Telugu Global
MOVIE REVIEWS

'ది ప్రిన్సెస్ స్విఛ్డ్ ఎగైన్' – సండే స్పెషల్ రివ్యూ

The Princess Switch: Switched Again Movie Review: వెనెస్సా వినోదం, వినోదంలో హాస్య విలనీ, రాజవంశ మర్యాదల మన్నన ఒక కొత్త డ్రీమ్ వరల్డ్ గా ‘ది ప్రిన్సెస్ స్విచ్’ కి ‘ది ప్రిన్సెస్ స్విఛ్డ్ ఎగైన్’ సీక్వెల్ ఇది!

‘ది ప్రిన్సెస్ స్విఛ్డ్ ఎగైన్’  – సండే స్పెషల్ రివ్యూ
X

‘ది ప్రిన్సెస్ స్విఛ్డ్ ఎగైన్’ – సండే స్పెషల్ రివ్యూ 

వెనెస్సా హజెన్స్ ఇంకో పాత్ర జోడించుకుని త్రిపాత్రాభినయంతో విచ్చేసింది. కాల్పనిక రాజవంశంలో హాస్యాభ్యుదయం, పట్టాభిషేకంలో అపహరణల పర్వం. వెనెస్సా వినోదం, వినోదంలో హాస్య విలనీ, రాజవంశ మర్యాదల మన్నన ఒక కొత్త డ్రీమ్ వరల్డ్ గా 'ది ప్రిన్సెస్ స్విచ్' కి 'ది ప్రిన్సెస్ స్విఛ్డ్ ఎగైన్' సీక్వెల్ ఇది!

ఈసారి మాంటేనరో డచెస్ మార్గరెట్ డెలాకోర్ట్ (వెనెస్సా హజెన్స్ -2 పాత్ర) కి ఉన్నట్టుండి క్రిస్మస్ కి మాంటేనరో రాకుమారిగా పట్టాభిషికత్వం వరిస్తే, బెల్గ్రేవియా రాకుమారి స్టేసీ (వెనెస్సా హజెన్స్ -1 పాత్ర ) తో నేను నువ్వుగా, నువ్వు నేనుగా మారి, ప్రేమ సంగతులు చూసుకుందామని అనుకుంటే, ఎక్కడ్నుంచో తను లేడీ ఫియోనా (వెనెస్సా హజెన్స్ -3 పాత్ర) నంటూ కిలాడీ దూరి, రాజవంశ ఖజానా ఖాళీ చేద్దామనుకునే ఎత్తుకి పైఎత్తు చివరికి చిత్తు కథ.

వెనెస్సా నవ్వు ముఖం మరోసారి కట్టి పడేస్తుంది. ఆమె నవ్వు ముఖం లేకపోతే ఈ సీక్వెల్ కూడా లేదు. బెల్గ్రేవియా రాకుమారి స్టేసీ, మార్గరెట్ పట్టాభిషేకానికి మాంటేనరో బయల్దేరుతూ, మధ్యలో షికాగోలో కెవిన్ (నిక్ సగర్) పరిస్థితేమిటో చూడాలనుకుంటుంది. కెవిన్ తో మార్గరెట్ కి బ్రేకప్ అయి షికాగోలో అతను అదే బేకరీ నడుపుకుంటూ వుంటాడు. పదేళ్ళ కూతురు ఒలీవియా వుంటుంది. భర్త ప్రిన్స్ ఎడ్వర్డ్ (సామ్ పలాడియో) తో కలిసి స్టేసీ వచ్చి, కెవిన్ ని మార్గరెట్ పట్టాభిషేకానికి కి రావాలని ఒప్పిస్తుంది.

వాళ్ళతో కూతుర్ని తీసుకుని మాంటేనరో ప్యాలెస్ కొస్తాడు గడ్డం పెంచుకుని వున్న కెవిన్. క్రిస్మస్ పండక్కి ప్యాలెస్ అలంకరణకి తోడ్పడతాడు. రాజ్య బాధ్యతలు మీద పడడంతో అతణ్ణి నిర్లక్ష్యం చేశానని బాధ పడుతుంది మార్గరెట్. మరో వైపు స్టేసీకి కూడా ఇదే సమస్య. రాకుమారిగా పరిపాలనా బాధ్యతల వల్ల భర్త ప్రిన్స్ ఎడ్వర్డ్ ని నిర్లక్ష్యం చేస్తున్నానని బాధ. ఇక ఆ సాయంకాలం విందు వినోదాల కార్యక్రమంలో వయ్యారంగా నడుచుకుంటూ వస్తుంది కిలాడీ లేడీ ఫియోనా.

