Telugu Global
MOVIE REVIEWS

The Idea of You Movie Review: ది ఐడియా ఆఫ్ యూ- తెలుగు రివ్యూ! {2.5/5}

The Idea of You Telugu Movie Review: అమెరికన్ రోమాంటిక్ డ్రామా ‘ది ఐడియా ఆఫ్ యూ’ మార్చిలో విడుదలైంది. అక్కడ్నుంచి మే 2 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

The Idea of You Movie Review: ది ఐడియా ఆఫ్ యూ- తెలుగు రివ్యూ! {2.5/5}
X

చిత్రం: ది ఐడియా ఆఫ్ యూ

దర్శకత్వం : మైకేల్ షో వాల్టర్

తారాగణం : ఏన్ హాత్వే, నికోలస్ గాలిట్జీన్, ఎల్లా రుబీన్, రీడ్ స్కాట్ తదితరులు

రచన : మైకేల్ షో వాల్టర్, జెన్నిఫర్ వెస్ట్ ఫెల్ట్

సంగీతం : సిద్ధార్థ ఖోస్లా, ఛాయాగ్రహణం : జిమ్ ఫ్రొహ్నా

బ్యానర్స్ : అమెజాన్ - ఎంజీఎం స్టూడియోస్

విడుదల : మే 2, 2024 (అమెజాన్ ప్రైమ్)

రేటింగ్: 2.5/5

అమెరికన్ రోమాంటిక్ డ్రామా ‘ది ఐడియా ఆఫ్ యూ’ మార్చిలో విడుదలైంది. అక్కడ్నుంచి మే 2 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. 2001 నుంచీ 10 రోమాంటిక్ సినిమాలు తీసిన మైకేల్ షో వాల్టర్ దీని దర్శకుడు. 2014 నుంచి 14 సినిమాలు నటించిన బ్రిటిష్ నటుడు నికోలస్ గాలిట్జీన్ ఇందులో హీరో. 2001 నుంచి 45 సినిమాలు నటించిన అమెరికన్ నటి ఏన్ హాత్వే హీరోయిన్. న్యూయార్క్ లో గోల్డ్ స్పాట్ బ్యాండ్ తో ప్రసిద్ధి చెందిన సిద్ధార్థ ఖోస్లా సంగీత దర్శకుడు. రచయిత్రి రాబిన్ లీ ఇదే పేరుతో రాసిన హిట్ నవల ఈ సినిమా కాధారం. సినిమా చూసి తీవ్ర అసంతృప్తి చెందిన రాబిన్ లీ చేసిన వ్యాఖ్యలేమిటి? తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న ఈ రోమాంటి డ్రామా కథేమిటి? కొత్తగా చెప్తున్నదేమిటి? ఇవి తెలుసుకుందాం...

కథ

లాస్ ఏంజిలిస్ లో సోలెన్ మర్చండ్ (ఏన్ హాత్వే) విజయవంతంగా ఆర్ట్ గ్యాలరీ నడుపుతున్న నడివయస్కురాలు. 40 ఏళ్ళ ఆమెకి 16 ఏళ్ళ కూతురు ఇజ్జీ (ఎల్లా రుబీన్) వుంటుంది. సోలెన్ భర్త డానియేల్ (రీడ్ స్కాట్) నుంచి విడాకులు తీసుకుంది అతను వేరే వ్యవహారం నడపడంతో. అయితే అతను వచ్చి పలకరించి పోతూనే వుంటాడు. ఒక రోజు అతను కూతురు ఇజ్జీనీ, ఆమె ఫ్రెండ్స్ నీ మ్యూజిక్ ఫెస్టివల్ కి తీసుకుపోతూంటే, మధ్యలో ఆఫీసు నుంచి అర్జెంట్ కాల్ రావడంతో, వీళ్ళని తీసికెళ్ళమని సోలెన్ ని కోరతాడు. సోలెన్ వాళ్ళని తీసుకుని మ్యూజిక్ ఫెస్టివల్ కి వెళ్తుంది. అక్కడ బాత్రూమ్ కోసం వెతికి ఆగి వున్న వ్యాను బాత్రూమ్ అనుకుని ఎక్కేస్తుంది. అది బాత్రూమ్ కాదు, పాపులర్ సింగర్ హేస్ క్యాంప్ బెల్ పర్సనల్ వ్యాన్. ఆగస్ట్ మూన్ అనే బ్యాండ్ అతను నడుపుతున్నాడు.

