVIEWS

Laththi Movie Review: 'లాఠీ'- మూవీ రివ్యూ!

Vishal's Laththi Movie Review: పోలీస్ లాఠీ అంటే ఏంటో పవర్ఫుల్ గా చూపించిన ఈ సినిమా ముందు విశాల్ ‘లాఠీ’ ఏ స్థానంలో నిలబడుతుందనేది ప్రశ్న. దీనికి సమాధానం ఏం చెబుతుందో, ఈ కొత్త దర్శకుడు ఏం కొత్త పోలీసు కథ చెప్పాడో వివరాల్లోకి వెళ్ళి చూద్దాం.

Laththi Movie Review: ‘లాఠీ’- మూవీ రివ్యూ!
X

Laththi Movie Review: ‘లాఠీ’- మూవీ రివ్యూ!

చిత్రం : లాఠీ

రచన -దర్శకత్వం : ఎ వినోద్ కుమార్

తారాగణం: విశాల్, సునైనా, ప్రభు, రమణ, తలైవాసల్ విజయ్, మునిష్కాంత్ తదితరులు

సంగీతం: యువన్ శంకర్ రాజా, ఛాయాగ్రహణం : బాలసుబ్రమణ్యం

బ్యానర్: రానా ప్రొడక్షన్స్

నిర్మాతలు: రమణ, నంద

విడుదల : డిసెంబర్ 22, 2022

రేటింగ్ : 1.75/5


తమిళంలో విశాల్ సినిమాలంటేనే యాక్షన్ సినిమాలు. తెలుగులో మార్కెట్ వుండడంతో డబ్బింగ్స్ విడుదలవుతూంటాయి. గత ఫిబ్రవరిలో విడుదలైన 'సామాన్యుడు' కూడా సక్సెస్ కాలేదు. కారణం విశాల్ సినిమాలన్నీ విషయపరంగా ఒకేలా వుంటాయి. ఆ విషయం పాతబడి వుంటుంది. ఇదే ధోరణిని కొనసాగిస్తూ 'లాఠీ' కూడా విడుదలైంది. 30 ఏళ్ళ క్రితం ప్రసిద్ధ నిర్మాత ఎంఎస్ రాజు, దర్శకుడు గుణశేఖర్ కి తొలి అవకాశమిచ్చి తమిళ హీరో ప్రశాంత్, తమిళ విలన్ రఘువరన్ లతో తెలుగులో 'లాఠీ' అని తీస్తే మంచి హిట్టయ్యింది. ఉత్తమ తొలి సినిమా దర్శకుడుగా గుణశేఖర్ కి నంది అవార్డు కూడా లభించింది. మరో రెండు అవార్డులు ఎడిటర్ కి, కెమెరా మాన్ కీ లభించాయి. పోలీస్ లాఠీ అంటే ఏంటో పవర్ఫుల్ గా చూపించిన ఈ సినిమా ముందు విశాల్ 'లాఠీ' ఏ స్థానంలో నిలబడుతుందనేది ప్రశ్న. దీనికి సమాధానం ఏం చెబుతుందో, ఈ కొత్త దర్శకుడు ఏం కొత్త పోలీసు కథ చెప్పాడో వివరాల్లోకి వెళ్ళి చూద్దాం...

కథ

మురళీ కృష్ణ (విశాల్) ఒక కానిస్టేబుల్. అతడికి భార్య కవిత (సునైనా), కొడుకూ వుంటారు. ఆనందమయ జీవితం గడుపుతూంటాడు. ఓ రోజు డ్యూటీలో భాగంగా ఒకడ్ని లాఠీ పెట్టి విపరీతంగా కొట్టి సస్పెండ్ అయిపోతాడు. కొన్నాళ్ళ తర్వాత డిఐజి కమల్ (ప్రభు) మంచి తనం వల్ల ఉద్యోగంలో చేరతాడు. ఇంకో రోజు డాన్ సూరా (సన్నీ పిఎన్) కొడుకు వీర (రమణ) డిఐజి కమల్ కూతుర్ని వేధిస్తాడు. దీంతో డిఐజి కమల్ వాడ్ని కిడ్నాప్ చేసి లాకప్ లో వేసి, మురళీ కృష్ణని పిలిచి లాఠీ పెట్టి బాగా విరగదీయమని ఆదేశిస్తాడు. వీర ఎవరో తెలియని మురళీ కృష్ణ వీరని లాఠీ పెట్టి బాగా విరగదీస్తాడు. కొడుకు వీరని రాజకీయ ప్రవేశం చేయించాలని ప్రయత్నాల్లో వుంటాడు సూరా. లాకప్ లో వొళ్ళు హూనమయ్యేసరికి మురళీ కృష్ణ మీద పగబడతాడు. ఈ క్రమంలో మురళీ కృష్ణ ఒంటరిగా తననీ, తన కుటుంబాన్నీ ఎలా కాపాడుకున్నాడన్నది మిగతా కథ.