కిలాడీ ఫియోనా ఎజెండా

మార్గరెట్, స్టేసీల పోలికలతో వున్న లేడీ ఫియోనా తను మార్గరెట్ కజిన్ నని చెప్పుకుంటుంది. ఈమె ఘన చరిత్రేమిటంటే, వారసత్వంగా సంక్రమించిన సంపదని అవజేసి, కిలాడీలైన ఇద్దరు సేవకులు రెగ్గీ, మిండీలని వెంటేసుకు తిరుగుతోంది. ఇప్పుడు ఇక్కడ ట్రిపుల్ ధమాకా లాంటి అవకాశాన్ని చూస్తుంది. ఒకటి మార్గరెట్ లా తను సెటిల్ అవచ్చు, రెండు పట్టాభిషేకం జరుపుకోవచ్చు, మూడు ఖజానా దోచుకోవచ్చు. రెగ్గీ, మిండీలతో ఆమె ఈ విందు కార్యక్రమానికి వచ్చిందే అతిధుల జేబులు సవరించడానికి.

ఈ విషయం తెలీక స్టేసీ, మార్గరెట్ లు వేరే ప్లానుతో వుంటారు. మార్గరెట్ సమస్యేమిటంటే, ప్యాలెస్ ముఖ్య నిర్వాహకుడు టోనీ తనని ప్రేమిస్తున్నాడు. పట్టాభిషేకంలోగా ఇప్పుడు తను కెవిన్ తో ప్రేమని చక్కదిద్దుకోవాలంటే, టోనీని వదిలించుకోవాలి. అందుకని తను స్టేసీలా స్టేసీ స్థానంలో కెళ్తే, స్టేసీ మార్గరెట్ లా తన స్థానంలో కొస్తే బావుంటుంది. సరేనంటుంది స్టేసీ. ఇలా స్థానాలు మార్చుకున్న విషయం తెలీక, మార్గరెట్ అనుకుని స్టేసీని కిడ్నాప్ చేసి పడేస్తుంది లేడీ ఫియోనా...

ఎలావుంది కథ

2018 లో క్రిస్మస్ కి విడుదలైన 'ది ప్రిన్సెస్ స్విచ్' ఏ క్రిస్మస్ కైనా పండగ సినిమాయే. మొదటి భాగానికి మార్క్ ట్వైన్ నవల 'ది ప్రిన్స్ అండ్ ది పాపర్' ఆధారం. ఈ నవల ఆధారంగా ప్రపంచ భాషల్లో చాలా సినిమాలొచ్చాయి, తెలుగు సహా. మొదటి భాగంలో షికాగోలో ఫ్రెండ్ కెవిన్ (నిక్ సగర్) తో కలిసి బేకరీ నడుపుతున్న స్టేసీ (వెనెస్సా హజెన్స్-1 పాత్ర), బేకరీ క్రిస్మస్ పోటీలకి కెవిన్ తో బెల్గ్రేవియా వెళ్తుంది. అక్కడ తనలాగే వున్న మాంటేనరో డచెస్ మార్గరెట్ (వెనెస్సా హజెన్స్-2 పాత్ర) ని చూస్తుంది. తమకి పూర్వపు బంధుత్వ ముందని తెలుసుకుంటుంది.

మార్గరెట్ కి బెల్గ్రేవియా ప్రిన్స్ ఎడ్వర్డ్ (సామ్ పలాడియో) తో వివాహం నిశ్చయమై వుంటుంది. రెండు రోజుల్లో వివాహం. మార్గరెట్ తనకి సామాన్యురాలిలా జీవితం చూడాలనుందనీ, ఈ రెండు రోజులు స్థానాలు మార్చుకుందామనీ స్టేసీతో అంటుంది. స్టేసీ ఒప్పుకుంటుంది. ఇద్దరూ స్థానాలు మార్చుకుంటారు. సామాన్య జీవితంలో కెళ్లిన మార్గరెట్ కెవిన్ తో ప్రేమలో పడుతుంది. ఇటు స్టేసీ ఎడ్వర్డ్ తో ప్రేమలో పడుతుంది. ఈ విషయం అందరికీ స్పష్టం చేసి, మార్గరెట్ కెవిన్ తో ప్రేమలో వుంటుంది, స్టేసీ ఎడ్వర్డ్ ని పెళ్లి చేసుకుని బల్గ్రేవియా రాకుమారి అవుతుంది.

