Telugu Global
MOVIE REVIEWS

Bichagadu 2 Movie Review: బిచ్చగాడు 2 మూవీ రివ్యూ {2/5}

Bichagadu 2 Movie Review: విజ‌య్ ఆంటోనీ హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన బిచ్చ‌గాడు -2 మూవీ ఎలా ఉందంటే.

బిచ్చగాడు 2 మూవీ రివ్యూ
X

బిచ్చగాడు 2 మూవీ రివ్యూ

చిత్రం: బిచ్చగాడు 2

దర్శకత్వం : విజయ్ ఆంటోనీ

తారాగణం : విజయ్ ఆంటోనీ, కావ్యా థాపర్, రాధా రవి, వైజీ మహేంద్రన్, మన్సూర్ అలీ ఖాన్, హరీష్ పేరడి తదితరులు

రచన : విజయ్ ఆంటోనీ, కె పళని, పాల్ ఆంటోనీ

సంగీతం : విజయ్ ఆంటోనీ

ఛాయా గ్రహణం : ఓం నారాయణ్

బ్యానర్ : విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్

నిర్మాత : ఫాతిమా విజయ్ ఆంటోనీ

విడుదల : మే 19, 2023

రేటింగ్: 2/5

2016 లో ‘పిచైక్కారన్’ (బిచ్చగాడు) విజయం తర్వాత , 2020లో తమిళ స్టార్ విజయ్ ఆంటోనీ దీనికి సీక్వెల్ చేయడానికి ప్లాన్ చేసి ‘పిచైక్కారన్’ దర్శకుడు శశిని దర్శకత్వం వహించమని కోరాడు. అయితే శశి ఇతర సినిమాలతో బిజీగా వుండడంతో కుదరలేదు. దీంతో విజయ్ ఆంటోనీ దర్శకురాలు ప్రియాకృష్ణ స్వామిని కోరాడు. ఆమె ఒప్పుకుని తర్వాత తప్పుకుంది. ఇక విజయ్ ఆంటోనీ దర్శకుడు ఆనంద కృష్ణన్ ని కోరాడు. అతను కూడా తిరస్కరించడంతో ఇక తప్పక విజయ్ ఆంటోనీ తానే త్రిపాత్రాభినయం చేయడానికి సిద్ధపడ్డాడు : సినిమాలో నటించడానికి ద్విపాత్రాభినయం- సినిమా తీయడానికి దర్శకత్వ పాత్ర. ఇక షూటింగ్ లో పాట చిత్రీకరిస్తున్నప్పుడు తనూ, హీరోయిన్ కావ్యా థాపర్ తీవ్రంగా గాయపడ్డారు. ఇంతలో ‘పిచైక్కారన్ 2’ కథ తన కథ నుంచి కాపీ కొట్టారని ఒక రచయిత కోర్టు కెక్కాడు. ఇలా మళ్ళీ ఇంకో బిచ్చగాడి కథ చెప్పడానికి ఇన్ని కష్టాలు గట్టెక్కిన విజయ్ ఆంటోనీ సినిమాతో ఏమిచ్చాడో చూద్దాం...

కథ

విజయ్ గురుమూర్తి (విజయ్ ఆంటోని) ఓ పెద్ద వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి. అతను హేమ (కావ్య థాపర్) ని ప్రేమిస్తాడు. అతడి అపార సంపద మీద సీఈఓ (దేవ్ గిల్), ఒక డాక్టర్ (హరీష్ పేరడి), ఇంకొక అసోషియేట్ (జాన్ విజయ్) కన్నేస్తారు. దుబాయ్ లో ఒక సైంటిస్టు మెదడు మార్పిడి శస్త్ర చికిత్స గురించి ప్రకటించింది చూసి, అతడ్ని సంప్రదిస్తారు. విజయ్ మెదడుని ఇంకొకడి మెదడుతో మార్పిడి చేసి, విజయ్ ని తమ చెప్పుచేతల్లోకి తెచ్చుకోవాలని సైంటిస్టుతో పథకం రచిస్తారు.

