Telugu Global
MOVIE REVIEWS

Vaarasudu Review: ‘వారసుడు’ – రివ్యూ {2/5}

Vijay's Vaarasudu Movie Review: 2019 లో మహేష్ బాబుతో ‘మహర్షి’ తీసి జాతీయ అవార్డు అందుకున్న వంశీ పైడిపల్లి, ‘వారసుడు’ కోసం మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లని ప్రయత్నించి, చివరికి తమిళంలో విజయ్ కి సెటిలయ్యాడు నిర్మాత దిల్ రాజుతో.

Vaarasudu Review ‘వారసుడు’ – రివ్యూ
X

Vaarasudu Review ‘వారసుడు’ – రివ్యూ 

చిత్రం: వారసుడు

రచన- దర్శకత్వం : వంశీ పైడిపల్లి

తారాగణం : విజయ్, రశ్మికా మందన్న, జయసుధ, సంగీత, సంయుక్త, నందిని, సంయుక్త, సంజన, శరత్ కుమార్, ప్రభు, ప్రకాష్ రాజ్, ఎస్ జె సూర్య, సుమన్, శ్రీకాంత్, శ్యామ్, యోగిబాబు తదితరులు

సంగీతం : తమన్, ఛాయాగ్రహణం : కార్తీక్ పళని

బ్యానర్ : శ్రీ వెంకటేశ్వరా క్రియెషన్స్

నిర్మాత : దిల్ రాజు

విడుదల : జనవరి 14, 2022

రేటింగ్ : 2/5

ఇళయ దళపతి విజయ్ (జోసెఫ్ విజయ్ చంద్ర శేఖర్) తెలుగు ప్రేక్షకులకి చిరపరిచితుడైన తమిళ స్టార్. గత ‘బీస్ట్’ ఫ్లాప్ తర్వాత ఫ్యామిలీ సినిమా చేపట్టి సంక్రాంతి సినిమాల పోటీలో తనూ ఒకడుగా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. 2019 లో మహేష్ బాబుతో ‘మహర్షి’ తీసి జాతీయ అవార్డు అందుకున్న వంశీ పైడిపల్లి, ‘వారసుడు’ కోసం మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లని ప్రయత్నించి, చివరికి తమిళంలో విజయ్ కి సెటిలయ్యాడు నిర్మాత దిల్ రాజుతో.

టైటిల్ చూస్తేనే సినిమా ఏమిటో, ఎలా వుంటుందో తెలిసిపోయే ఈ సినిమా గురించి ఇంకా తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్ళాలి...

కథ

ప్రముఖ వ్యాపారవేత్త రాజేంద్ర (శరత్ కుమార్) చిన్న కుమారుడు విజయ్ (విజయ్) ఫుడ్ డెలివరీ స్టార్టప్‌ని ప్రారంభించాలని నిర్ణయించుకుని, కుటుంబ వ్యాపారంలో చేరడానికి ఒప్పుకోక పోవడంతో తండ్రి బహిష్కరిస్తాడు. ఏడేళ్ళ తర్వాత తనకి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వున్నట్టు తెలుసుకున్న తండ్రి, తన పుట్టిన రోజుకి కంపెనీ వారసత్వాన్ని ప్రకటించాలని నిర్ణయించుకుంటాడు. తల్లి సుధ (జయసుధ) ప్రోద్బలంతో తండ్రి పుట్టిన రోజు వేడుకకి ఇంటికి తిరిగి వచ్చిన విజయ్ కి కుటుంబం అస్తవ్యస్తంగా వుందని తెలుస్తుంది. పెద్దన్న జై (శ్రీకాంత్) వేరే అమ్మాయి (నందిని) తో సంబంధం పెట్టుకుని భార్య ఆర్తి (సంగీత) ని ఇబ్బంది పెడుతూంటాడు. చిన్నన్న అజయ్ (శ్యామ్) తండ్రి వ్యాపార ప్రత్యర్ధి జేపీ (సుమన్) బ్లాక్ మెయిల్ కి లొంగి కంపెనీ రహస్యాల్ని లీక్ చేస్తూంటాడు. అన్నలిద్దరూ కంపెనీ ఛైర్మన్ పోస్టు కోసం ఒకరికొకరు శత్రువులవుతారు.

