Telugu Global
MOVIE REVIEWS

'స్వాతి ముత్యం' రివ్యూ {2.5/5}

దసరా విడుదలల్లో ‘స్వాతి ముత్యం’ ఒకటి. సితార ఎంటర్టయిన్మెంట్ నుంచి ఒక కుటుంబ కాలక్షేపం. హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు గణేష్ హీరోగా పరిచయం. ఐదు తెలుగు సినిమాల్లో నటించిన కన్నడ నటి వర్షా బొల్లమ్మ హీరోయిన్. లక్ష్మణ్ కృష్ణ కొత్త దర్శకుడు.

స్వాతి ముత్యం రివ్యూ {2.5/5}
X

చిత్రం: స్వాతి ముత్యం

రచన- దర్శకత్వం : లక్ష్మణ్ కృష్ణ

తారాగణం : బెల్లంకొండ గణేష్, వర్షా బొల్లమ్మ, దివ్య శ్రీపాద, ప్రగతి, సురేఖా వాణి, రావు రమేష్, నరేష్, గోపరాజు రమణ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్ తదితరులు

సంగీతం: మహతీ స్వర సాగర్, ఛాయాగ్రహణం : సూర్య

బ్యానర్ : సితార ఎంటర్టయిన్మెంట్

నిర్మాత: సూర్యదేవర నాగ వంశీ

విడుదల : అక్టోబర్ 2, 2022

రేటింగ్ : 2.5/5


దసరా విడుదలల్లో 'స్వాతి ముత్యం' ఒకటి. సితార ఎంటర్టయిన్మెంట్ నుంచి ఒక కుటుంబ కాలక్షేపం. హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు గణేష్ హీరోగా పరిచయం. ఐదు తెలుగు సినిమాల్లో నటించిన కన్నడ నటి వర్షా బొల్లమ్మ హీరోయిన్. లక్ష్మణ్ కృష్ణ కొత్త దర్శకుడు. దసరాకి ఒకవైపు మెగా స్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్', మరోవైపు కింగ్ నాగార్జున 'ఘోస్ట్' పెద్ద స్టార్స్ సినిమాలు. ఈ రెండిటి మధ్య ఓ చిన్న సినిమాగా 'స్వాతి ముత్యం' నిలబడే అవకాశముందా? నిలబడే విషయమేమైనా వుందా? అసలిందులో వున్న కొత్తదనమేమిటి? ఇవి తెలుసుకుందాం...

కథ

పిఠాపురం లోని విద్యుత్ శాఖలో బాలమురళీ కృష్ణ (బెల్లంకొండ గణేష్) క్లర్కుగా పని చేస్తూంటాడు. తల్లిదండ్రులు (రావు రమేష్, ప్రగతి), డాక్టర్ బుచ్చిబాబు (వెన్నెల కిషోర్) అనే మిత్రుడూ వుంటారు. ఉద్యోగంలో చేరాడు కాబట్టి తల్లిదండ్రులు పెళ్ళి ప్రయత్నాలు చేస్తారు. భాగ్యలక్ష్మి (వర్షా బొల్లమ్మ) అనే స్కూలు టీచర్ తో పెళ్ళి చూపులు, పెళ్ళీ కుదురుతాయి. భాగ్యలక్ష్మి తల్లిదండ్రులు (నరేష్, సురేఖా వాణి), పెదనాన్న (గోపరాజు రమణ) జోరుగా పెళ్ళి ఏర్పాట్లు చేస్తారు. పెళ్ళింట్లో బిడ్డనెత్తుకుని శైలజ (దివ్యా శ్రీపాద) అనే క్రైస్తవ అమ్మాయి ప్రత్యక్షమవుతుంది. ఈ బిడ్డ నీదే అంటుంది గణేష్ తో. అవును నాదే అంటాడు గణేష్. పెళ్ళింట్లో గోలగోల అవుతుంది. పెళ్ళాగిపోతుంది. ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోతారు. బిడ్డని గణేష్ చేతుల్లో పడేసి శైలజ కూడా వెళ్ళిపోతుంది.