సత్య (విజయ్ ఆంటోనీ) అనే ఒక బిచ్చగాడుంటాడు. చిన్నప్పుడు తల్లిదండ్రుల్ని కోల్పోయి బిచ్చమెత్తుకుని చెల్లెల్ని పోషిస్తూంటే, ఒక ముఠా చెల్లెల్ని ఎత్తుకుపోతుంది. ఈ క్రమంలో సత్య ఒకడ్ని చంపి 20 ఏళ్ళు జైలుకి పోతాడు. జైలునుంచి విడుదలై చెల్లెలి అన్వేషణలో వుంటాడు. ఈ సత్య దుష్టత్రయం కంటబడేసరికి- విజయ్ లాగే వున్న సత్య మెదడుని విజయ్ కి మార్పించేసి సత్యని చంపి పారేస్తారు.

ఇప్పుడు సత్య మెదడుతో వున్న విజయ్ సత్యలాగా బిహేవ్ చేస్తూ దుష్టత్రయం మాట వినడు. అతడికి సంపద మీద ఆసక్తి వుండదు. చెల్లెలి అన్వేషణే జీవిత లక్ష్యంగా వుంటాడు. ఈ నేపథ్యంలో దుష్టత్రయంతో ఎలాటి సమస్య లొచ్చాయి? తను విజయ్ కాదు సత్య అన్న గుట్టు రట్టయితే ఏం జరిగింది? చెల్లెలు ఎప్పుడు ఎలా దొరికింది? ఈ ప్రశ్నలకి సమాధానాలు మిగతా సినిమాలో.

ఎలావుంది కథ

‘బిచ్చగాడు’ లో కోమాలో వున్న తల్లిని బతికించుకోవాలంటే సంపన్నుడైన కొడుకు నెల రోజులు బిచ్చగాడిగా బతకాలన్న సాధువు మాటతో, ఒక మదర్ సెంటిమెంటు హిట్ సినిమా చూశాం. హైదరాబాద్ లో రోజూ 4 ఆటలతో 50 రోజులకి పైగా హౌస్ ఫుల్స్ ఆడింది. ‘బిచ్చగాడు’ తో బయ్యర్లు రిచ్ అయ్యారు. ఇప్పుడు ‘బిచ్చగాడు 2’ లో చెల్లెలు దొరకాలంటే పేదలకి సాయపడాలన్న సీనియర్ బిచ్చగాడి మాటతో, చెల్లెలి సెంటిమెంటు సినిమా చూస్తాం. ఇది సెకండాఫ్ లో వచ్చే కథ.

ఫస్టాఫ్ లో మెదడు మార్పిడి కథ వుంటుంది. మెదడుని మార్చడమేనేది ఇప్పట్లో సాధ్యమయ్యే ప్రక్రియ కాదని నిపుణులు చెప్తున్నా- సినిమాకి వినోద ఫాంటసీగా ఇది చెల్లిపోతుందనుకో వచ్చు. హాలీవుడ్ లో ఇలాటి సినిమాలు కొన్ని వచ్చాయి. ఒక ఫ్రెంచి సినిమా కూడా వుంది – ‘ది మాన్ విత్ ది ట్రాన్స్ ప్లాంటెడ్ బ్రెయిన్’ లో బ్రెయిన్ స్పెషలిస్టుకి గుండె జబ్బుతో చనిపోయే పరిస్థితి వస్తుంది. దీంతో తన బ్రెయిన్ ని కారు రేసుల్లో బ్రెయిన్ దిబ్బతిన్న 23 ఏళ్ళ రేసర్ కి అమర్చమని కోరతాడు.

