Telugu Global
MOVIE REVIEWS

Reporter Movie Review: ‘రిపోర్టర్’ – మూవీ రివ్యూ {2.5/5}

Trisha's Reporter Telugu Movie Review: తెలుగు ఆడియోతో కూడా వున్న ‘రాంగి’ తెలుగులో రిపోర్టర్ పేరుతో స్ట్రీమింగ్ అవుతోంది.

Reporter Movie Review: ‘రిపోర్టర్’ – మూవీ రివ్యూ
X

Reporter Movie Review: ‘రిపోర్టర్’ – మూవీ రివ్యూ

చిత్రం: రిపోర్టర్

రచన -దర్శకత్వం : శరవణన్

తారాగణం : త్రిష, అనస్వర రాజన్, అబ్దుమాలికోవ్ తదితరులు

కథ : ఏకే మురుగదాస్, సంగీతం : సి సత్య, ఛాయాగ్రహణం : కెఎ శక్తివేల్

బ్యానర్ : లైకా ప్రొడక్షన్స్

నిర్మాత : అల్లిరాజా సుభాస్కరన్

విడుదల : జనవరి 28, 2023 (నెట్ ఫ్లిక్స్)

రేటింగ్ 2.5/5


స్టార్ హీరోయిన్ త్రిష సినిమాల్లో 20 ఏళ్ళు పూర్తి చేసుకుంది. కొంత కాలంగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది. యాక్షన్, సస్పెన్స్ పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఇటీవల ‘పొన్నియిన్ సెల్వన్’ లో కీలక పాత్ర కూడా పోషించింది. తాజాగా ఆమె నటించిన తమిళ యాక్షన్ థ్రిల్లర్ ‘రాంగి’ ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. తెలుగు ఆడియోతో కూడా వున్న ‘రాంగి’ తెలుగులో రిపోర్టర్ పేరుతో స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి ప్రముఖ దర్శకుడు మురుగదాస్ కథ అందించాడు. శరవణన్ దర్శకత్వం వహించాడు. ప్రముఖ లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. ఇది టెర్రరిజం అంశంతో ఒక సున్నిత ప్రేమ కథ. నాణ్యత కోరుకునే ప్రేక్షకుల కోసం ఈ సినిమా ఎలా వుంటుందో చూద్దాం...

కథ

రుద్ర శివంగి (త్రిష) వెబ్ పత్రికలో పని చేసే రిపోర్టర్. అన్నావదినెలకి ఆమె సింహస్వప్నం. బయట కూడా అలాగే వుంటుంది. అన్న కూడా జర్నలిస్టే. అయితే జర్నలిజం తన తండ్రితోబాటే చచ్చిపోయిందని నమ్ముతుంది. ఈ రోజుల్లో రాజకీయ నాయకుల మధ్య గొడవలే తప్ప ప్రజా సమస్యల్ని రిపోర్టు చేసే వాళ్ళు లేరని కోపంతో వుంటుంది. ఒక రోజు ఆమె 16 ఏళ్ళ మేనకోడలు సుస్మిత (అనస్వర రాజన్) పేరు మీద నకిలీ ఫేస్ బుక్ ఖాతా ట్యునీషియాలోని ఉగ్రవాద సంస్థలో పనిచేస్తున్న ఆలీమ్ (అబ్దుమాలికోవ్) అనే కుర్రవాడితో కొనసాగుతోందని తెలుసుకుంటుంది. తనతో చాటింగ్ చేస్తోంది సుస్మితే అని నమ్మిన 17 ఏళ్ళ ఆలీమ్ ఆమెతో ప్రేమలో పడ్డాడు.

ఈ ఖాతాతో శివంగి తను చాటింగ్ చేస్తూ లొకేషన్ అడిగితే, అవతల ట్యూనీషియాలో మారణాయుధంతో కాపేసి వున్న ఆలీమ్, తానున్న లొకేషన్ పిక్ తీసి పోస్ట్ చేస్తాడు. పది నిమిషాల తర్వాత అటుగా వస్తున్న రెండు కార్లని పేల్చేస్తాడు. ఆ కార్లలో వున్నది ఇద్దరు అమెరికన్ నిపుణులు. వాళ్ళు లిబియాలో చమురు బావుల త్రవ్వకాల కోసం వచ్చారు. ఈ దాడితో ఎఫ్బీఐ అధికారులు రంగంలోకి దిగి శివంగిని ట్రేస్ చేసి వచ్చేసి పట్టుకుంటారు.

ఇప్పుడు శివంగి, సుస్మితల ద్వారా ఆలీమ్ ని పట్టుకోవాలనుకుంటున్న ఎఫ్బీఐ పథకంతో శివంగి రిస్కు తీసుకుని, సుస్మితని కూడా ఇందులోకి లాగి సహకరించిందా లేదా, ఆలీమ్ కి వ్యతిరేకంగా తను ఇలా చేయడానికి మనస్కరించిందా, వాళ్ళ దేశంలో ఆలీమ్ చేస్తున్న అగ్రరాజ్య వ్యతిరేక పోరాటానికి తను ఎమోషనల్ గా ఎలా కనెక్ట్ అయిందీ- చివరికేం చేసిందీ అన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