ఏమిటీ పరిస్థితి? అసలేం జరిగింది? బిడ్డని కన్న గణేష్ ఎందుకీ పెళ్ళికి సిద్ధపడ్డాడు? శైలజ ఎవరు? ఆమెతో గణేష్ కేం జరిగింది? ఇప్పుడు బిడ్డతో ఒంటరిగా మిగిలిన గణేష్ ఏం చేశాడు? భాగ్యలక్ష్మి సంగతేంటి? ఇవన్నీ మిగతా కథలో తేలే విషయాలు.

ఎలావుంది కథ

రోమాంటిక్ డ్రామా జానర్ కి చెందిన కథ. అంటే హీరోయిజం వుండదు. ప్రేమ సమస్యని హీరో హీరోయిన్లు పరిష్కరించుకోక, పెద్దల చేతుల్లో పరిష్కారమయ్యే టైపు కథ. అయితే తెలుగులో దాదాపు అన్ని రోమాంటిక్ డ్రామాలు సెకండాఫ్ లో హీరో హీరోయిన్లు విడిపోవడం, విషాదంగా మారడం జరుగుతాయి. విషాదం వర్కౌట్ కాక అవన్నీ ఫ్లాపవుతున్నాయి. ప్రస్తుత రోమాంటిక్ డ్రామా ఫస్టాఫ్- సెకండాఫ్ రెండూ కామెడీతోనే నడవడంతో బ్రతికి బైట పడింది.

ఈ కథకి కేంద్ర బిందువు సరొగసీ (అద్దె గర్భం) అంశం. దీన్ని సీరియస్ గా కాకుండా హిందీ 'మిమీ' (2021) లో లాగా హాస్య ధోరణిలో చెప్పడం. టౌను పాత్రలతో టౌను పాత్రలతో తీయడం. కుటుంబ కాలక్షేపం. అయితే ఫస్టాఫ్ పెళ్లి చూపులు, ప్రేమ, పెళ్ళి ఘట్టం వరకూ 50 నిమిషాలు విషయం లేక డల్ గా సాగుతుంది. పెళ్ళిలో బిడ్డనెత్తుకుని వచ్చే శైలజ పాత్రతో కథ మొదలవుతుంది. అక్కడ్నించి సెకండాఫ్ సరొగసీ పాయింటుతో కామెడీకి ఊపొస్తుంది. ఇంకోటేమిటంటే కథ సాగదీయకూడా గంటా 50 నిమిషాల్లో సినిమా ముగించడం.

'కృష్ణ వ్రింద విహారి' లో హీరోయిన్ కి పిల్లలు పుట్టని విషయం దాచి పెట్టి ఆడే నాటకంగా కథ వుంది. ఈ నాటకాలు ఔట్ డెటెడ్ కథలు. ఇది ఫ్లాపయ్యింది. ప్రస్తుత కథలో విషయం దాచిపెట్టలేదు. బయట పడ్డ విషయంతో పరిష్కారం కోసం కథ వుండడంతో ఆసక్తిగా మారింది. అలాగని కథనం మరీ అద్భుతమేమీ కాదు. పెళ్ళి సమయంలోనే హీరో బిడ్డనెలా కన్నాడో చెప్పేస్తే పాత్ర, కథ బలంగా వుండేవి. అలా కన్న బిడ్డతో పెళ్ళెలా అవుతుందనే సమస్య పరిష్కారాని కుండేది. కానీ హీరో క్లయిమాక్స్ వరకూ హీరోయిన్ కీ, ముగింపు వరకూ పెద్దలకీ చెప్పకుండా ఎందుకో సతమవుతూ వుంటాడు. ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదనిహీరోయిన్ అడుగుతుంది. ఈ ప్రశ్నే పెళ్ళి గొడవలో (ఇంటర్వెల్లో) మనకి తడుతుంది.