సీక్వెల్ కూడా ప్యాలెస్ హ్యూమరే!

ఈ నేపథ్యంలోనే ఇప్పుడీ సీక్వెల్ కథ. రెండూ ప్యాలెస్ రోమాంటిక్ హ్యూమర్లే. సీక్వెల్లో మూడో వెనెస్సా తొడయ్యింది. దీంతో క్రైమ్ ఎలిమెంట్ కలిసింది. మొదటి భాగం కంటే సీక్వెల్లో వేగముంది, హాస్యం ఎక్కువుంది. రాజవంశ బంధుమిత్ర పరివారం, వైభవం, రాచ మర్యాదలు వగైరా ఒకటే. అదే మనోహరమైన క్రిస్మస్ పండగ వాతావరణం చివరంటా.

ఈ రెండు భాగాల్లోనూ కాన్ఫ్లిక్ట్ ప్రధానం కాదు. దాన్ని పట్టుకుని మలుపులు తిప్పడం ముఖ్యం కాదు. క్రిస్మస్ సినిమా ఇంతే. మొదటి భాగంలో స్థానాలు మార్చుకున్న ఇద్దరూ బయట సృష్టించే కాన్ఫ్లిక్ట్ ఏమీ వుండదు. మార్గరెట్ గా వుంటున్న స్టేసీ దొరికిపోతుందేమో నన్న రెండు మూడు దృశ్యాలు పైపైన వుంటాయి. సీఐడీ బట్లర్ కూడా ఫోటోలు తీయబోతూ పైనుంచి కింద పడినడుం విరగ్గొట్టుకుని చాలించుటాడు. ప్రత్యర్థి పాత్రలతో ఔటర్ కాన్ఫ్లిక్ట్ సృష్టిస్తే, స్థానాలు మార్చుకుని వాళ్ళిద్దరూ జీవితాల్లో సృష్టించుకున్న ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ హైలైట్ అవదు. ఈ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ తో వాళ్ళిద్దరూ ఏం కనుగొన్నారన్నదే ప్రధానంగా చెప్పదల్చుకున్న కథ. మార్గరెట్ సామాన్య జీవితంలోని ఆనందాన్ని కనుగొంది, స్టేసీ ప్రేమని కనుకొంది. దీనికి ఏడ్పులూ, తెచ్చిపెట్టున్న సెంటిమెంట్లూ, ఫ్యామిలీ చాదస్తాలూ వంటి రొటీన్ టెంప్లెట్లు అవసరం లేదు. హాస్యంతో కూడా వాస్తవాల్ని తెలియ జెప్పొచ్చు.

ఈ సీక్వెల్లో మధ్యలో వెనెస్సా హజెన్స్-3 వచ్చి, కిడ్నాప్ తో ఔటర్ కాన్ఫిక్ట్ ని సృష్టిస్తుంది. ఇది కూడా లైటర్ వీన్ గానే వుంటుంది. ఈ ఔటర్ కాన్ఫ్లిక్ట్ తో, ఈసారి స్థానాలు మార్చున్న మార్గరెట్, స్టేసీ ల ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ ప్రభావిత మవుతుంది. మార్గరెట్ నిర్లక్ష్యం చేసిన కెవిన్ తో పెళ్లి ప్రాముఖ్యాన్ని గుర్తిస్తుంది, స్టేసీ పెళ్లి చేసుకున్నఎడ్వర్డ్ ని నిర్లక్ష్యం చేయకూడదని తెలుసుకుంటుంది.

ఇందులో సంభాషణలు కూడా మృదు మధురంగా వుంటాయి. దృశ్యాల కదలిక స్మూత్ గా వుంటుంది. సంగీతం సరస గీతాలతో వుంటుంది. ఛాయాగ్రహణం పీచు మిఠాయిలా వుంటుంది. కాస్ట్యూమ్స్ సింపుల్ గా వుంటాయి. ఏ విషయంలోనూ క్రిస్మస్ ఫీల్ ని తప్పనీయలేదు. నెట్ ఫ్లిక్స్ లో ఇది వినోదాల విందు.

First Published:  13 Nov 2022 6:55 AM GMT
Next Story