Telugu Global
MOVIE REVIEWS

Gaalodu Movie Review: 'గాలోడు'- రివ్యూ! {1/5}

Sudigali Sudheer's Gaalodu Movie Review: టీవీలో ‘జబర్దస్త్’ ప్రోగ్రాం నుంచి సినిమాకి వలస వస్తున్న ఆర్టిస్టుల్లో సుడిగాలి సుధీర్ ఒకడు.

Gaalodu Movie Review: ‘గాలోడు’- రివ్యూ! {1/5}
X

Gaalodu Movie Review: ‘గాలోడు’- రివ్యూ! {1/5}

చిత్రం: గాలోడు

రచన -నిర్మాణం- దర్శకత్వం : పి. రాజశేఖర్ రెడ్డి

తారాగణం: సుధీర్ ఆనంద్, గెహ్నా సిప్పీ, సప్తగిరి, షకలక శంకర్, పృథ్వీ, సత్య కృష్ణ తదితరులు

సంగీతం : భీమ్స్ సిసీరియో, ఛాయాగ్రహణం: సి. రాంప్రసాద్

విడుదల : నవంబర్ 18, 2022

రేటింగ్ : 1/5

టీవీలో 'జబర్దస్త్' ప్రోగ్రాం నుంచి సినిమాకి వలస వస్తున్న ఆర్టిస్టుల్లో సుడిగాలి సుధీర్ ఒకడు. చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు నటించి రెండు సినిమాల్లో హీరో అయ్యాడు. ఈ సినిమాలు హీరోగా నిలదొక్కుకోవడానికి పనికి రాలేదు. తిరిగి ఇంకో సినిమాతో 'గాలోడు' అంటూ ఇప్పుడొచ్చాడు. ఇప్పుడు వీస్తున్న గాలికి 'గాలోడు' కూడా సరైనదేనా? ఇది మరో గాలి సినిమానా? అసలిది సినిమాయేనా? చిట్టచివరి బెంచి క్లాసు ప్రేక్షకుడైనా దీన్ని సినిమాగా ఒప్పుకుంటాడా? ఇవి తెలుసుకుందాం...

కథ

పల్లెటూళ్ళో గాలి తిరుగుళ్ళు తిరుగుతూంటాడు రాజు (సుధీర్). అల్లరితనం, చిల్లర పనులు అన్నీ చేస్తూ గాలోడు అన్పించుకుని ఓ లక్ష్యం లేకుండా బ్రతుకుతూంటాడు. ఓ రోజు సర్పంచ్ కొడుకుతో పేకాటలో జరిగిన దెబ్బలాటలో సర్పంచ్ కొడుకు చనిపోవడంతో హైదరాబాద్ కి పారిపోతాడు రాజు. ఇక్కడ శుక్లా (గెహ్నా సిప్పీ) అనే స్టూడెంట్ ని కాపాడి ఆమె మెప్పు పొందుతాడు. ఆమె తండ్రికి చెప్పి డ్రైవర్ ఉద్యోగంలో పెట్టిస్తుంది. ఆ ఉద్యోగం చేస్తూ ఆమెని ప్రేమిస్తాడు. ఆమె కూడా ప్రేమిస్తుంది. ఇది ఆమె తండ్రికి తెలిసి అడ్డు పడుతాడు. మరో వైపు హత్య కేసులో రాజుని పోలీసులు గాలిస్తూంటారు. ఇంకో వైపు పగబట్టిన సర్పంచ్ రాజుని చంపాలని చూస్తూంటాడు. ఈ సమస్యల్ని ఎదుర్కొని రాజు శుక్లాతో ప్రేమని ఎలా నిజం చేసుకున్నాడనేది మిగతా కథ.

ఎలావుంది కథ

గాలి కథ. దీన్ని గాలి ప్రేక్షకులు చూస్తారు. గాలి ప్రేక్షకులైనా ఇప్పుడున్నారో లేదో. వుంటే వారం వారం విడుదలవుతున్న గాలి సినిమాలు గాలిలో కలిసిపోవు. సుడిగాలి సుధీర్ తన ఇంకో సినిమాని ఈదురు గాలిలో గల్లంతు చేశాడు. దర్శకుడు నిర్మాత కూడా అయి, వడగాలి సినిమా తీయడానికి చాలా ధైర్యముండాలి.

ఆవారా హీరో, తప్పు చేసి పారిపోయి రిచ్ హీరోయిన్ని ప్రేమించడం, ఆ రిచ్ హీరోయిన్ ఫాదర్ విలన్ గా మారడం, తప్పుచేసి పారిపోయినందుకు గ్యాంగ్ వెతకడం, పోలీసులు గాలించడం టైపు సినిమాలు ఏనాటివి. ఊర మాస్ నటనలు, పంచ్ డైలాగులు, డ్యూయెట్లు, డాన్సులు, ఫైట్లూ, ముతక విలన్లూ ఇంకా చూసే ప్రక్షకులున్నారా? ఇలా తీస్తే ఈ రెండేళ్ళల్లో గోపీచంద్ నటించిన సీటీ మార్, ఆరడుగుల బుల్లెట్, పక్కా కమర్షియల్ సినిమాలనే చూడలేదు మాస్ ప్రేక్షకులు కూడా.

