Telugu Global
MOVIE REVIEWS

'ది ఘోస్ట్' రివ్యూ {2/5}

ఈ మూవీ కోసం నాగార్జున క్రవ్ మగా, కటానా అనే కత్తి పోరాటాలు నేర్చుకున్నట్టు ప్రచారం చేశారు. హీరోయిన్లు మారిపోతూ చివరికి సోనల్ చౌహాన్ ని తెరపైకి తీసుకొచ్చారు. ఇంకో పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటి గుల్ పనాగ్ ని తెలుగులోకి తీసుకొచ్చారు.

ది ఘోస్ట్ రివ్యూ {2/5}
X

చిత్రం : ది ఘోస్ట్

రచన - దర్శకత్వం : ప్రవీణ్ సత్తారు

తారాగణం : నాగార్జున, సోనల్ చౌహాన్, గుల్ పనాగ్, అనైకా, రవివర్మ తదితరులు

సంగీతం : మార్క్ రాబిన్, ఛాయాగ్రహణం : ముఖేష్

బ్యానర్స్ : శ్రీ వేంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్

నిర్మాతలు : సునీల్ నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్

విడుదల : అక్టోబర్ 2, 2022

రేటింగ్ : 2/5

చాలా కాలం నిర్మాణంలో వున్న నాగార్జున అక్కినేని నటించిన 'ది ఘోస్ట్' దసరాకి విడుదలైంది. రాజశేఖర్ తో 'గరుడ వేగ' అనే హిట్ తీసిన ప్రవీణ్ సత్తారు నుంచి మరో యాక్షన్ మూవీ ఇది. ఈ మూవీ కోసం నాగార్జున క్రవ్ మగా, కటానా అనే కత్తి పోరాటాలు నేర్చుకున్నట్టు ప్రచారం చేశారు. హీరోయిన్లు మారిపోతూ చివరికి సోనల్ చౌహాన్ ని తెరపైకి తీసుకొచ్చారు. ఇంకో పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటి గుల్ పనాగ్ ని తెలుగులోకి తీసుకొచ్చారు. ఇంకా చాలా ఆకర్షణీయమైన అంశాలున్నాయి. అయితే సినిమా అంటే కేవలం ఆకర్షణీయమైన అంశాలేనా, ఇంకేమైనా వుండాలా? ఏముండాలి? ఇది తెలుసుకుందాం.

కథ

విక్రమ్ (నాగార్జున) ప్రేమిస్తున్న ప్రియ (సోనల్ చౌహాన్) తో కలిసి దుబాయ్ లో ఇంటర్ పోల్ అధికారిగా పని చేస్తూంటాడు. క్రిమినల్స్ మీద చేపట్టిన ఒక ఆపరేషన్ లో ఒక చిన్న పిల్లాడు చనిపోవడంతో విచారంలో మునిగిపోతాడు. మానసికంగా దెబ్బ తిన్న అతడ్ని చూసి ప్రియ దూరమవుతుంది. ఇంతలో ఇరవై ఏళ్ళక్రితం దూరమైన చెల్లెలు అనుపమ (గుల్ పనాగ్) నుంచి విక్రమ్ కి కాల్ వస్తుంది. తననీ తన కూతురు అదితి (అనైక) నీ కాపాడమని వేడుకుంటుంది. దాంతో విక్రమ్ ఊటీకి బయల్దేరతాడు. ఇక చెల్లెల్ని, ఆమె కూతుర్నీ కాపాడడంలో అతడికి ఎదురైన ప్రమాదాలేమిటి, చెల్లెలికి ఎవరు ఎందుకు హాని తలపెడుతున్నారు, అసలు అన్నా చెల్లెళ్ళ కథేమిటన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

యాక్షన్ జానర్ కథ. అయితే కథ లేదు. ఆకర్షణీయమైన అంశాలు చాలా వున్నాయి గానీ, కథ కూడా వుండాలని అనుకోలేదు. అందుకని కథ లేని యాక్షన్ సీన్సే వున్నాయి. అసలే చెల్లెల్ని కాపాడే సిస్టర్ సెంటిమెంటు అరిగిపోయిన పురాతన పాయింటు అయితే, ఈ అరిగిపోయిన పురాతన పాయింటుతో కథెందుకు అనుకున్నట్టు దర్శకుడు ప్రవీణ్ సత్తారు కథ వదిలేసి యాక్షన్ సీన్లు జోడించుకుంటూ పోయాడు. చెల్లెలి కుటుంబాన్ని కాపాడే మెయిన్ స్టోరీని, ప్రేమించిన ప్రియకి దూరమైన సబ్ ప్లాట్ నీ పక్కన పెట్టేసి, శత్రువులు వర్సెస్ నాగార్జున అన్నట్టుగా వాళ్ళు ఎడతెరిపి లేకుండా కొట్టుకునే దృశ్యాలతో నింపేశాడు. సినిమా ఇలా కూడా వుంటుందని కొత్త విధానం చెప్పే ఉద్దేశమేమో!