ఈ పరిస్థితుల్లో విజయ్ వదిన చెల్లెలు దివ్య (రశ్మికా మందన్న) తో ప్రేమలో పడతాడు. తండ్రి పుట్టిన రోజు వేడుకలో విజయ్ అన్నలిద్దరి బండారం బయటపెట్టేసరికి కలవరపడ్డ తండ్రి విజయ్ నే కంపెనీ బాధ్యతలు చేపట్టమని కోరుతాడు. మొదట అంగీకరించని విజయ్ తర్వాత ఒప్పుకుని కంపెనీ ఛైర్మన్ అవడంతో అన్నలిద్దరూ భగ్గు మంటారు.

ఇప్పుడు బాధ్యతలు చేపట్టిన విజయ్ అన్నల్నీ, ప్రత్యర్ధినీ దారికి తెచ్చి, కుటుంబాన్నీ, కంపెనీనీ ఎలా కాపాడాడన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

అస్తవ్యస్తంగా వున్న కుటుంబాన్నీ వ్యాపారాన్నీ ఛీత్కారాలకి గురయ్యే చిన్నకొడుకు చక్కదిద్దే కథలు టైమ్ ట్రావెల్ చేయించి 1980 ల పూర్వం సినిమాల్ని చూపిస్తాయి. ఆ సినిమాల్లో బంధుత్వాలు, బాధలు, మానసిక సంఘర్షణలు ఇప్పుడూ కుటుంబాలు ఎదుర్కొంటున్నవే అయివుంటాయి. ‘వివాహబంధం’ (1964) లోని సూర్యకాంతంలు ఇప్పుడూ వున్నారు. ఎన్టీఆర్ లు, భానుమతులు ఇప్పటికీ వున్నారు. ఈ సినిమాలు చూసి ఇవి కదా కథలూ అంటున్నారు ఇప్పటి తరం. యూట్యూబ్ లో ఏ పాత సినిమా చూసినా లక్షల్లో వ్యూస్ వుంటాయి. యువతరం కామెంట్స్ వుంటాయి. ఇప్పటి సినిమాలకి దూరమవుతున్నట్టు వాటి అర్ధాలుంటాయి.

ఫ్యామిలీ డ్రామా అనేది ఎప్పటికైనా యూనివర్సల్ అప్పీలున్న జానర్. కానీ ఆ విలువల్ని పోషించలేక కేవలం హీరోయిజాలతో సినిమాలు చుట్టేస్తున్నారు. అంతా ఫిజిక్సే వుంటుంది. అనుబంధాల కెమిస్ట్రీ వుండదు. చాలా అలసత్వంతో కనీసం నేపథ్యాలనైనా మార్చకుండా పాత సినిమాల అదే సెటప్ లో నేటి కొత్త ఫ్యామిలీ సినిమాలు చూపించేస్తున్నారు. ఇప్పటి కార్పొరేట్ అధిపతుల్ని చూస్తే క్రమబద్ధంగా కుటుంబం కొనసాగడానికి లండన్ వంటి చోట్ల కుటుంబ రాజ్యాంగాన్ని రాయించుకుంటున్నారు. ఆ రాజ్యాంగం ప్రకారం కుటుంబ సభ్యుల బాధ్యతలు, హక్కులు వుంటాయి.

కానీ ‘వారసుడు’ లాంటి సినిమాలు ఇంకా పాత సినిమాల్లో కుటుంబ, వ్యాపార కథల్నే టెంప్లెట్ గా చేసుకుని నేటి కాలానికి వడ్డిస్తున్నారు. ఇవైనా సరైన కుటుంబ బంధాల సెంటిమెంట్లతో, ఎమోషన్లతో, పాత్ర చిత్రణలతో వుండవు. ఇతర పాత్రల్ని డమ్మీలుగా చేసి కేవలం హీరో స్టామినా, స్వాగ్, ఎనర్జీ అంటూ హాస్యాస్పదమైన సుప్రమసీ చూపించి ఫ్యామిలీ సినిమా అంటున్నారు. ఈ సినిమాలో విజయ్ పాత్ర ఇలాటిదే. మిగతా పాత్రలు డమ్మీలే. యాక్షన్ సినిమా టైపులో విజయ్ కి మూడు ఎలివేషన్స్ అంటూ కృత్రిమత్వం ఒకటి. ఇవన్నీ చేసి, సినిమాకి అవసరమైన సెంటిమెంటల్ డ్రామా, చివరంటా కొనగాగాల్సిన ఎమోషనల్ త్రెడ్ లేకుండా చేశారు.