ఐతే ‘బిచ్చగాడు 2’ తో వచ్చిన సమస్య ఏమిటంటే, విజయ్- సత్య ఒకలాగే వున్నప్పుడు బ్రెయిన్ మార్చాల్సిన పనేముంది? విజయ్ స్థానంలో సత్యని ప్రవేశపెడితే సరిపోయే ఫార్ములా వుండగా? కనుక ఫస్టాఫ్ లో కాసేపటికి ఈ బ్రెయిన్ మార్పిడి కథ అర్ధాన్ని కోల్పోతుంది. అలాగే ఇదంతా కాకుండా, కంపెనీల సర్వర్స్ ని హ్యాకింగ్ చేసి, డేటాని ఇంక్రిప్ట్ చేసి పట్టుకుని బెదిరిస్తే, డబ్బే డబ్బు వచ్చేస్తుంది విలన్స్ కి. ఇలాకాక సంపద దోపిడీకి నాటకీయత కోసం సత్య మెదడుగల విజయ్ ని ఇంట్లోకి ప్రవేశ పెట్టినా, ఆ నాటకీయత కూడా లేకుండా పోయింది. పావుగంటలో ఇంటర్వెల్ కల్లా విలన్స్ ని చంపేసి ఫస్టాఫ్ కథ ముగించేస్తాడు.

సెకెండాఫ్ లో చెల్లెలి కోసం కథ మొదలవుతుంది. సత్య లక్ష్యం చెల్లెలే కాబట్టి సంపద మీద ఆసక్తి లేని తను ఇంటర్వెల్లో విలన్స్ ని చంపేశాడనుకో వచ్చు. ‘డబ్బు వద్దు, చెల్లెలే కావాలి’ అని విలన్స్ తో అంటాడు కూడా. అయితే సెకండాఫ్ లో ఆ విజయ్ డబ్బే తీసి వాడేస్తాడు సత్య. నీ చెల్లెలు దొరకాలంటే పేదలకి సాయపడమని సీనియర్ బిచ్చగాడు అనడంతో, ఆ విజయ్ కి చెందిన డబ్బుతో పేదలకి సాయపడతాడు సత్య. నైతికంగా ఇది కరెక్టేనా? ఇక ముగింపులో కోర్టు సీనులో ఎన్నో ప్రశ్నలు మిగిలిపోతాయి. మెదడు మార్పిడి విషయం కోర్టు దృష్టికే రాకుండా సత్యకి శిక్షపడుతుంది- విలన్స్ ని చంపిన కేసులో.

తనని చంపి తన మెదడు విజయ్ కి అమర్చారని చెప్పాల్సింది చెప్పడు సత్య. జరిగినవి మూడు హత్యలే కాదు, సత్య హత్యతో కలుపుకుని నాల్గు హత్యలు. చాలా చిక్కు ముడి కేసు ఇది. విలన్స్ ముగ్గురూ హత్యకి గురయ్యారంటే, వాళ్ళని సత్య మెదడుతో వున్న విజయ్ చంపినట్టా, లేక విజయ్ శరీరంతో వున్న సత్య చంపినట్టా? కోర్టు జుట్టు పీక్కోవాల్సిందే!

హిందీ ‘నెయిల్ పాలిష్’ (2021) లో, వీర్ సింగ్ మీద హత్య కేసు రుజువవుతుంది. కానీ అతను వీర్ సింగ్ కాడు. స్ప్లిట్ పర్సనాలిటీతో ఆడతనంతో చారు రైనా గా మారిన అమ్మాయి. ఇప్పుడు వీర్ సింగ్ లో వీర్ సింగ్ లేడు, చారూ రైనా వుంది గనుక, వీర్ సింగ్ చేసిన హత్యకి చారు రైనా కెలా శిక్ష వేస్తారు? జడ్జి పిచ్చెత్తి పోతాడు. ఈ కేసుని చాలా ఇంటలిజెంట్ గా సాల్వ్ చేస్తారు. ఇదే పరిస్థితి విజయ్ -సత్యలతో కూడా వుంది. కానీ దీన్ని పట్టించుకోకుండా ఏదో వంటా వార్పు తీర్పు చెప్పేశారు.

ఇక విలన్స్ ని చంపిన సత్య శవాల్ని మూటగట్టి సముద్రంలో పారేస్తాడు. ఆ శవాల్ని బయట పెట్టడానికి దర్శకుడు సముద్రంలో విమాన ప్రమాదాన్ని కల్పించాడు. ప్రయాణీకుల మృత దేహాల్ని గాలిస్తూంటే ఈ శవాలు దొరుకుతాయి. ఈ శవాలు జాలర్లకి దొరికినట్టుగా చూపిస్తే సరిపోయేది. విమాన ప్రమాదం చేసి ప్రయాణీకుల్ని చంపడం దేనికి?