చిన్నప్పుడు చెల్లెలితో నాగార్జున ఫ్లాష్ బ్యాక్ కూడా ఎలాటి భావోద్వేగాల్లేకుండా చప్పగా సాగిపోతుంది. ఇక యాక్షన్ సీన్స్ లో ఎమోషన్స్ వుండడానికి వీల్లేదు. 'గుంటూరు టాకీస్' వంటి రియలిస్టిక్ ఎమోషనల్ హిట్ తీసిన ప్రవీణ్ సత్తారులో ప్రావీణ్యం ఇలా జీరో ఐందేమిటని ఆశ్చర్యం కలగక మానదు. 2017 లో 'గరుడ వేగ 'అనే టెర్రరిజం సినిమా తీసినప్పుడు ప్రావీణ్యం ట్రాకులోనే వుంది. 'ది ఘోస్ట్' మాత్రం ప్రేక్షకుల పాలిట భూతమైపోయింది. యాక్షన్ సీన్స్ కి కూడా అయిడియాలు కొరవడినట్టు 'కేజీఎఫ్' నుంచి, కమల్ హాసన్ 'విక్రమ్' నుంచీ కాపీ కొట్టినట్టు వుండడం ఇంకా అన్యాయం. చెల్లెలి కుటుంబాన్ని కాపాడడమనే ఏదో ఒక లైను పెట్టుకుని, దానికైనా కథ లేకుండా స్టయిలిష్ యాక్షన్ సీన్స్ సిరీస్ గా సినిమా తీసేస్తే ప్రేక్షకులు భరించగలరను కోవడం పొరపాటు. సుదీర్ఘ కాలం సినిమా నిర్మాణంలో వుందంటేనే విషయంతో ఏదో ప్రాబ్లం వున్నట్టు అర్ధం జేసుకోవాలి

నటనలు – సాంకేతికాలు

నాగార్జున స్టయిలిష్ లుక్ తో డీసెంట్ గా వున్నాడు. యాక్షన్ సినిమాలు తనకి కొత్త కాదు. అరవై దాటిన వయసులో ఈ యాక్షన్ తో సత్తా చాటాడు. మరీ చేయలేని విన్యాసాలు చేయకుండా వయసు అనుమతించిన మేరకు ఓకే అనిపించాడు. అయితే పోరాటాలతో బాటు కాస్త పాత్ర, దాంతో కథ, పోరాటాలకి దిగడానికి బలమైన నేపథ్యం, ఆ నేపథ్యంలోంచి భావోద్వాగాలూ లేకపోవడంతో తన స్టార్ స్టేటస్ సినిమాని కాపాడలేకపోయింది. గత యాక్షన్ మూవీ 'వైల్డ్ డాగ్' లాగే ఇది కూడా తనకి ఐరన్ లెగ్ సినిమా. తల్వార్లు, తుపాకులు, బాంబులు వీటితోనే తను నటిస్తే, వీటిని పరీక్షిస్తున్నట్టు అన్పిస్తే, అది డెమో అవుతుందేమో గానీ మూవీ కాదు.

హీరోయిన్ సోనల్ చౌహాన్ గ్లామర్ ప్రదర్శన, ఓ యాక్షన్ సీనులో విజృంభణ వరకే పరిమితం. గుల్ పనాగ్ సిస్టర్ సెంటిమెంటుతో వుంటే, ఆమె ఎదిగిన కూతురుగా, దుర్వ్యసనాల బారిని పడ్డ ధనిక అమ్మాయిగా అనైకా నటించింది. చాలా మైనస్ ఎవరంటే విలన్. ఇన్నేసి యాక్షన్ సీన్స్ కి తెరతీస్తున్న దుష్టుడు దుష్టుడులాగా లేకుండా దిష్టి బొమ్మలాగా వుండడం ప్రవీణ్ సత్తారు ప్రావీణ్యానికి ఇంకో మచ్చు తునక.

ప్రొడక్షన్ విలువలు మాత్రం బ్రహ్మాండంగా వున్నాయి. ముఖేష్ కెమెరా, మార్క్ రాబిన్ సంగీతం, లవ్ సాంగ్ తో బాటు పార్టీ సాంగ్ చిత్రీకరణా ఆసక్తికరంగా వున్నాయి. ఎంతో ఆసక్తిరేపుతూ వార్తలో వుంటూ వచ్చిన నాగ్ -సత్తారు కాంబినేషన్లో 'ది ఘోస్ట్' వేస్టయిపోయింది.

First Published:  6 Oct 2022 10:24 AM GMT
Next Story