ఎలా వుంది కథ

ఇంకో విశాల్ బ్రాండ్ పాత మోడల్ కథే. పోలీసు కానిస్టేబుల్, డిఐజి కూతురు, డాన్, డాన్ కొడుకు వంటి మూస ఫార్ములా పాత్రలతో; డిఐజి కూతుర్ని డాన్ కొడుకు వేధిస్తే, కానిస్టేబుల్ కొట్టడం, కానిస్టేబుల్ మీద డాన్ పగబట్టడం వంటి పాత మూస కథనం తోడై సినిమా ప్రాణం తీసింది. నేటి కాలానికి సరిపడే ఓ మార్కెట్ య్యాస్పెక్ట్ గానీ, దానికి అనుగుణమైన క్రియేటివ్ యాస్పెక్ట్ గానీ కొత్త దర్శకుడికి తెలీక తను చూసిన పాత సినిమాలే సినిమా అనుకుని చుట్టేసినట్టుంది. ఫలితంగా ఈ కథకి కనీస బాక్సాఫీసు అప్పీల్ గానీ, యూత్ అప్పీల్ గానీ కానరాకుండా పోయాయి. ఇందులో ఫ్యామిలీ సెంటిమెంటు జోడించి ఎమోషన్లు పెంచాలనుకున్నాడు. ఆ పాత ఫ్యామిలీ కథ కూడా ఎమోషన్లు పెరిగేంతగా లేకపోవడంతో పూర్తిగా విశాల్ చేజారిపోయి- బి గ్రేడ్ మాస్ ప్రేక్షకుల సినిమాగా మిగిలింది.

ఫస్టాఫ్ విశాల్ ఉద్యోగం పోగొట్టుకున్న జీవితం, భార్యతో కొడుకుతో కుటుంబ కష్టాలు, డాన్ కొడుకుని కొట్టడంతో ఆ కష్టాలు మరింత పెరిగి సెకండాఫ్ కి రంగం సిద్ధం కావడం జరిగి, సెకండాఫ్ లో పగబట్టిన డాన్ తో పోరాటం సాగి సాగి- కొడుకు కిడ్నాప్ తో ఓ భవనంలో బందీ అయిపోతుంది కథ. అక్కడ 45 నిమిషాలూ ఇంకా సాగదీసిన కథతో యాక్షన్ క్లయిమాక్స్, ముగింపూ.

చివరి 45 నిమిషాలు యాక్షన్ నిలబడిందా అంటే, భవనంలో అక్కడక్కడే కొట్టుకుంటూ సహనాన్ని పరీక్షిస్తుంది. ఎంతకీ ముగియని క్లయిమాక్స్ ప్రేక్షకుల మీద లాఠీ చార్జి లా వుంటుంది. గాయాలతో బయటపడేసరికి రెండున్నర గంటలు గడిచిపోతాయి. కథకి లాజిక్ కూడా వుండదు. తన అవసరానికి కానిస్టేబుల్ ని ఉపయోగించుకున్న డిజిపి, అదే విలన్ తో ప్రమాదంలో పడితే కనిపించకుండా పోతాడు డిజిపి. ఇది కానిస్టేబుల్ ఒంటరి పోరాటం చేసే కథ కాబట్టి డిపార్ట్ మెంట్ అతడ్ని అతడి ఖర్మానికి వదిలేయా

లన్నట్టు మాయమైపోతారు. ఇలా విశాల్ ఆఖరికి ఇలాటి సినిమాతో లాఠీ చార్జి కూడా చేశాక, ఇలాటి సినిమా ఇదే చివరిదవుతుందా, లేక ఉరికంబం ఎక్కించే ఇంకో సినిమా వస్తుందా చూడాలి.

నటనలు- సాంకేతికాలు

విశాల్ నిజాయితీగా కష్టపడ్డాడు. సామాన్య కానిస్టేబుల్ పాత్రలో సహజత్వంతో ఇమిడిపోయేందుకు ప్రయత్నించాడు. ఉద్యోగం పట్ల నిబద్ధత వరకూ ఓకే, కానీ ఫ్యామిలీ సీన్లు సరిగ్గా లేక పాత్రతో బాటు నటన కుదర్లేదు. యాక్షన్ సీన్స్ లో మాత్రం విజృంభించాడు. రిస్కు తీసుకుని కొన్ని యాక్షన్ బిట్స్ నటించాడు. యాక్షన్ డైరెక్టర్ పీటర్ హెయిన్స్ చాలా కాలం తర్వాత తన స్కిల్స్ చూపించాడు. 45 నిమిషాల యాక్షన్ సీన్స్ కరువుదీరా కంపోజ్ చేశాడు.

కవితా పాత్రలో సునైనా ఫర్వాలేదు. ఎక్కువ కనపడని పాత్ర. క్లయిమాక్స్ కొడుకు పాత్రలో చైల్డ్ ఆర్టిస్టు చుట్టూ వుంటుంది. భయం, ఏడుపు వగైరా బాగా నటించాడు. ఇక నాటు విలన్ గా సన్నీ, అతడి నాటు కొడుకుగా రమణ క్రూడ్ గా నటించారు.

సాంకేతికంగా బాగా ఖర్చుపెట్టారు. కానీ కొత్త దర్శకుడు వినోద్ కుమార్ అరిగిపోయిన పాత కథని దాదాపు రెండు గంటలు బలహీన దర్శకత్వంతో ఎలాగో క్లయిమాక్స్ కి చేర్చి, సినిమాని విశాల్ - పీటర్ హెయిన్స్ చేతుల్లో పెట్టేశాడు. వీళ్ళిద్దరూ ప్రేక్షకుల మీద లాఠీ చార్జి చేశారు!

First Published:  23 Dec 2022 4:12 AM GMT
Next Story