సినిమా కూడా ఇదివరకు చూసిన సీన్లతోనే వుంది. ఈ సీన్లు వేగంలేక కుంటుతూ వుంటాయి. కళ్ళు మూసుకుని డైలాగులు వింటూంటే సినిమా మొత్తం అర్ధమైపోతుంది. అంటే రేడియో నాటకం. విజువల్ మీడియాని రేడియో నాటకంలా తీస్తున్నామని కూడా తెలుసుకోలేదు. ‘పండంటి కాపురం’లో ఎంతమంది తారాగణం వుంటారో అంత మంది తారాతోరణంతో వందేభారత్ స్పీడుతో లాగాలని చూశారు. విజయ్ కేవలం తన స్టయిల్ తో, స్వాగ్ తో, ఫ్యాన్ మూమెంట్స్ తో లాగలేక పోయాడు.

సుదీర్ఘంగా ఫస్టాఫ్ లో పైన చెప్పుకున్నట్టు విజయ్ కంపెనీ బాధ్యతలు చేపట్టాక, సెకండాఫ్ విజయ్ మీద కోపంతో అన్నలు బయటికి వెళ్ళిపోవడం, బయటనుంచి విజయ్ ని దింపాలని కుట్ర చేయడం, ఆ కుట్రల్లో తామే ఇరుక్కుంటే విజయ్ కాపాడ్డం, వేరే అమ్మాయితో అన్నవ్యవహారం చూసి వదిన విడాకులకి ప్రయత్నించడం, ఆమె కూతురిని వ్యభిచార ముఠా కిడ్నాప్ చేస్తే విజయ్ విడిపించడం, షేర్లు కొనేసి కంపెనీని హాస్టైల్ టేకోవర్ (ఎన్డీ టీవీని గౌతమ్ అదానీ కొనేసినట్టుగా) చేస్తున్న ప్రత్యర్ధిని చిత్తు చేయడం వంటి దృశ్యాలతో వెళ్ళి వెళ్ళి విజయ్ సౌజన్యంతో సుఖాంత మవుతుంది. ఈ కథంతా ముందు తెలిసిపోతూ వుంటుంది. ఏ డైలాగు వస్తుందో కూడా ప్రేక్షకులు చెప్పేస్తూంటారు.

నటనలు –సాంకేతికాలు

ఒక విషయం ఒప్పుకోవాలి. విజయ్ తన కామిక్ టైమింగ్ తో చేసిన కొన్ని ఫన్నీ సీన్స్ వున్నాయి- బోర్డ్ రూమ్ మీటింగులో సీను లాంటివి. ఇవి అక్కడక్కడా ఎంటర్ టైన్ చేస్తాయి. అదే సమయంలో కథలో (కుటుంబంలో) వున్న బాధని- విషాదాన్ని కూడా అతను అడ్రెస్ చేయాల్సింది చేయలేదు. కేవలం ఫన్నీ రైడ్ గా, కొన్ని ఫైట్స్ తో ఫ్యాన్స్ కోసం మాస్ యాక్షన్ గా చేసుకు పోవడంతో - కుటుంబ కథ వెనుక ఎక్కడో తప్పిపోయింది. కేవలం ఫీల్ లేని ముగింపు ఇచ్చాడు.

సాంగ్స్ బాగా చేశాడు. కథ కూడా బాగా చేస్తే బావుండేది. హీరోయిన్ రశ్మికా మందన్న గ్లామర్ మెరుపులతో పాటలకి పరిమితమయింది. పెద్దన్నగా శ్రీకాంత్, చిన్నన్నగా శ్యామ్, తల్లిగా జయసుధ, తండ్రిగా శరత్ కుమార్, ఇతర నటీనటులూ కేవలం డమ్మీలుగా మిగిలారు. డమ్మీల మీద ప్రకాష్ రాజ్ విలనీ బలవంతంగా రుద్దినట్టుంది. విజయ్ కాంబినేషన్ లో యోగిబాబు కామెడీ మాత్రం నవ్విస్తుంది.

తమన్ తో పాటల విషయంలో, కార్తీక్ పళని ఛాయాగ్రహణం విషయంలో వంశీ పైడిపల్లి, దిల్ రాజు మంచి శ్రద్ధ తీసుకున్నారు. విజయ్ స్టార్ డమ్ కి తగ్గట్టు ప్రొడక్షన్ విలువలున్నాయి. కానీ ఇలాటి చాదస్తపు ఔట్ డెటెడ్ కుటుంబ సినిమాలు దిల్ రాజు ఇంకెన్నాళ్ళు తీస్తారో అని బాధ.

Next Story