ఇలా కథ మొత్తం అనేక లొసుగులతో వుంటుంది. చెల్లెలి సెంటిమెంటు కథ కాస్తా నేరాలు ఘోరాలు కథగా మారింది. పేదలకి చేసిన మేలుతో చివరికి చెల్లెలు కన్పిస్తే, భావోద్వేగాలు కట్టలు తెంచుకుంటాయి. అయితే చెల్లెలు ఇన్నాళ్ళూ ఎక్కడుందో ఏమిటో వివరం వుండదు.

నటనలు - సాంకేతికాలు

సంపన్నుడుగా, బిచ్చగాడుగా విజయ్ ఆంటోనీ బాగానే నటించాడు. అతను నటనలో ఫెయిల్ కాడు. ఈ సారి పాత్రల్ని కూడా ఫీలైతే ఇంకా బాగా నటించేవాడు. తను సత్య మెదడుతో వున్న విజయ్ అన్న వొక ఎవేర్నెస్ తో పాత్రలు నటించివుంటే- ఆ అంతర్ సంఘర్షణ వేరేగా వుండేది. ఇవి మాస్ పాత్రలే అయినా ఎంటర్ టైన్ చేయవు. సీరియస్ పాత్ర పోషణలే చేశాడు. ప్రారంభంలో తప్పితే హీరోయిన్ తో రొమాన్స్ కి కూడా అవకాశం లేదు. హీరోయిన్ కావ్యా థాపర్ రూపం శిల్పం బావున్నా పాత్ర అంతంత మాత్రం. పాటలో కాస్త ఎక్స్ పోజింగ్. విలన్లు ఓకే. ముఖ్య మంత్రి పాత్రని రాధారవి నటించాడు.

కథ, రచన, సంగీతం, ఎడిటింగ్, ద్విపాత్రాభినయం, దర్శకత్వం,నిర్మాణం ఇవన్నీ విజయ్ ఆంటోనీ ఖాతాలోకి పోతాయి. తొలిసారి అయినా అనుభవమున్న వాడిలా దర్శకత్వం వహించాడు. నిర్మాణ విలువలు బిచ్చగాడికి రిచ్ గా వున్నాయి.

చివరికేమిటి?

‘Money is injurious to the world’ (డబ్బు ప్రపంచానికి హానికరం) అని ఆరంభంలో వేశారు. ఏ ప్రపంచానికి హానికరం? చిన్నప్పట్నుంచీ అడుక్కుతింటున్న సత్య లాంటి వాళ్ళ ప్రపంచానికా? వైభోగాలు అనుభవిస్తున్న విజయ్ లాంటి వాళ్ళ ప్రపంచా

నికా? కొటేషన్ కీ కథకీ సంబంధం కన్పించదు. ఆర్ధిక మాంద్యంతో ప్రపంచం, ఆర్ధిక విధానాలతో దేశం కల్లోలంగా మారి ప్రజలు అలమటిస్తూంటే, డబ్బు ప్రపంచానికి హానికరమని నెగెటివ్ భావాలు ప్రసారం చేయడం అర్ధం లేనిది. ఏ సెంటిమెంటూ లేకుండా పదేపదే లక్ష్మిని రద్దు చేస్తున్న ప్రభుత్వంతో వంత పాడుతున్నట్టుంది కొటేషన్. ఇండియా అంటే ఇదే అన్నట్టు సినిమా నిండా కడుపాకలితో బిచ్చగాళ్ళ ఆర్తనాదాలూ, మురికి కూపాల్లో నివాసాలూ చూపిస్తూ డబ్బు ప్రపంచానికి హానికరమని చెప్తే, మరి దారిద్ర్యం ఆరోగ్యకరమా? అసలు ‘బిచ్చగాడు 2’ తో ఏం చెప్పాలనుకున్నాడో అర్ధంగాదు.Next Story