నటనలు – సాంకేతికాలు

బెల్లంకొండ గణేష్ పాత్ర స్వాతి ముత్యం అన్పించుకోవాలీ కాబట్టి సాత్వికంగా వుండాలేమో. ఇది కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. ఎందుకంటే రాముడు మంచి బాలుడుగా నటించడానికేమీ లేకుండా పోయింది. కామెడీ సినిమా అన్నప్పుడు క్యారక్టర్ ఫన్నీగా వుంటూ హిలేరియస్ కామెడీలు పుట్టిస్తూ వుంటే, కొత్త హీరోగా నటన ప్రదర్శించుకునే అవకాశం వుండేది. పైగా 50 నిమిషాలు డల్ గా సాగే ఫస్టాఫ్ హుషారుగా మారేది. ఇక ఎలాగూ రోమాంటిక్ డ్రామా అన్నాక హీరో చేయాల్సింది చేసుకోక పెద్దలే చక్కబెడతారు గనుక, సెకెండాఫ్ గణేష్ కి పెద్దగా బాధ్యత లేకుండా పోయింది. పెద్దల్ని సమస్యల్లో పడేసిన వాడు సమస్యల్ని పెద్దలకే ఎలా వదిలేస్తాడో రోమాంటిక్ డ్రామాల లాజిక్ వుండని తతంగం. రెండో సినిమాతోనైనా గణేష్ యాక్టివ్ క్యారక్టర్ నటిస్తే తనేమిటో తెలుస్తుంది. .

టీచర్ పాత్రలో వర్షా బొల్లమ్మ కూడా అసహాయురాలే. పెళ్ళి చెడిపోయాక ఇంటికి పరిమితమై కన్పించదు. ఏం చేయాలో ఆలోచించుకోకుండా విచారంగా వుండిపోతుంది. టీచర్ గా తన సమస్యకి తనే బెంబేలు పడితే విద్యార్థులకి ఏం బోధిస్తుందో అర్ధంగాదు. గ్లామరస్ గా మాత్రం బావుంది. హావభావాలు పలికిస్తుంది.

వెన్నెల కిషోర్ డాక్టర్ పాత్ర 'కృష్ణ వ్రింద విహారి' దుష్ట సమాసం టైటిల్ సినిమాలో డాక్టర్ పాత్ర లాంటిదే. రెండిట్లోనూ హీరోల్ని ఇరికించి వదిలే అయోమయపు కామెడీ డాక్టర్ పాత్ర. పరిమితంగా నవ్విస్తాడు. సహాయ పాత్రల్లో ప్రగతి, సురేఖా వాణి, రావు రమేష్, నరేష్, గోపరాజు రమణ, సుబ్బరాజు ...చాలా మంది వున్నారు గానీ, అందర్నీ డామినేట్ చేస్తూ ఫన్నీ పాత్ర పోషించిన గోపరాజు రమణ దృష్టి నాకర్షిస్తాడు. ఈయనతో బాటు రావురమేష్ టౌను మనుషుల్లా వుంటారు.

మహతీ స్వర సాగర్ సంగీతం 'కృ.వ్రి. వి' వికృత టైటిల్ సినిమాలో లాగే వర్కౌట్ కాలేదు. పాటలు సాహిత్యం, సంగీతం అసలేమీ బాగాలేవు. సితార వారి ప్రొడక్షన్ విలువలు మాత్రం బలంగా వున్నాయి. కొత్త దర్శకుడు లక్ష్మణ్ కృష్ణ నేటివ్ రచన, దర్శకత్వం, ముఖ్యంగా కామెడీ డైలాగులు సినిమాని కాపాడాయి. ఓసారి కాలక్షేపంగా చూడొచ్చు.

First Published:  7 Oct 2022 7:37 AM GMT
Next Story