మురుగ దాస్ ఒక అద్భుతమైన కథ ఇచ్చాడు. లిబియా రాజకీయ పరిస్థితిని, అగ్రరాజ్యం చేతిలో ప్రజా సమస్యల్నీ నేపథ్యంగా చేసుకుని ఉత్తమ కథ అందించాడు. లిబియాలో కొత్త సోషలిస్టు రాజ్యాన్ని స్థాపించిన కల్నల్ గడాఫీ తమ దేశంలో చమురు అగ్రరాజ్యానికి అమ్మేది లేదన్నాడు. దీంతో కాలక్రమంలో అగ్రరాజ్యం ప్రజలతో తిరుగుబాటు జరిపించి, ప్రజల చేతే గడాఫీని చంపించింది. సాయుధ దళాలు ఎందరో ప్రజల్ని చంపి వాళ్ళ పిల్లల్ని ఎత్తుకుపోయారు. ఆ పిల్లలు టెర్రరిస్టులయ్యారు. ఆ టెర్రరిస్టుల్లో ఒకడు ఆలీమ్. అతను అగ్రరాజ్యం మీద కత్తి గట్టాడు. మా దేశంలో చమురు లేకపోతే మా నాయకుడికి, మాకూ మరణం వుండేది కాదు కదా- అన్న ఆక్రోశంతో పని చేస్తూంటాడు. ఫేస్ బుక్ తో సుస్మితతో ప్రేమలో పడడంతో అతను అమెరికా ఉచ్చులో పడ్డం ఈ కథ.

ఈ కథలో రిపోర్టర్ శివంగి మోరల్ డైలమా తీవ్ర అపరాధ భావానికి లోనుజేస్తుంది. ఆలీమ్ తో తను చాటింగ్ చేసి వుండకపోతే అతను బతికి వుండేవాడు కదా అన్న ఆవేదంనతో ఆమె చివరి ఏడ్పు వెండి తెరని పట్టి వూపేస్తుంది. కథ చాలా సింపుల్ గా వుంటూనే చాలా బలంగా వుంటుంది. చాటింగ్ తో సాగే ప్రేమ కథ కూడా క్లాస్ గా వుంటుంది. ఒక టెర్రరిజపు ప్రేమకథని సున్నితంగా చెప్పిన విధానమే ఈ సినిమా యూఎస్పీ.

నటనలు- సాంకేతికాలు

త్రిష టాప్ యాక్షన్. సమయస్ఫూర్తి గల రిపోర్టర్ పాత్రని సింపుల్ గా పోషించింది. ఆమె లేని సీను దాదాపు వుండదు. చివరి సీను మాత్రం ఆమెకి సిగ్నేచర్ సీను. పైకి ఎంత ఆవేశముంటుందో అంత నింపాదిగా, నిదానంగా కరెక్టు పని చేస్తుంది. టెర్రరిస్టుని పట్టివ్వాల్సిన విషమ పరిస్థితి నెదుర్కోవడం ఆమె పాత్రకి రియల్ సంఘర్షణ. మేనకోడల్ని తీసుకుని అమెరికా అధికారుల వెంట లిబియా వెళ్ళాల్సి రావడం ఆమె సంఘర్షణకి పరాకాష్ట. అన్నిటా ప్రభావశీలంగా నటించింది.

మేనకోడలి పాత్రలో అనశ్వర రాజన్ ది విచిత్ర పరిస్థితి. తన పేర ఫేక్ ఎఫ్బీ ఖాతా వున్నట్టూ, దాంతో కనెక్టయి టెర్రరిస్టు తనతో ప్రేమలో పడ్డట్టూ ఆమెకి తెలియదు. జరుగుతున్నదంతా ఏంటో, ఎందుకు లిబియా పోతోందో అస్సలు తెలియదు. ఈ అయోమయ అమాయకత్వాన్ని బాగా అర్ధం జేసుకుని పోషించింది.

ఇక ఆలీమ్ గా రష్యన్ నటుడు అబ్దుమాలికోవ్ టెర్రరిస్టు-కమ్- టీనేజి లవర్ పాత్రని, తన విషాదకర గతాన్నీ, ఆల్రెడీ ప్రతిభగల నటుడు కాబట్టి వాటితో కథని నిలబెట్టాడు. తన సీమాంతర ప్రేమ కోసం తల్లడిల్లడం, ప్రేమిస్తున్న అమ్మాయిని చివరి క్షణాల్లో చూడడం వంటి ఉద్విగ్నభరిత సన్నివేశాలు అతడ్ని గుర్తుంచుకునేలా చేస్తాయి.

లైకా ప్రొడక్షన్స్ మేకింగ్ ఉన్నత స్థాయిలో వుంది. అయీతే సినిమా సైలెంట్ గా సాగుతూంటుంది. ఎక్కడోగానీ నేపథ్య సంగీతం రాదు. ఇది చాలా హాయిగొల్పే క్రియేటివిటీ. పొదుపైన సంగీతంతో సత్య సినిమాకి జీవం పోశాడనే అనాలి. అలాగే శక్తివేల్ కెమెరా విజువల్స్ ఉన్నతంగా వున్నాయి. యాక్షన్ సీన్స్, టెర్రరిస్టు కార్యకలాపాలు ఉన్నత ప్రమాణాలతో వున్నాయి. ఒక్క మాటలో ఇది శరవణన్ దర్శకత్వంలో ఇంటర్నేషనల్ బ్రాండ్ మూవీ.

First Published:  30 Jan 2023 12:35 PM GMT
Next Story