వ్యానులో ఈ అనుకోని పరిచయం ఇద్దరి మధ్యా రిలేషన్ షిప్ కి దారితీస్తుంది. మొదట తన కన్నా 16 ఏళ్ళు చిన్నవాడైన హేస్ తో ప్రేమాయణం మనస్కరించక పోయినా క్రమంగా అతడ్ని అంగీకరిస్తుంది. ఇద్దరి మధ్య ప్రేమ మెల్లగా పెరగడం మొదలైన తర్వాత ఒకటొకటే అర్ధమవుతాయామెకి. కలిసి వుండాల్సిన అవసరం, ఒకరినొకరు మిస్సవడం, బలంగానూ పచ్చిగానూ అనుభవమవుతున్న ప్రేమ -ఇదంతా ఎంతో కాలం నిలబడవని అర్ధమై పోతుంది. ఈ ఏజ్ గ్యాప్ రోమాన్సుకి ఈ డిజిటల్ యుగంలో వున్న భద్రత ఎంతో, సెలబ్రిటీతో జీవితం, అందులోనూ నిత్యం ప్రపంచ కళ్ళల్లో పడుతూ ఇబ్బంది పెట్టే తన నడి వయసుతో పడే బాధ ఏమిటో - ఇవన్నీ కలిసి సంఘర్షణకి గురి చేస్తాయి. అంతేగాక కూతురి ప్రశ్నలు, మాజీభర్త హెచ్చరికలు- ఇవి కూడా తోడై ఇక్కడ్నుంచి అతడితో తెగతెంపులు, మళ్ళీ అతికింపులు, మళ్ళీ తెగతెంపులు... ఇలా తయారవుతుంది జీవితం. చివరికి ఈ ప్రేమ ఏ తీరానికి చేరుకుంది? ఇద్దరూ ఒకటయ్యారా, విడిపోయారా? ముగింపేమిటి? ఇవీ మిగతా కథలో...

హాలీవుడ్ ముగింపే!

ఈ రోజుల్లో చాలా మంది స్త్రీలని బాధపెడుతున్న వొత్తిళ్ళు- నిరంతరం యవ్వనంగా, పరిపూర్ణంగా కనిపించాలని సమాజం, మీడియా కలిసి పెంచుతున్న వొత్తిడి... స్త్రీలు ఎలా ప్రవర్తించాలి, ఎవరితో డేటింగ్ చేయాలి, ఎలాంటి దుస్తులు ధరించాలీ వంటి విషయాలపై నిరంతర తీర్పులు, రన్నింగ్ కామెంటరీలు- ఇవి హేస్ -సోలెన్ ప్రేమ కథలో చూస్తాం. తన కంటే బాగా చిన్న వాడితో డేటింగ్ చేయడాన్ని ప్రశ్నించే సమాజం ఇంకా వుండడం చోద్యంగానే వుంటుంది. వయసులో తేడా ప్రపంచానికి కనిపిస్తోంది గానీ వాళ్ళిద్దరికీ కాదు. అయితే అతను సెలబ్రిటీ. ఇక్కడొచ్చింది చిక్కు. కూతురు, భర్త, విడాకులు, వయస్సు.. ఇలా ఇన్ని అధైర్యాలు తన కుండగా, అతను సెలబ్రిటీ కూడా కావడంతో మీడియా ఫోకస్ ని తట్టుకోలేక, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ని జయించలేక, అతడితో లవ్ –హేట్ రిలేషన్ షిప్ అనే చట్రంలో ఇరుక్కుని ఏం చేసిందనేది ఇక్కడ ముఖ్యమైన పాయింటు.

అయితే నవల రాసిన రచయిత్రి ఈ కథని ట్రాజడీగా ముగిస్తే, సినిమా తీసి సుఖాంతం చేయడాన్ని తప్పుబట్టింది. ఈ సినిమా వాళ్ళు ఇంతే- కథలు సుఖాంతమైతేనే కమర్షియల్ గా సక్సెస్ అవుతాయని నమ్ముతారని ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. హాలీవుడ్ వాళ్ళు ఇలా చేయగా లేనిది తెలుగు సినిమాల్లో చేస్తే తప్పేమిటి? దీన్నే తెలుగులో తీస్తే పెళ్ళి చేసి, శోభనం పెట్టి, బ్యాక్ గ్రౌండ్ లో కెవ్వుమని పుట్టిన పిల్లాడి కేక విన్పిస్తేనే పరిపూర్ణమైన ముగింపు అన్నట్టు. సోలెన్ లాంటి హీరోయిన్ పాత్ర ఎలా కిల్ అయినా ఫర్వాలేదు- సమాజం ఆడదాన్ని ఒంటరిగా వదలదు కాబట్టి- పెళ్ళి చేసి మెడకో డోలు కడుతుంది కాబట్టీ!!

ఈ నవల మీద వచ్చిన పాఠకుల అభిప్రాయాలూ చూస్తే- కొన్ని రోజుల వరకూ దీని ప్రభావం నుంచి తేరుకోలేక పోయామని రివ్యూలు రాశారు.



First Published:  5 May 2024 10:27 AM GMT
Next Story