సుడిగాలి సుధీర్ తను పాపులర్ బ్రాండ్ నేమ్ కాబట్టి సినిమాలో విషయం కాదు, తనని ఎంజాయ్ చేసేందుకు అభిమానులు విరగబడతారనే ఉద్దేశం కావచ్చు. ఈ ఉద్దేశంతో చేసినవే గత రెండు సినిమాలు పోయాయి. తను టీవీలో కమెడియన్ గా మాత్రమే కాదు, వెండితెర మీద ఆల్ రౌండర్ సూపర్ స్టార్ నని నిరూపించుకునేదుకు పడుతున్న తాపత్రయం వెండి తెరమీద స్పష్టంగా కన్పిస్తోంది.

అరిగిపోయిన పాత కథైనా కొత్తగా చెప్పేందుకు ఎంతో కొంత ప్రయత్నం కూడా చేయలేదు. హీరో జైలు కెళ్ళడంతో ప్రారంభమయ్యే సినిమా ఫ్లాష్ బ్యాక్ లో హీరో ఎందుకు జైలుకెళ్ళాడో చెప్పుకొస్తారు. ఫ్లాష్ బ్యాక్ పూర్తయ్యాక, హీరో జైలు నుంచి బయటికొచ్చి క్లయిమాక్స్ పూర్తి చేసి హీరోయిన్ ని పెళ్ళి చేసుకోవడంతో సినిమా ముగుస్తుంది. ఈ మధ్యలో వచ్చే ఏ సన్నివేశం కూడా కొత్తగా వుండదు. చూసి చూసి వున్న పాత సన్నివేశాలే పేర్చి సినిమా అయిందన్పించారు. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ అనుకుని వేసిన సీను చూస్తే ప్రేక్షకులు తమ తలల్ని బ్యాంగ్-బ్యాంగ్-బ్యాంగ్ మని గోడకేసి కొట్టుకుని పడిపోవడమే!

నటనలు- సాంకేతికాలు

సుధీర్ ఇమేజికి, స్థాయికి వ్యతిరేకంగా మాస్ హీరోగా బిల్డప్ ఇచ్చే షాట్స్ తో నింపే శారు సినిమాని. కామెడీ సీన్లు కూడా వీర హీరోయిజపు ఎలివేషన్ షాట్షే. ఇక ఫైట్స్ చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో సుధీర్ చేసిందల్లా బిల్డప్ షాట్స్ నటించడమే. తల్లిదండ్రులతో సెంటిమెంటు సీన్లకి కూడా బిల్డప్ షాట్సే. కెమెరాతో తీస్తే తనకి బిల్డప్ షాట్సే తీయాలన్న కెమెరా జీవిగా మారిపోయాడు. సినిమా హీరోగా చోటు సంపాదించాలనుకునే సుధీర్ నటనంటే బిల్డప్పులే నని కొత్త నిర్వచనం ఇస్తున్నట్టు వుంది.

హీరోయిన్ గెహ్నా సిప్పీ అందచందాలతో కనువిందు చేసే బాధ్యతలు చేపట్టింది. జడ్జిగా ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ, లాయర్ గా కమెడియన్ సప్తగిరి కనిపిస్తారు. పోలీసు పాత్రలో పృథ్వీ కన్పిస్తే, షకలక శంకర్ కామెడీ చేస్తూ కన్పిస్తాడు.

సీనియర్ ఛాయాగ్రాహకుడు రామ్ ప్రసాద్ కెమెరావర్క్ ఎప్పటిలా క్వాలిటీతోనే వుంది. తన క్వాలిటీకి తగ్గ విషయం సినిమాలో లేదు. యాక్షన్ సీన్స్ సుధీర్ బిల్డప్స్ కోసం కాబట్టి ఆర్భాటంగా తీర్చి దిద్దారు. బీమ్స్ సిసీరియో సంగీతంలో పాటలు మాత్రం సుధీర్ ని హీరోగా నిలబెట్టే మ్యూజికల్స్ గా లేవు. హిట్ సాంగ్స్ ఇవ్వాలంటే ఈ రోజుల్లో అంతా సులభం కాదు. మొత్తానికి 'గాలోడు' తర్వాత సుడిగాలి సుధీర్ తదుపరి బ్లాక్ బస్టర్ కోసం ఉత్కంఠతో ఎదురు చూద్దాం!

First Published:  19 Nov 2022 6:18 AM GMT
Next Story